హెల్మెట్‌పై ఆర్టీఏ వినూత్న ప్రచారం
గులాబీలతో నిరసన స్వాగతం
శిరస్త్రాణం వినియోగంపై వాహనదారులకు అవగాహన
సాక్షి,సిటీబ్యూరో : హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు రవాణాశాఖ వినూత్న ప్రచారం చేపట్టింది. హెల్మెట్ ధరించకుండా ఆర్టీఏ కార్యాలయాల్లోకి వచ్చే వారికి గాంధీగిరి తరహాలో గులాబీలతో నిరసన స్వాగతం పలికింది. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ హెల్మెట్ లేని వాహనదారులకు గులాబీలను అందజేశారు. హెల్మెట్‌తో వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. అలాగే వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలను అందజేశారు. రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు.
ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25 శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే మృత్యువాత పడ్డారని జేటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొనేవారు వాహనంతో పాటు హెల్మెట్ కూడా తీసుకోవాలని రఘునాథ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు జీపీఎన్ ప్రసాద్, దశరథం పాల్గొన్నారు. కాగా, ఖైరతాబాద్‌తో పాటు సికింద్రాబాద్, మలక్‌పేట, ఉప్పల్, అత్తాపూర్, మేడ్చల్ తదితర ఆర్టీఏ కార్యాలయాల్లోను హెల్మెట్‌పై అవగాహన కోసం అధికారులు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టారు.
18 నుంచి హెల్మెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్
హెల్మెట్‌పై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్న ఆర్టీఏ అధికారులు ఈ నెల 18 నుంచి హెల్మెట్ లేకుండా వచ్చే వాహనదారులను ఆర్టీఏ కార్యాలయాల్లోకి అనుమతించకుండా నిలిపివేయాలని నిర్ణయించారు. హెల్మెట్ ధరించని వారికి వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర పౌరసేవలను కూడా అందజేయబోమని జేటీసీ స్పష్టం చేశారు.