Helmet Usage
-
హెల్మెట్ లేకుంటే నా ‘తోపుడు బండి’ని ఆపేస్తారు సార్..!
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఎవరూ లేరు కదా అని హెల్మెట్ పెట్టుకోకపోయినా.. నిఘా కెమెరాల ద్వారానే చలాన్లు జారీ చేస్తున్నారు పోలీసులు. దీంతో భారీగా జారీ అవుతున్న చలాన్లతో ప్రజలు బెబెలెత్తిపోతున్నారు. కొందరు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారుకూడా. ఈ క్రమంలో తోపుడు బండిపై కూరగాయలు విక్రయించే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హెల్మెట్ లేకుంటే నా బండిని పోలీసులు ఆపేస్తారు సార్ అంటూ అతడు చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడియోను షాకాస్మ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. తోపుడు బండికి హెల్మెట్ ఎందుకు ధరించావని వీడియో తీసిన వ్యక్తి అడిగాడు. దానికి,హెల్మెట్ లేకుంటే పోలీసులు అడ్డుకుంటారని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో ఈ నిబంధన కేవలం బైక్‌లకు మాత్రమేనని ఆ వ్యక్తికి వివరించే ప్రయత్నం చేశాడు వీడియో తీసిన వ్యక్తి. ట్విటర్లో వీడియో షేర్ చేస్తూ బ్రదర్ నీ తెలివి అమోఘం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అక్టోబర్ 9వ తేదీన వీడియో పోస్ట్ చేయగా.. 28,800వ్యూస్ వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫైన్లు వేస్తున్నారనే కారణంగా అమాయకులు భయపడుతున్నారు, చాలా బాధకరమైన విషయం, సరైన అవగాహన లేదు అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. కొందరి తప్పుడు సూచనలతో అమాయకులు భయపడుతున్నారంటూ మరొకరు పేర్కొన్నారు. Bhai apka knowledge to Kamal hai bhai 🤣🤣 pic.twitter.com/twjvQhNe6a — ShaCasm (@MehdiShadan) October 9, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
పొద్దునే లేచి ఎవరి ముఖం చూశాడో.. అదృష్టమంటే నీదే భయ్యా!
ఎన్నో ప్రమాదాల్లో హెల్మెట్ చాలా మంది ప్రాణాలను కాపాడింది. పోలీసులు సైతం బైకర్లు తప్పకుండా హెల్మెట్ ధరించాలని హెచ్చరిస్తూనే ఉంటారు. ఇక, హెల్మెట్ పెట్టుకోని వారికి జరిమానాలు సైతం విధిస్తుంటారు. తాజాగా ఓ షాకింగ్ వీడియోను ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. హెల్మెట్ అవసరాన్ని మరోసారి గుర్తు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ బైక్‌పై హెల్మెట్ ధరించి వెళ్తున్నాడు. ఇంతలో బైక్ ముందు వెళ్తున్న ఓ కారు సడెన్‌గా టర్న్ తీసుకోబోయింది. దీంతో, బైకర్ ఒక్కసారిగి బ్రేక్ వేయడంతో ఎగిరి కిందపడ్డాడు. బైక్ ముందుకు దూసుకెళ్లి పక్కనే డివైడర్‌పైనున్న ఓ కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. ఈ సందర్భంలో బైకర్ హెల్మెట్ పెట్టుకోవడంతో కిందపడినా తలకు గాయంకాలేదు. కాగా, రోడ్డుపై నుంచి బైకర్ లేచినిల్చున్నాడు. లేచిన వెంటనే బైక్ ఢీకొట్టిన కరెంట్ పోల్ బైకర్ తలపై పడిపోయింది. దీంతో, అతడు పెట్టుకున్న హెల్మెట్ రెండు ముక్కలైంది. కాగా, ఈ రెండు సందర్భాల్లో హెల్మెట్ సదరు బైకర్ ప్రాణాలను కాపాడింది. ఇక, రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ క్రమంలో వీడియోకు.. హెల్మెట్ పెట్టుకున్న వారికి దేవుడు సాయం చేస్తాడు అని క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. God helps those who wear helmet !#RoadSafety#DelhiPoliceCares pic.twitter.com/H2BiF21DDD — Delhi Police (@DelhiPolice) September 15, 2022 -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బైక్‌పై నుంచి ఎగిరి బస్సు టైర్ కింద..
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని జరిమానాలు సైతం విధిస్తుంటారు. తాజాగా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో కర్నాటక పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ఈ వీడియోలో ఓ బైకర్ స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఓ బస్సు బ్యాక్ టైర్ కిందపడిపోతాడు. అయితే, ఈ సమయంలో బైకర్ ఐఎస్ఐ స్టాండర్డ్ మార్క్ ఉన్న హెల్మెట్‌ను ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో, ప్రతీ ఒక్కరూ విధిగా స్టాండర్ట్ ఉన్న హెల్మెట్‌ను ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಐ ಎಸ್ ಐ ಮಾರ್ಕ್ ಹೆಲ್ಮೆಟ್" ಜೀವರಕ್ಷಕ" Good quality ISI MARK helmet saves life. pic.twitter.com/IUMyH7wE8u — Dr.B.R. Ravikanthe Gowda IPS (@jointcptraffic) July 20, 2022 -
'ప్లీజ్ ఆ నిబంధనను తప్పనిసరి చేయండి'
దుబాయ్ : క్రికెట్లో గాయాలనేవి సహజం. ప్రతి క్రికెటర్‌కు గాయాలతో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. గాయల తీవ్రతతో కొన్నిసార్లు ఆటకు దూరమైన సందర్భాలు ఉంటే.. మరికొన్ని మాత్రం క్రికెటర్ల ప్రాణం మీదకు తెస్తుంటాయి. ఒక్కోసారి మనం చేసే తప్పులే మనకు గాయాలను కలిగిస్తుంటాయి.2014 నవంబర్‌లో ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బంతి హెల్మెట్ కింది మెడ భాగంలో బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే కుప్పకూలిన హ్యూస్ రెండు రోజుల తర్వాత మరణించడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ విషాదవార్త అప్పటి క్రికెట్లో ఒక చెడు జ్ఞాపకంగా నిలిచిపోయింది. (చదవండి : క్రికెట్‌కు వాట్సన్ గుడ్‌బై) తాజాగా ఐపీఎల్ 13వ సీజన్లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే అక్టోబర్ 24వ తేదీన కింగ్స్ పంజాబ్‌తో సన్‌రైజర్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో క్రీజులో ఉన్న విజయ్ శంకర్ పరుగు తీసే క్రమంలో కింగ్స్ ఆటగాడు నికోలస్ పూరన్ విసిరిన త్రో అతని మెడకు బలంగా తగిలింది. దీంతో విజయ్ శంకర్ తీవ్రమైన గాయంతో విలవిలలాడడం కనిపించింది. వెంటనే ఫిజియోథెరపీ వచ్చి చికిత్స అందించాడు. కానీ అదృష్టవశాత్తు ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. దీనిపై సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. 'సాధారణంగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్లు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌కు వస్తే బ్యాటింగ్ ఆటగాడు హెల్మెట్ ధరించడం.. ఒక స్పిన్నర్ బౌలింగ్‌కు వస్తే హెల్మెట్‌ను తీసేయడం చేస్తున్నారు.కానీ ఈ పద్దతిని మార్చాలని.. బౌలర్ స్పిన్నరైనా.. ఫాస్ట్ బౌలరైనా బ్యాట్స్‌మన్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించే నిబంధనను తీసుకురావాలి. హెల్మెట్ అనేది ఆటగాళ్లకు రక్షణగా నిలుస్తుందని.. ఈ నిబంధనను తప్పనిసరి చేయకపోతే ఆటగాళ్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే ఇకపై స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ ఏదైనా సరే హెల్మెట్ తప్పనిసరి ధరించాలనే నిబంధనను తీసుకురావాలని ఐపీసీని విజ్ఞప్తి చేస్తున్నా 'అంటూ ట్విటర్లో తెలిపాడు. The game has become faster but is it getting safer? Recently we witnessed an incident which could’ve been nasty. Be it a spinner or pacer, wearing a HELMET should be MANDATORY for batsmen at professional levels. Request @icc to take this up on priority.https://t.co/7jErL3af0m — Sachin Tendulkar (@sachin_rt) November 3, 2020 -
హెల్మెట్ లేకపోతే స్వీట్లు : సొంత భద్రత కోసమే
ఇంఫాల్: ప్రయాణికుల భద్రత కోసం ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అధికారులు పదే పదే చెబుతున్నా..నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూనే ఉంది. హెల్మెట్ ధరించని వాహన చోదకులకు జరిమానా విధిస్తున్నప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పేపీ కనిపించడంలేదు. దీంతో మణిపూర్ పోలీసులు వినూత్నపద్ధతిని అవలబింస్తున్నారు. హెల్మెట్‌లెస్ రైడర్లకు జరిమానా విధించే సాధారణ పద్ధతికి విరుద్ధంగా మణిపూర్ చురాచంద్‌పూర్‌లోని ట్రాఫిక్ కంట్రోల్ పోలీసు సిబ్బంది స్వీట్లు పంపిణీ చేసి భద్రతా చిట్కాలపై వారికి సలహా ఇస్తున్నారు. గతకొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిని పలకరించి, ప్రత్యేకంగా స్వీట్లు అందించి మరీ భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. జరిమానాలు విధించడం వల్ల ఎటువంటి మార్పు రావడం లేదు.. కనీసం ఇలా అయినా ప్రజల్లో మార్పు వస్తుందని భావిస్తున్నామనీ, తద్వారా వారిలో భద్రతా భావాన్ని ప్రేరేపించడమే తమ ఉద్దేశ్యమని ఎస్సీ అమృత సిన్హా వెల్లడించారు. ప్రమాద సమయంలో ప్రయాణికుణి తలకు తీవ్రమైన, ప్రాణాంతకమైన దెబ్బలు తగలకుండా హెల్మెట్ రక్షిస్తుంది, ఇదంతా వారి సొంత భద్రత కోసమే అని సిన్హా పేర్కొన్నారు. మరోవైపు ఇంఫాల్‌కు చెందిన పాయా సువాంటక్ మాట్లాడుతూ ఇది ప్రజల అభివృద్ధికి నాంది అని అభిప్రాయపడ్డారు. ఈ చర్య హెల్మెట్ ధరించాలనే విషయం ప్రతీ క్షణం తనకు గుర్తు చేస్తుందంటూ పోలీసు శాఖ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. -
హెల్మెట్‌తో వెన్నెముకకు రక్ష
వాషింగ్టన్: ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల వెన్నెముక మెడ పైభాగానికి (సర్వైకల్ స్పైన్) గాయం కాకుండా తప్పించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రమాద సమయంలో వెన్నెముకకు గాయం కాకుండా హెల్మెట్ కాపాడలేదని.. పైగా హెల్మెట్ వల్ల కొన్నిసార్లు వెన్నెముకకు గాయమయ్యే ప్రమాదం కూడా ఉందని అనేకమంది భావిస్తారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలోని యూని వర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 2010–15 మధ్య విస్కాన్సిన్ ఆస్పత్రిలో నమోదైన 1,061 మంది వాహన ప్రమాద బాధితుల మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. వీరిలో 323 మంది ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించగా.. 738 మంది హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ లేని వారిలో ఈ తరహా గాయాలయ్యే అవకాశం 10.8% ఉండగా.. ధరించిన వారిలో 4.6%గా ఉందన్నారు. -
హెల్మెట్‌పై ఆర్టీఏ వినూత్న ప్రచారం
గులాబీలతో నిరసన స్వాగతం శిరస్త్రాణం వినియోగంపై వాహనదారులకు అవగాహన సాక్షి,సిటీబ్యూరో : హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు రవాణాశాఖ వినూత్న ప్రచారం చేపట్టింది. హెల్మెట్ ధరించకుండా ఆర్టీఏ కార్యాలయాల్లోకి వచ్చే వారికి గాంధీగిరి తరహాలో గులాబీలతో నిరసన స్వాగతం పలికింది. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ హెల్మెట్ లేని వాహనదారులకు గులాబీలను అందజేశారు. హెల్మెట్‌తో వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. అలాగే వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలను అందజేశారు. రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25 శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే మృత్యువాత పడ్డారని జేటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొనేవారు వాహనంతో పాటు హెల్మెట్ కూడా తీసుకోవాలని రఘునాథ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు జీపీఎన్ ప్రసాద్, దశరథం పాల్గొన్నారు. కాగా, ఖైరతాబాద్‌తో పాటు సికింద్రాబాద్, మలక్‌పేట, ఉప్పల్, అత్తాపూర్, మేడ్చల్ తదితర ఆర్టీఏ కార్యాలయాల్లోను హెల్మెట్‌పై అవగాహన కోసం అధికారులు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 18 నుంచి హెల్మెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ హెల్మెట్‌పై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్న ఆర్టీఏ అధికారులు ఈ నెల 18 నుంచి హెల్మెట్ లేకుండా వచ్చే వాహనదారులను ఆర్టీఏ కార్యాలయాల్లోకి అనుమతించకుండా నిలిపివేయాలని నిర్ణయించారు. హెల్మెట్ ధరించని వారికి వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర పౌరసేవలను కూడా అందజేయబోమని జేటీసీ స్పష్టం చేశారు.