
ఇంఫాల్: ప్రయాణికుల భద్రత కోసం ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అధికారులు పదే పదే చెబుతున్నా..నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూనే ఉంది. హెల్మెట్ ధరించని వాహన చోదకులకు జరిమానా విధిస్తున్నప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పేపీ కనిపించడంలేదు. దీంతో మణిపూర్ పోలీసులు వినూత్నపద్ధతిని అవలబింస్తున్నారు. హెల్మెట్‌లెస్ రైడర్‌లకు జరిమానా విధించే సాధారణ పద్ధతికి విరుద్ధంగా మణిపూర్ చురాచంద్‌పూర్‌లోని ట్రాఫిక్ కంట్రోల్ పోలీసు సిబ్బంది స్వీట్లు పంపిణీ చేసి భద్రతా చిట్కాలపై వారికి సలహా ఇస్తున్నారు. గతకొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిని పలకరించి, ప్రత్యేకంగా స్వీట్లు అందించి మరీ భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
జరిమానాలు విధించడం వల్ల ఎటువంటి మార్పు రావడం లేదు.. కనీసం ఇలా అయినా ప్రజల్లో మార్పు వస్తుందని భావిస్తున్నామనీ, తద్వారా వారిలో భద్రతా భావాన్ని ప్రేరేపించడమే తమ ఉద్దేశ్యమని ఎస్సీ అమృత సిన్హా వెల్లడించారు. ప్రమాద సమయంలో ప్రయాణికుణి తలకు తీవ్రమైన, ప్రాణాంతకమైన దెబ్బలు తగలకుండా హెల్మెట్ రక్షిస్తుంది, ఇదంతా వారి సొంత భద్రత కోసమే అని సిన్హా పేర్కొన్నారు. మరోవైపు ఇంఫాల్‌కు చెందిన పాయా సువాంటక్ మాట్లాడుతూ ఇది ప్రజల అభివృద్ధికి నాంది అని అభిప్రాయపడ్డారు. ఈ చర్య హెల్మెట్ ధరించాలనే విషయం ప్రతీ క్షణం తనకు గుర్తు చేస్తుందంటూ పోలీసు శాఖ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment