మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి రాకేష్‌ బల్వాల్‌ | Senior Cop Rakesh Balwal Called Back To Manipur After Fresh Violence | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సీనియర్‌ ఐపీఎస్‌.. ఎవరీ రాకేష్‌ బల్వాల్‌!

Published Thu, Sep 28 2023 1:57 PM | Last Updated on Thu, Sep 28 2023 2:37 PM

Senior Cop Rakesh Balwal Called Back To Manipur After Fresh Violence - Sakshi

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మైతేయి, కుకీ వర్గాల మధ్య మొదలైన హింసాత్మక ఘర్షణలు నాలుగు నెలలుగా కొనసాగుతూనేన్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. కోట్ల విలువైన ఆస్తులు కాలి బూడిదయ్యాయి. తాజాగా జూలైలో కనిపించకుండా పోయిన మైతేయి వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైనట్లు ఫోటోలు బయటకు రావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. 

రాష్ట్రంలోని విద్యార్థులు ఘటనకు నిరసనగా ఇంఫాల్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ బల్వాల్‌ను మణిపూర్‌కు రప్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఉన్న రాకేష్ బల్వాల్‌ను.. తన సొంత కేడర్‌ అయిన మణిపూర్‌కు బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించింది.

ఈ మేరకు కేంద్ర హోంశాఖ  గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అల్లర్ల కట్టడి కోసం దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా మరింత మంది అధికారుల అవసరాన్ని పేర్కొంటూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన చేసిన దాదాపు ఒక నెల తర్వాత క్యాబినెట్ నియామకాల కమిటీ దీనిని ఆమోదించింది.

ఎవరీ రాకేష్‌ బల్వాల్‌?
రాకేశ్ బల్వాల్‌మణిపుర్‌ కేడర్‌కు చెందిన  2012 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. మణిపుర్‌ కేడర్‌లో ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2018లో ఎన్‌ఐఏలో ఎస్పీగా పదోన్నతి పొంది నాలుగేళ్లపాటు పనిచేశారు. 2019లో పుల్వామా లో జరిగిన భీకర ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన  ఘటనను దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఏ బృందంలో రాకేశ్ సభ్యుడిగా ఉన్నారు.

అనంతరం 2021 డిసెంబరులో పదోన్నతిపై AGMUT (అరుణాచల్ ప్రదేశ్‌, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాలు) కేడర్‌కు బదిలీ అయ్యారు. జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ విభాగంలో శ్రీనగర్‌ సీనియర్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గత కొన్నిరోజులుగా మణిపుర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన తిరిగి సొంత కేడర్‌ పంపించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. 

మరోవైపు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దాదాపు రాష్ట్రమంతటా AFSPA చట్టం పరిధిని విస్తరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ మెబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించింది. అక్టోబర్‌ 1 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement