కర్మీర్‌ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ  | 90percent Tourist Bookings For Kashmir Cancelled, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

కర్మీర్‌ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ 

Published Thu, Apr 24 2025 1:03 AM | Last Updated on Thu, Apr 24 2025 1:32 PM

90percent Tourist Bookings For Kashmir Cancelled

కర్మీర్‌లో 80 శాతం రిజర్వేషన్లు రద్దు 

ఢిల్లీలో రద్దయిన 90 శాతం రిజర్వేషన్లు  

శ్రీనగర్‌/న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి.. జమ్మూకర్మీ ర్‌ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జమ్మూకశ్మీర్‌ పర్యటనకు ప్లాన్‌ చేసుకున్నవారంతా ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ట్రావెల్‌ ఏజెన్సీల్లో దాదాపు 90శాతం రిజర్వేషన్లు రద్దయ్యాయి. గతంలో కర్మీర్‌లో ఉగ్రదాడులు జరిగాయి. కానీ ఈ దాడుల్లో ఇంతకు ముందెన్నడూ పర్యాటకులను గుర్తించి చంపలేదు. పహల్గాం సంఘటన తర్వాత మాత్రం మొత్తం పర్యాటక పరిశ్రమ, భాగస్వాములందరినీ ప్రభావితం చేసింది. 

 కర్మీర్‌లో దాదాపు 80శాతం రిజర్వేషన్స్‌ రద్దయ్యాయి. జమ్మూకర్మీర్‌కు దాదాపు 90 శాతం బుకింగ్‌లను పర్యాటకులు రద్దు చేసుకున్నట్లు ఢిల్లీలోని పలు ట్రావెల్‌ ఏజెన్సీలు తెలిపాయి. వచ్చే నెలలో కర్మీర్‌లో పర్యటించడానికి రిజర్వేషన్లు చేసుకున్నారని, ఇప్పుడు ఇప్పుడు రద్దు చేయాలని కోరుతున్నారని వెల్లడించాయి. కర్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్, హజన్‌ వ్యాలీ, తులిప్‌ గార్డెన్స్‌ ఎక్కువగా బుక్‌ అయ్యాయని, ఇప్పుడు అవన్నీ రద్దయ్యాయని తెలిపారు. అక్కడకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టబోమని, రిఫండ్‌ చేయాలని కోరుతున్నారని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. 

అయితే కొంతమంది పర్యాటకులు కర్మీర్‌కు బదులుగా వేరే ప్రాంతాలకు మార్చుకుంటున్నారని ఢిల్లీలోని ట్రావెల్‌ ఏజెన్సీలు నివేదించాయి. ‘‘కొన్ని కుటుంబాలు బస్సు, విమాన టిక్కెట్ల నుంచి హోటళ్ల వరకు అన్నీ ముందుగానే బుక్‌ చేసుకున్నారు. అయితే ఉగ్రదాడి వార్త తెలిసిన మరుక్షణం నంచే రద్దు చేయాలని మాకు కాల్స్‌ రావడం ప్రారంభించాయి’’అని ఓ ట్రావెల్స్‌ యజమాని తెలిపారు. 

జమ్ముకర్మీర్‌ పర్యటనకు కీలక కేంద్రంగా ఉన్న కోల్‌కతాలోనూ అనేక మంది రిజర్వేషన్లను రద్దు చేసుకున్నారు. తమ రిజర్వేషన్లను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని క్లయింట్ల నుంచి నిరంతరాయంగా కాల్స్‌ వస్తున్నాయని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. అయితే.. జమ్మూకర్మీర్‌కు బుకింగ్‌ చేయడం నిలిపేయాలని ఆదేశాలు వచ్చినట్లు మరికొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు తెలిపాయి. అన్ని రవాణా, బుకింగ్‌లను నిలిపివేయాలని ట్రావెల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ శ్రీనగర్‌ తమను ఆదేశించిందని, తదుపరి నోటీసు వచ్చే వరకు జమ్మూకర్మీర్‌ పర్యటనలకోసం కొత్త బుకింగ్‌లు చేయబోమని ప్రకటించాయి.  

ఇప్పట్లో కర్మీర్‌కు పర్యాటకులు రావడం కష్టమే... 
‘పర్యటనలు రద్దు చేసుకుని పర్యాటకులు వెళ్లిపోతున్నారు. మరో నెల రోజుల ప్యాకేజీలను కూడా రద్దు చేశారు. ఇలాంటి ఘటనల తరువాత కూడా పర్యాటకులు ఇక్కడ ఉంటారని, వెంటనే ఇక్కడికి వస్తారని ఆశించలేం. గత కొన్నేళ్లుగా చేసిన మంచి పనులన్నీ వృథాగా పోయాయి. కర్మీర్‌కు మళ్లీ పర్యాటకులను రప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది’శ్రీనగర్‌కు చెందిన ట్రావెల్‌ ఆపరేటర్‌ ఐజాజ్‌ అలీ తెలిపారు.  

నష్టాన్ని తగ్గిస్తాం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ 
పహల్గాం దాడి నేపథ్యంలో జమ్ముకర్మీర్‌లో పర్యాటక రంగంపై పడే నష్టాన్ని తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. జమ్మూకర్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యాటక శాఖ కార్యదర్శితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.  

ఎక్కడికక్కడ భద్రత... 
భయంతో చాలామంది పర్యాటకులు వెళ్లిపోతుండగా.. చాలా కొద్దిమంది ఉండేందుకు సుముఖత చూపుతున్నారు. ‘దాడి గురించి వినగానే భయం వేసింది. ముంబైకి తిరిగి వెళ్లాలనుకున్నాం. కానీ హోటల్‌ సిబ్బంది మేం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా చేశారు. మాకు ఎలాంటి భయం లేదు. ఎక్కడికక్కడ భద్రత ఉంది. పహల్గాం సందర్శించాలి అనుకుంటున్నాం. పరిస్థితి బాగుంటే రేపు అక్కడికి వెళ్తాం. బయటకు వచ్చి చూడగా ఎక్కడ చూసినా పోలీసులు, సైన్యం ఉండడంతో టూరిస్టులు సేఫ్‌గా ఫీలవుతున్నారు. ఇప్పుడు భయం తగ్గుముఖం పడుతోంది’అని మహారాష్ట్రకు చెందిన ఓ పర్యాటకురాలు చెబుతున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement