రాష్ట్రంలో దాదాపు 30 మంది మహిళా ఐపీఎస్‌లు
కేవలం ముగ్గురు మాత్రమే యూనిట్ ఆఫీసర్లుగా
వీరిలో ఇద్దరు ఎస్పీలు కాగా ఒకరు కమిషనర్
పత్తా లేని ‘33 శాతం’ ఫోకల్ పోస్టింగ్స్ అంశం
ఈసారి బదిలీల్లో అయినా పరిస్థితులు మారేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో చర్యలు తీసుకున్నారు. వీటిలో భాగంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగంలోని మహిళా ఐపీఎస్‌ల పరిస్థితి మకుటం లేని మహిళామణుల మాదిరిగా మారింది. ఇక్కడ పని చేస్తున్న ఉమెన్ ఐపీఎస్‌ల సంఖ్య దాదాపు 30 వరకు ఉంది. అయితే యూనిట్ ఆఫీసర్లుగా పిలిచే కీలకమైన ఫోకల్ పోస్టుల్లో ఉన్న వారు మాత్రం కేవలం ముగ్గురే. త్వరలో ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడైనా ఈ పరిస్థితులు మార్చే ప్రయత్నం చేస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫోకల్‌లోనూ రెండు రకాలైన పోస్టులు..
పోలీసు శాఖలో సాధారణంగా రెండు రకాలైన పోస్టులు ఉంటాయి. శాంతిభద్రతల విభాగం వంటి ప్రాధాన్యం గల వాటిని ఫోకల్ అని, సీఐడీ, ట్రాఫిక్ వంటి ప్రాధాన్యం లేని వాటిని నాన్–ఫోకల్ పోస్టులని వ్యవహరిస్తుంటారు. అయితే ఈ ఫోకల్ పోస్టుల్లోనూ రెండు రకాలైనవి ఉన్నాయి. ఏదైనా జిల్లా లేదా కమిషనరేట్‌కు నేతృత్వం వహించే అవకాశం ఉన్న ఎస్పీ ఆపై స్థాయి హోదాలోని పోస్టులను యూనిట్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ఎస్పీ హోదాలోనే ఉన్నప్పటికీ... కమిషనరేట్లలోని జోన్లకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా (డీసీపీ) పని చేసే వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, అధికారం ఉండదు. ఈ నేపథ్యంలో ఇవీ ఫోకలే అయినప్పటికీ అక్కడి పని చేసే వారిని యూనిట్ ఆఫీసర్‌గా పరిగణించరు.
‘33’ కాదు కదా ‘10’ కూడా లేదు...
పోలీసు విభాగంలో వివిధ స్థాయిల్లో జరిగే రిక్రూట్‌మెంట్‌లో సైతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అయితే వీరికి పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే పోస్టింగ్స్‌లోనూ అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో భావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, 9 కమిషనరేట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే మొత్తమ్మీద ఉన్న 39 యూనిట్లలో పదికి పైగా మహిళా ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో పని చేయాలి. అయితే వాస్తవానికి పది శాతం కూడా యూనిట్ ఆఫీసర్లుగా మహిళా ఐపీఎస్‌లు లేరు. నిర్మల్ జిల్లాకు జానకీ శర్మిల, కామారెడ్డి జిల్లాకు సీహెచ్ సింధు శర్మ ఎస్పీలుగా ఉండగా... సిద్ధిపేట కమిషనరేట్‌కు బి.అనురాధ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురూ మినహా మరే ఇతర యూనిట్‌కు మహిళా ఐపీఎస్ నేతృత్వంలో లేదు. కేవలం సీఐడీ, ఎస్‌ఐబీ వంటి విభాగాలు మాత్రమే ఉన్నాయి.
ఈసారైనా ఈ సీన్ మారేనా..?
ఈ ముగ్గురు మహిళా ఐపీఎస్‌ల్లోనూ కేవలం సింధు శర్మ మాత్రమే డైరెక్ట్ ఐపీఎస్ కావడం గమనార్హం. మిగిలిన ఇద్దరూ రాష్ట్ర పోలీసు విభాగంలో అడుగుపెట్టి, నిరీ్ణత కాలం పని చేసిన తర్వాత ఐపీఎస్ హోదా పొందిన వారే. సింధు శర్మ ప్రస్తుతం నిజామాబాద్ కమిషనరేట్‌కు సైతం ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. రాజకీయపరంగా అత్యంత సున్నితమైన ఈ రెండు యూనిట్లను ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారనే పేరు పొందారు. ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో పెద్ద స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటి నేపథ్యంలో మహిళా ఐపీఎస్ అధికారులకు సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ఆయా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం ఈ కోణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment