sindhu sharma
-
చిల్డ్రన్ కేర్: పనిచోటే లాలిపాట
‘ఎంతైనా తల్లి మనసు’ అనేది మనం తరచుగా వినే మాట. తల్లి ఎక్కడ ఉన్నా మనసు మాత్రం పిల్లలపైనే ఉంటుంది. ఆ పిల్లలు పసి పిల్లలు అయితే? ఆ బాధ తల్లికే తెలుస్తుంది. పసిపిల్లలను ఇంట్లో ఎవరికో ఒకరికి అప్పగించి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు చాలామంది మహిళా ఉద్యోగులకు లేదు. ఈ పరిస్థితుల్లో పసిబిడ్డలను తమతోపాటు తమ పని ప్రదేశానికి తీసుకువస్తారు. అలా అని వారు అక్కడ నిశ్చింతగా... సంతోషంగా ఉంటున్నారా... అంటే అదీ లేదు. ఇలాంటి పరిస్థితిని గమనించిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ అందుకు ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించారు. ‘చైల్డ్ కేర్ సెంటర్’ ద్వారా తల్లీబిడ్డలిద్దరూ సంతోషంగా ఉండే ఏర్పాటు చేశారు.పసిబిడ్డలను తీసుకుని ఉద్యోగ విధులకు హాజరు అవుతున్న మహిళా ఉద్యోగులుపాలివ్వడం నుంచి అన్ని పనులు దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. ఆఫీసులో పిల్లలు ఏడిస్తే తోటి ఉద్యోగులు చిరాకు పడతారు. కొందరైతే ముఖం మీదే ‘పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి రావచ్చుగా’ అని గట్టిగా మాట్లాడతారు. కామారెడ్డి జిల్లాపోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఏఆర్ కానిస్టేబుల్స్ కు తమ వెంట పిల్లలను తీసుకువచ్చి వాళ్ల ఆలనాపాలనా చూసుకుంటూ ఉద్యోగ విధులు నిర్వర్తించడం పెద్ద సవాలుగా మారింది.ఆఫీసులో వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన జిల్లా ఎస్పీ సింధుశర్మ పిల్లల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. కార్యాలయం మొదటి అంతస్తులో ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’ ఏర్పాటు చేయించారు. పిల్లలకుపాలు ఇవ్వడం నుంచి వారిని ఆడించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’లో ఏర్పాటు చేశారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలను సెలవులు ఉన్న రోజుల్లో ఇంటి దగ్గర చూసుకునేవారు ఎవరూ లేక చాలా మంది ఉద్యోగులు వారిని తీసుకొని ఆఫీసుకు వస్తుంటారు. అలాంటి పిల్లలు కూడా ‘చైల్డ్ కేర్ సెంటర్’లో సంతోషంగా గడుపుతున్నారు.ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు గార్డ్ డ్యూటీ ఉంటుంది. షిఫ్టుల వారీగా వారికి బాధ్యతలు కేటాయిస్తారు. అలాంటి సందర్భంలో పిల్లల్ని చూసుకోవడానికి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’ఎంతో ఊరట ఇస్తోంది. ‘పిల్లల కంటే ఉద్యోగం ముఖ్యమా? ఉద్యోగం మానేయ్’లాంటి కరుకు మాటలు...‘నువ్వు హాయిగా డ్యూటీకి వెళ్లిపోతే పిల్లాడిని పట్టుకొని నేను నానా చావులు చావాలా!’లాంటి ఈసడింపులు ఇక ముందు వినిపించకపోవచ్చు. ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవాలంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎన్నో సమస్యలు అడ్డుగోడగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో ‘చైల్డ్ కేర్ సెంటర్’ అనేది తల్లీబిడ్డల కన్నుల్లో సంతోషాన్ని నింపే ఇంద్రధనుస్సు అవుతుంది. నిశ్చింతగా ఉద్యోగం చేసుకోవడానికి అసరమైన ఆసరాను, ధైర్యాన్నీ ఇస్తుంది. – సేపూరి వేణుగోపాలాచారి ,సాక్షి, కామారెడ్డిఅందుకే... చైల్డ్ కేర్ సెంటర్మహిళాపోలీసులు పిల్లలతో డ్యూటీకి వచ్చిన సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను గమనించాను. ఏ కుటుంబంలోనైనా సరే పిల్లలు తల్లిదగ్గరే ఉండగలుగుతారు. తల్లే వారిని చూసుకుంటుంది.పోలీసు శాఖలో సాధారణ కానిస్టేబుల్ళ్లుగా 33 శాతం, ఏఆర్ విభాగంలో 10 శాతం ఉద్యోగాలు మహిళలకు రిజర్వు అవడంతో ఆయా విభాగాల్లో మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య పెరిగింది. ఏఆర్ కానిస్టేబుల్స్ హెడ్ క్వార్టర్లో ఉండి పనిచేస్తుంటారు. వారు గార్డు డ్యూటీతో సహా అన్నిరకాల విధులకు హాజరు కావలసిందే. అలాంటి సందర్భంలో పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందులు ఉండకూడదనే చైల్డ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాను. – సింధుశర్మ, కామారెడ్డి జిల్లా ఎస్పీఇబ్బందులు తీరాయిఏఆర్ విభాగంలో దాదాపు అందరు మహిళా కానిస్టేబుళ్లకు చిన్న చిన్న పిల్లలున్నారు. పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి రాలేని పరిస్థితి ఉంటుంది. వెంట తీసుకుని వస్తాం. అయితే పిల్లలతో డ్యూటీ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉండేది. పిల్లలు ఏడుస్తుండడాన్ని చూసిన ఎస్పీ మేడం పిల్లల కోసం చైల్డ్‌కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. – ఏ.మానస, మహిళా కానిస్టేబుల్, ఏఆర్ విభాగంపిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు...జిల్లాపోలీసు కార్యాలయంలో డ్యూటీ చేసేవారితోపాటు పనుల మీద వచ్చే మహిళా కానిస్టేబుళ్లు తమ వెంట ఉండే చిన్న పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్లో వదిలేస్తే అక్కడ ఆడుకుంటున్నారు. బెడ్‌పై నిద్రపోతున్నారు. తీరిక సమయంలో మేం కూడా వారితో కాసేపు గడపడానికి చైల్డ్‌కేర్ సెంటర్ అనుకూలంగా ఉంది. – వై.భార్గవి, మహిళా కానిస్టేబుల్, దేవునిపల్లి పీఎస్ -
‘మకుటం’ లేని మహిళామణులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన ప్రభుత్వం, ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో చర్యలు తీసుకున్నారు. వీటిలో భాగంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగంలోని మహిళా ఐపీఎస్‌ల పరిస్థితి మకుటం లేని మహిళామణుల మాదిరిగా మారింది. ఇక్కడ పని చేస్తున్న ఉమెన్ ఐపీఎస్‌ల సంఖ్య దాదాపు 30 వరకు ఉంది. అయితే యూనిట్ ఆఫీసర్లుగా పిలిచే కీలకమైన ఫోకల్ పోస్టుల్లో ఉన్న వారు మాత్రం కేవలం ముగ్గురే. త్వరలో ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడైనా ఈ పరిస్థితులు మార్చే ప్రయత్నం చేస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫోకల్లోనూ రెండు రకాలైన పోస్టులు.. పోలీసు శాఖలో సాధారణంగా రెండు రకాలైన పోస్టులు ఉంటాయి. శాంతిభద్రతల విభాగం వంటి ప్రాధాన్యం గల వాటిని ఫోకల్ అని, సీఐడీ, ట్రాఫిక్ వంటి ప్రాధాన్యం లేని వాటిని నాన్–ఫోకల్ పోస్టులని వ్యవహరిస్తుంటారు. అయితే ఈ ఫోకల్ పోస్టుల్లోనూ రెండు రకాలైనవి ఉన్నాయి. ఏదైనా జిల్లా లేదా కమిషనరేట్‌కు నేతృత్వం వహించే అవకాశం ఉన్న ఎస్పీ ఆపై స్థాయి హోదాలోని పోస్టులను యూనిట్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ఎస్పీ హోదాలోనే ఉన్నప్పటికీ... కమిషనరేట్లలోని జోన్లకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా (డీసీపీ) పని చేసే వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, అధికారం ఉండదు. ఈ నేపథ్యంలో ఇవీ ఫోకలే అయినప్పటికీ అక్కడి పని చేసే వారిని యూనిట్ ఆఫీసర్‌గా పరిగణించరు. ‘33’ కాదు కదా ‘10’ కూడా లేదు... పోలీసు విభాగంలో వివిధ స్థాయిల్లో జరిగే రిక్రూట్మెంట్లో సైతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అయితే వీరికి పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే పోస్టింగ్స్లోనూ అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో భావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, 9 కమిషనరేట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే మొత్తమ్మీద ఉన్న 39 యూనిట్లలో పదికి పైగా మహిళా ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో పని చేయాలి. అయితే వాస్తవానికి పది శాతం కూడా యూనిట్ ఆఫీసర్లుగా మహిళా ఐపీఎస్‌లు లేరు. నిర్మల్ జిల్లాకు జానకీ శర్మిల, కామారెడ్డి జిల్లాకు సీహెచ్ సింధు శర్మ ఎస్పీలుగా ఉండగా... సిద్ధిపేట కమిషనరేట్‌కు బి.అనురాధ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురూ మినహా మరే ఇతర యూనిట్‌కు మహిళా ఐపీఎస్ నేతృత్వంలో లేదు. కేవలం సీఐడీ, ఎస్ఐబీ వంటి విభాగాలు మాత్రమే ఉన్నాయి. ఈసారైనా ఈ సీన్ మారేనా..? ఈ ముగ్గురు మహిళా ఐపీఎస్ల్లోనూ కేవలం సింధు శర్మ మాత్రమే డైరెక్ట్ ఐపీఎస్ కావడం గమనార్హం. మిగిలిన ఇద్దరూ రాష్ట్ర పోలీసు విభాగంలో అడుగుపెట్టి, నిరీ్ణత కాలం పని చేసిన తర్వాత ఐపీఎస్ హోదా పొందిన వారే. సింధు శర్మ ప్రస్తుతం నిజామాబాద్ కమిషనరేట్‌కు సైతం ఇన్చార్జ్గా ఉన్నారు. రాజకీయపరంగా అత్యంత సున్నితమైన ఈ రెండు యూనిట్లను ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారనే పేరు పొందారు. ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో పెద్ద స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటి నేపథ్యంలో మహిళా ఐపీఎస్ అధికారులకు సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ఆయా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం ఈ కోణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
శిరీష పలు విషయాలు వెల్లడించింది: సింధుశర్మ
పెద్దపల్లి: హైకోర్టు ఆదేశాల మేరకు మంథని మధుకర్ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు విచారణ అధికారి ఏసీపీ సింధుశర్మ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 60మందిని విచారణ జరిపినట్లు ఆమె సోమవారమిక్కడ పేర్కొన్నారు. మధుకర్ కేసులో కీలకమైన శిరీషను విచారణ చేశామని, ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు వెల్లడించినట్లు సింధుశర్మ తెలిపారు. విచారణ కొనసాగుతున్న దృష్ట్యా అన్ని వివరాలు వెల్లడించలేమని ఆమె అన్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి ఫోన్‌కాల్ డేటా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు భారీ పోలీసు బందోబస్తు మధ్య మధుకర్ మృతదేహానికి సోమవారం రీ పోస్టుమార్టం జరుపుతున్నారు. కరీంనగర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో కుటుంబసభ్యుల సమక్షంలో కేఎంసీ, ఉస్మానియా వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తున్నారు. పోలీసులు దీనిపై నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందించనున్నారు. కాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన మధుకర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతడి మృతదేహానికి మరోసారి శవ పరీక్ష (రీపోస్టుమార్టం) నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల నేతృత్వంలో రీ పోస్టుమార్టం జరపాలని స్పష్టం చేసింది. మార్చి 13న ఇంటి నుంచి వెళ్లిన మధుకర్ 14వ తేదీన శవమై కనిపించగా, దీన్ని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే కుటుంబీకులు మాత్రం అది ముమ్మాటీకి హత్యేనని ఆరోపించారు. అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినందుకు సదరు యువతి బంధువులు మధుకర్‌ను హత్య చేశారని తెలిపారు. మధుకర్, శిరీష ప్రేమపెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారని, ఈ నేపథ్యంలో మధుకర్ హత్య జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడి మృతి కేసును హత్య కేసుగా పరిగణించి ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతూ మధుకర్ తల్లి లక్ష్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.