‘ఎంతైనా తల్లి మనసు’ అనేది మనం తరచుగా వినే మాట. తల్లి ఎక్కడ ఉన్నా మనసు మాత్రం పిల్లలపైనే ఉంటుంది. ఆ పిల్లలు పసి పిల్లలు అయితే? ఆ బాధ తల్లికే తెలుస్తుంది. పసిపిల్లలను ఇంట్లో ఎవరికో ఒకరికి అప్పగించి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు చాలామంది మహిళా ఉద్యోగులకు లేదు. ఈ పరిస్థితుల్లో పసిబిడ్డలను తమతోపాటు తమ పని ప్రదేశానికి తీసుకువస్తారు. అలా అని వారు అక్కడ నిశ్చింతగా... సంతోషంగా ఉంటున్నారా... అంటే అదీ లేదు. ఇలాంటి పరిస్థితిని గమనించిన కామారెడ్డి ఎస్‌పీ సింధుశర్మ అందుకు ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించారు. ‘చైల్డ్ కేర్ సెంటర్’ ద్వారా తల్లీబిడ్డలిద్దరూ సంతోషంగా ఉండే ఏర్పాటు చేశారు.
పసిబిడ్డలను తీసుకుని ఉద్యోగ విధులకు హాజరు అవుతున్న మహిళా ఉద్యోగులుపాలివ్వడం నుంచి అన్ని పనులు దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. ఆఫీసులో పిల్లలు ఏడిస్తే తోటి ఉద్యోగులు చిరాకు పడతారు. కొందరైతే ముఖం మీదే ‘పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలి రావచ్చుగా’ అని గట్టిగా మాట్లాడతారు. కామారెడ్డి జిల్లాపోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఏఆర్ కానిస్టేబుల్స్ కు తమ వెంట పిల్లలను తీసుకువచ్చి వాళ్ల ఆలనాపాలనా చూసుకుంటూ ఉద్యోగ విధులు నిర్వర్తించడం పెద్ద సవాలుగా మారింది.
ఆఫీసులో వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన జిల్లా ఎస్పీ సింధుశర్మ పిల్లల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. కార్యాలయం మొదటి అంతస్తులో ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’ ఏర్పాటు చేయించారు. పిల్లలకుపాలు ఇవ్వడం నుంచి వారిని ఆడించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’లో ఏర్పాటు చేశారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలను సెలవులు ఉన్న రోజుల్లో ఇంటి దగ్గర చూసుకునేవారు ఎవరూ లేక చాలా మంది ఉద్యోగులు వారిని తీసుకొని ఆఫీసుకు వస్తుంటారు. అలాంటి పిల్లలు కూడా ‘చైల్డ్ కేర్ సెంటర్’లో సంతోషంగా గడుపుతున్నారు.
ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు గార్డ్ డ్యూటీ ఉంటుంది. షిఫ్టుల వారీగా వారికి బాధ్యతలు కేటాయిస్తారు. అలాంటి సందర్భంలో పిల్లల్ని చూసుకోవడానికి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ‘చిల్డ్రన్ కేర్ సెంటర్’ఎంతో ఊరట ఇస్తోంది. ‘పిల్లల కంటే ఉద్యోగం ముఖ్యమా? ఉద్యోగం మానేయ్’లాంటి కరుకు మాటలు...
‘నువ్వు హాయిగా డ్యూటీకి వెళ్లిపోతే పిల్లాడిని పట్టుకొని నేను నానా చావులు చావాలా!’లాంటి ఈసడింపులు ఇక ముందు వినిపించకపోవచ్చు. ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవాలంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎన్నో సమస్యలు అడ్డుగోడగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో ‘చైల్డ్ కేర్ సెంటర్’ అనేది తల్లీబిడ్డల కన్నుల్లో సంతోషాన్ని నింపే ఇంద్రధనుస్సు అవుతుంది. నిశ్చింతగా ఉద్యోగం చేసుకోవడానికి అసరమైన ఆసరాను, ధైర్యాన్నీ ఇస్తుంది. – సేపూరి వేణుగోపాలాచారి ,సాక్షి, కామారెడ్డి
అందుకే... చైల్డ్ కేర్ సెంటర్
మహిళాపోలీసులు పిల్లలతో డ్యూటీకి వచ్చిన సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను గమనించాను. ఏ కుటుంబంలోనైనా సరే పిల్లలు తల్లిదగ్గరే ఉండగలుగుతారు. తల్లే వారిని చూసుకుంటుంది.పోలీసు శాఖలో సాధారణ కానిస్టేబుల్‌ళ్లుగా 33 శాతం, ఏఆర్ విభాగంలో 10 శాతం ఉద్యోగాలు మహిళలకు రిజర్వు అవడంతో ఆయా విభాగాల్లో మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య పెరిగింది. ఏఆర్ కానిస్టేబుల్స్ హెడ్ క్వార్టర్‌లో ఉండి పనిచేస్తుంటారు. వారు గార్డు డ్యూటీతో సహా అన్నిరకాల విధులకు హాజరు కావలసిందే. అలాంటి సందర్భంలో పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందులు ఉండకూడదనే చైల్డ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాను. – సింధుశర్మ, కామారెడ్డి జిల్లా ఎస్పీ
ఇబ్బందులు తీరాయి
ఏఆర్ విభాగంలో దాదాపు అందరు మహిళా కానిస్టేబుళ్లకు చిన్న చిన్న పిల్లలున్నారు. పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి రాలేని పరిస్థితి ఉంటుంది. వెంట తీసుకుని వస్తాం. అయితే పిల్లలతో డ్యూటీ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉండేది. పిల్లలు ఏడుస్తుండడాన్ని చూసిన ఎస్పీ మేడం పిల్లల కోసం చైల్డ్‌కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. – ఏ.మానస, మహిళా కానిస్టేబుల్, ఏఆర్ విభాగం
పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు...
జిల్లాపోలీసు కార్యాలయంలో డ్యూటీ చేసేవారితోపాటు పనుల మీద వచ్చే మహిళా కానిస్టేబుళ్లు తమ వెంట ఉండే చిన్న పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్‌లో వదిలేస్తే అక్కడ ఆడుకుంటున్నారు. బెడ్‌పై నిద్రపోతున్నారు. తీరిక సమయంలో మేం కూడా వారితో కాసేపు గడపడానికి చైల్డ్‌కేర్ సెంటర్ అనుకూలంగా ఉంది. – వై.భార్గవి, మహిళా కానిస్టేబుల్, దేవునిపల్లి పీఎస్
Comments
Please login to add a commentAdd a comment