కడప కేంద్ర కారాగారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి
సాక్షి, అమరావతి: జేసీ బ్రదర్స్ కంపెనీ.. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు ఫోర్జరీ, నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు వాడినందునే రవాణా శాఖ పోలీసులతో క్రిమినల్ కేసులను నమోదు చేయించింది. ఆ తప్పుడు పత్రాల్లో ఉన్న సంతకాల ఆధారంగానే కేసులు పెట్టింది. ఇప్పటివరకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే 27 క్రిమినల్ కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన జిల్లాల్లో ఈ నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాలు కొనుగోలు చేసిన వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తే చీటింగ్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన లారీలను జటాధర కంపెనీ ప్రతినిధులు ఆయా జిల్లాల్లో విక్రయించారు. కొనుగోలు చేసిన వారు కూడా తాము మోసపోయామని గుర్తించి జేసీ బ్రదర్స్ కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు. (‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు)
మార్చిలోనే రవాణా శాఖ లేఖ
ఈ ఏడాది మార్చి 11న నేషనల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బీమా కంపెనీలకు రవాణా శాఖ లేఖ రాసింది. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన 56 వాహనాలకు సంబంధించిన బీమా పత్రాలను పరిశీలిస్తే 55 వాహనాల ఇన్సూరెన్స్ పత్రాలు బీమా కంపెనీల వద్ద లేవు. దీంతో వాహనాల బీమా పత్రాలు సైతం నకిలీవేనని తేలింది.
► జేసీ బ్రదర్స్ కంపెనీ అక్రమంగా 154 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించింది. ఇందులో ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లను రవాణా శాఖ రద్దు చేసింది.
► ఈ 95 లారీల్లో 80 లారీలు అనంతపురంలో, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3, గుంటూరులో 2 ఉన్నాయి. ఇంకా ఆరు లారీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంది.
► 154 వాహనాల్లో నాగాలాండ్‌లో 98, ఏపీలో 32, ఇతర రాష్ట్రాల్లో 24 లారీలను జేసీ బ్రదర్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించింది.
62 వాహనాలు సీజ్ చేశాం
బోగస్ పేపర్లలో ఉన్న సంతకాలు, ఎవరి పేర్లు ఉన్నాయో.. అవి ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యాయో వారి పైనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. 154 వాహనాల్లో 101 ఏపీలోనే ఉన్నాయి. తాజాగా వాటిలో 95 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతోపాటు ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశాం. – ప్రసాదరావు, సంయుక్త రవాణా కమిషనర్
కడప కేంద్ర కారాగారానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి
కడప అర్బన్/అనంతపురం క్రైమ్: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను అనంతపురం పోలీసులు ఆదివారం కడప కేంద్ర కారాగారానికి తరలించారు. మొదట అనంతపురం జిల్లాలోని రెడ్డిపల్లె కారాగారానికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ కరోనా కేసు నమోదు కావడంతో అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తాడిపత్రి జైలుకు మార్చాలని జడ్జి ఆదేశించడంతో అక్కడ శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో కడప జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేయడంతో అనంతపురం నుంచి తెల్లవారుజామున 3.58 గంటల సమయంలో కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా జైలు అధికారులు కరోనా పరీక్షలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలుగా ప్రభాకర్‌రెడ్డికి 2707, అస్మిత్‌రెడ్డికి 2708 నంబర్లను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment