పెట్రో వాహనాల నమోదుపై పరిమితి
ఇంధన ఖర్చు రూ. 3.9లక్షల కోట్లు ఆదా
► విరివిగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలి
► నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ నివేదిక
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై పరిమితి విధించి, ఎలక్ట్రిక్, షేర్డ్ వాహనాలను భారీగా వాడాలని నీతిఆయోగ్ సూచించింది. తద్వారా ఇంధనానికి అయ్యే ఖర్చులో 2030 నాటికి దాదాపు 6000 కోట్ల డాలర్లను(రూ. 3.9 లక్షల కోట్లు) ఆదాచేయవచ్చని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి భారీగా పన్ను మినహాయింపులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ విధానం చైనాలో విజయవంతమయ్యిందని తెలిపింది.
ఈ మేరకు నీతిఆయోగ్, రాకీ మౌంటేన్ ఇన్‌స్టిట్యూట్ నివేదికను తయారుచేశాయి. దీన్ని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ విడుదల చేశారు. దీని ప్రకారం ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగించడం వల్ల 2030 నాటికి 67 శాతం ఇంధన శక్తిని కాపాడుకోవడచ్చని, 37 శాతం కార్బన్ ఉద్గారాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అలాగే 15 కోట్ల 60 లక్షల టన్నుల ఆయిల్‌ను ఆదా చేయవచ్చని తెలిపారు. అలాగే ఆయిల్ స్థానంలో బ్యాటరీల దిగుమతిని కూడా భారీగా తగ్గించుకొని, ఇక్కడే తయారుచేసుకోవాల్సి ఉందన్నారు.
వీటికి గిరాకీ పెంచడానికి మొదటగా ప్రభుత్వ వాహనాలు, ప్రజా రవాణా వాహనాల మార్పుపై దృష్టిసారించాలని సూచించారు. ‘సురక్షితమైన, అతి తక్కువ ఖర్చులో సమర్థవంతమైన సేవలను అందించడానికి విభిన్న మార్గాలను అనుసరించాలి. తద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చు’ అని 140 పేజీల నివేదిక ముందుమాటలో నీతిఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియా పేర్కొన్నారు.