
పశ్చిమ దేశాల సాంకేతికతల కాలనీగా మారొద్దు
స్టార్టప్ మహాకుంభ్‌లో నితి ఆయోగ్ సీఈవో అమితాబ్
న్యూఢిల్లీ: భారత్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాలని నితి ఆయోగ్ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాల సాంకేతికతల కాలనీగా మారొద్దంటూ స్టార్టప్ మహాకుంభ్ ప్రసంగంలో సూచించారు. తెలివైన.. చౌక ఆవిష్కరణల ఆవశ్యకత ఉన్నట్లు నొక్కి చెప్పారు. పశ్చిమ దేశాల మోడళ్లను అవలంబించడంవల్ల దేశీ సంప్రదాయాలు, సంస్కృతి, గుర్తింపులను కోల్పోతామని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతికతలలో దేశ సార్వభౌమత్వాన్ని కొనసాగించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు.
ముందుండి నడిపించడంలో పశ్చిమ దేశాల లేదా ప్రపంచంలోని ఏ ఇతర ప్రాంతాల కాలనీగా మారకూడదని వ్యాఖ్యానించారు. అతితక్కువ ఇంధన వినియోగం, తక్కువ వ్యయాలతోకూడిన చురుకైన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు తెలియజేశారు. పశ్చిమ ప్రభావానికి లోనుకాకుండా సొంత డేటా ఆధారంగా దేశ సార్వభౌమత్వానికి అనుగుణమైన మోడళ్లను ఆవిష్కరించవలసి ఉన్నట్లు వివరించారు. 22 ప్రాంతీయ భాషలుగల దేశ భిన్నత్వానికి అనుగుణంగా వివిధ భాషల ఏఐ మోడళ్లకు తెరతీయవలసి ఉన్నట్లు తెలియజేశారు. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం సేవలు అందించగలుగుతామని సూచించారు.
స్వీయనియంత్రణ
స్టార్టప్‌లు భారీ కార్పొరేట్లుగా ఎదగాలంటే స్వీయనియంత్రణకుతోడు.. సుపరిపాలనకు చోటు ఇవ్వాలని అమితాబ్ కాంత్ తెలియజేశారు. ఒకప్పుడు స్టార్టప్‌గా ప్రారంభమై భారీ మల్టీనేషనల్ ఐటీ దిగ్గజంగా అవతరించిన ఇన్ఫోసిస్‌ను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. నైతిక పాలన, ఆడిట్లు, పటిష్ట ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌సహా స్వీయనియంత్రణ స్టార్టప్‌లకు కీలకమని వివరించారు. కాంత్ శుక్రవారం ఫిన్‌టెక్ పరిశ్రమకు స్వీయనియంత్రణ సంస్థ(ఎస్‌ఆర్‌వో) అయిన ఇండియా ఫిన్‌టెక్ ఫౌండేషన్(ఐఎఫ్‌ఎఫ్)ను ప్రారంభించారు.
ఎస్‌ఆర్‌వో– ఫిన్‌టెక్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్(ఎస్‌ఆర్‌వోఎఫ్‌టీ–డీఎఫ్)గా పేర్కొనే సంస్థ ఆవిర్భావం సందర్భంగా ప్రతిపాదిత ఎస్‌ఆర్‌వో బోర్డులో ఇప్పటికే 100మంది సభ్యులున్నట్లు వెల్లడించారు. డిజిటల్ లెండింగ్ పేమెంట్స్, వెల్త్‌టెక్, ఇన్సూర్‌టెక్, అకౌంట్ అగ్రిగేషన్‌సహా డెఫీ, వెబ్3 తదితర వర్ధమాన టెక్నాలజీల నుంచి సభ్యులు చేరినట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు ప్రమాణాలు నెలకొల్పడంలో ఎస్‌ఆర్‌వో కీలకపాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. నియంత్రణ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీల మద్య వారధిగా వ్యవహరించనున్నట్లు వివరించారు.
విమర్శించడం సులభం
దేశీ స్టార్టప్ కమ్యూనిటీ గ్రోసరీ డెలివరీలు, ఐస్‌క్రీమ్, చిప్స్ తయారీ నుంచి దృష్టి మరల్చాలని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పలువురు ఎంట్రప్రెన్యూర్స్ స్పందించారు. సెమీకండక్టర్, మెషీన్ లెరి్నంగ్, రోబోటిక్స్, ఏఐ తదితర హైటెక్ రంగాలపై దృష్టి పెట్టాలని స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా గోయల్ సూచించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా లోతైన సాంకేతిక నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న యూఎస్, చైనాతో పోల్చి దేశీ కన్జూమర్ ఇంటర్నెట్ స్టార్టప్‌లను విమర్శించడం సులభమేనని పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జెప్టో సీఈవో ఆదిత్ పలీచా లింక్‌డ్‌ఇన్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. నిండా మూడున్నరేళ్ల వయసుకూడా లేని జెప్టో ప్రస్తుతం సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
క్విక్‌కామర్స్ సంస్థలు ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయని తెలియజేశారు. ఇంటర్నెట్ కన్జూమర్ కంపెనీలు టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మంత్రి వ్యాఖ్యలు వేలెత్తి చూపడం అనికాకుండా.. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు సవాళ్లు విసురుతున్నట్లు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. మంత్రులు విశ్వాసాన్ని ఉంచాలని, డీప్‌టెక్ స్టార్టప్‌లకు సహాయసహకారాలు అందించాలని, సమస్యలను తొలగించాలని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ సూచించారు. చైనాతో పోలిక సరికాదని, పరిశ్రమ దేశీయంగా సైతం చిన్నస్థాయిలో స్టార్టప్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది నెలల్లో పలు డీప్‌టెక్ కంపెలతో సమావేశమైనట్లు షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ తెలిపారు.