
సూపర్ మార్కెట్లు, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో ఇన్‌స్టంట్ ఫుడ్ సెక్షన్‌లో ప్రసిద్ధ వాయ్ వాయ్ నూడుల్స్ (Wai Wai noodles) ప్యాక్‌లను చూస్తుంటాం. అయితే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ నూడుల్స్ వెనుక ఎవరున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనే బినోద్ కుమార్ చౌదరి (Binod Kumar Chaudhary). నేపాల్‌కు చెందిన ఈయన "నూడుల్స్ కింగ్" గా ప్రసిద్ధి చెందారు. బినోద్ కుమార్ చౌదరి ఎవరు.. భారత్‌తో ఆయనకున్న సంబంధం ఏంటి.. ఆసక్తికరమైన ఈ బిజినెస్‌మ్యాన్ కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
రాజస్థాన్ నుంచి నేపాల్‌కు..
70వ ఏట అడుగుపెడుతున్న బినోద్ కుమార్ చౌదరి 1955 ఏప్రిల్ 14న నేపాల్ రాజధాని ఖాట్మండులో మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయన తాత భూరమల్ దాస్ చౌదరి భారత్‌లోని రాజస్థాన్ నుండి నేపాల్ కు వలస వచ్చి వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. బినోద్ కుమార్ చౌదరి తండ్రి లుంకరణ్ దాస్ చౌదరి ఆ వ్యాపారాన్ని దేశంలో మొట్టమొదటి డిపార్ట్మెంటల్ స్టోర్‌గా విస్తరించారు. బినోద్ కుమార్ చౌదరికి సారిక చౌదరితో వివాహం కాగా వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు కూడా వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.
వ్యాపారాలు
డజన్ల కొద్దీ దేశాల్లో 160కి పైగా కంపెనీలను కలిగి ఉన్న బహుళజాతి సంస్థ చౌదరి గ్రూప్ (సీజీ కార్ప్ గ్లోబల్)కు చౌదరి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ పేరుతో 120కి పైగా బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 15,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ గ్రూప్‌నకు చెందిన వాయ్ వాయ్ బ్రాండ్ నూడుల్స్ నేపాల్, భారత్‌లలో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతవుతున్నాయి. బినోద్ కుమార్ చౌదరికి రియల్ ఎస్టేట్, విద్య, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ, టెలికాం, బయోటెక్నాలజీ రంగాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి.
రాజకీయాలు, దాతృత్వం
బినోద్ కుమార్ చౌదరి నేపాలీ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ ప్రముఖులతో ఆయనకు అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఆయన దాతృత్వ కార్యక్రమాలు కూడా చురుగ్గా నిర్వహిస్తుంటారు. 1995లో చౌదరి ఫౌండేషన్‌ను స్థాపించిన ఆయన 2015లో నేపాల్ లో భూకంపం సంభవించినప్పుడు 10,000 ఇళ్లు, 100 పాఠశాలల పునర్నిర్మాణానికి రూ.20 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. లక్షలాది ఆహార పొట్లాలు, ఇతర సామగ్రిని అందించారు.
ఏకైక నేపాలీ బిలియనీర్
పలు నివేదికల ప్రకారం.. బినోద్ కుమార్ చౌదరి నెట్‌వర్త్ 2 బిలియన్ డాలర్లు (రూ .17,200 కోట్లకు పైగా). నేపాల్‌లో మొదటి, ఏకైక బిలియర్ ఈయనే కావడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బినోద్ కుమార్ చౌదరి కఠినమైన శాఖాహారి. దీంతో ఆయన ప్రసిద్ధి చెందిన తమ వాయ్ వాయ్ బ్రాండ్ చికెన్ నూడుల్స్ ఎప్పుడూ రుచి చూడలేదు.