అత్యంత పోటీ ఉండే వ్యాపార రంగంలో కొంతమంది సంచలనంగా దూసుకొస్తారు. అలాంటివారిలో ఒకరే పెరల్ కపూర్. ఎన్నో ఏళ్లు వ్యాపారంలో తలలు పండితేగానీ రాని గుర్తింపు, ఘనతలు ఈయన చిన్న వయసులోనే సొంతం చేసుకున్నారు. 27 ఏళ్ల వయసుకే బిలియన్ డాలర్ల సంపదను ఆర్జించారు. పెరల్ కపూర్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు.
ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన బిజినెస్‌మెన్‌లలో ఒకరైన పెరల్ కపూర్‌కు అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అలాగే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీలో అగ్రగామి సంస్థ అయిన జైబర్ 365 గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా ఉన్నారు. మరిన్ని వ్యాపారాలు స్థాపించే యోచనలో ఉన్న పెరల్ కపూర్ ప్రస్తుత నెట్‌వర్త్ 1.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 9,243 కోట్లు.
మధ్యతరగతి కుటుంబం నుంచి..
పెరల్ కపూర్ ప్రయాణం అంత సునాయాసంగా సాగలేదు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కపూర్ ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే కసితో ఉండేవాడు. కంప్యూటర్ సైన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో రాణించిన పెరల్‌కు చిన్ననాటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఉండేది. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత కపూర్ ప్రతిష్టాత్మకమైన క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లో సీటు సాధించి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో ఎంఎస్‌ఈ చేశారు. లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించి బ్లాక్‌చెయిన్ ఎడ్యుకేషన్, సైబర్‌సెక్యూరిటీలో సంచలనాత్మక వెంచర్‌ను స్థాపించారు.
ఇంటర్న్‌షిప్‌లతో ప్రారంభం
పెరల్ కపూర్ కెరియర్ దేశ, విదేశాలలోని ప్రముఖ టెక్ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లతో చాలా సాంప్రదాయ మార్గంలో ప్రారంభమైంది. లండన్‌లోని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులలోనూ ఆయన ఇంటర్న్‌షిప్‌లు చేశారు. అయినప్పటికీ ఆయనలో ఉన్న వ్యవస్థాపక స్ఫూర్తి అనతికాలంలోనే బయటపడింది. 2019లో లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 2023 మేలో జైబర్ (Zyber) 365 గ్రూప్‌ని స్థాపించి సాహసోపేతమైన అడుగు వేశారు.
జైబర్ 365 గ్రూప్ వెంచర్ క్యాపిటల్ ప్రపంచం దృష్టిని తక్కువ రోజుల్లోనే ఆకర్షించింది. పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకువచ్చారు. ప్రీ రెవెన్యూ నిధుల సేకరణలో జైబర్ 365 గ్రూప్ విశేషమైన ప్రయాణం టెక్ పరిశ్రమలో ఒక కొత్త ఉదాహరణను నెలకొల్పింది. కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతున్న ట్రెండ్‌ను ప్రతిబింబిస్తుంది. ఉత్పత్తులు ఇంకా మార్కెట్‌కు సిద్ధంగా లేకపోయినా వినూత్న ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు.
నిరాడంబర జీవనశైలి
పెరల్ కపూర్ ప్రస్తుతం మొనాకోలో నివసిస్తున్నారు. ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యే పెరల్ విలాసవంతమైన జీవితానికి కాస్త దూరంగానే ఉంటారు. అంత సంపద ఉన్నప్పటికీ నిరాడంబరమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. కొత్త వ్యాపార వెంచర్‌లతో కొత్త ఆలోచనలను తీసుకురావడానికి తన టీమ్‌తో కలిసి పని చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతారు. చదవడం, ప్రయాణించడంతోపాటు కొత్త సాంకేతిక పోకడలను అన్వేషించడాన్ని ఆనందిస్తారు. బుగట్టి సెంటోడీసి, కోయినిగ్‌సెగ్ వంటి సూపర్ కార్లంటే ఆయనకు ఇష్టం. సంగీతం వినడం, క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడటాన్ని కూడా ఇష్టపడతారు.
Comments
Please login to add a commentAdd a comment