Indias
-
స్మార్ట్‌ఫోన్స్ జోరు.. టాప్ 10 బ్రాండ్స్ ఇవే..
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ సరఫరా వరుసగా అయిదో త్రైమాసికంలో కూడా పెరిగింది. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో సుమారు 6 శాతం వృద్ధి చెంది 4.6 కోట్లకు చేరింది. 72 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీల హవా కొనసాగింది.16 శాతం షేర్‌తో వివో అగ్రస్థానంలో ఉండగా, టాప్ 10 బ్రాండ్స్‌లో ఐకూ అత్యధిక వృద్ధి సాధించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా, శాంసంగ్ వాటా 12.3 శాతంగా ఉంది. వివో వాటా 13.9 శాతం నుంచి 15.8 శాతానికి పెరిగింది.అందుబాటు ధరలోని వై సిరీస్‌తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన టీ3, వీ40 సిరీస్‌ల దన్నుతో వరుసగా మూడో త్రైమాసికంలో కూడా వివో అగ్రస్థానంలో నిల్చింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఒప్పో 13.9 శాతం, రియల్మీ 11.5 శాతం, షావోమీ 11.4 శాతం, పోకో 5.8 శాతం, మోటరోలా 5.7 శాతం, ఐకూ 4.2 శాతం, వన్‌ప్లస్ 3.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. యాపిల్ అత్యధికంగా 40 లక్షల యూనిట్లు సరఫరా చేసింది. మిగతా విశేషాలు.. » రూ. 50,000 నుంచి రూ. 68,000 వరకు ధర శ్రేణి ఉండే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్ వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా 86 శాతం వృద్ధి చెందింది. మొత్తం సరఫరా 2 శాతం నుంచి సుమారు 4 శాతానికి పెరిగింది. ఐఫోన్ 15/13/14, గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 12 ప్రధాన మోడల్స్‌గా నిల్చాయి. ఈ విభాగంలో యాపిల్ వాటా 71 శాతానికి పెరగ్గా శాంసంగ్ వాటా 30 శాతం నుంచి 19 శాతానికి పడిపోయింది.» రూ. 16,000 నుంచి రూ. 35,000 ధర శ్రేణిలోని ఎంట్రీ–ప్రీమియం సెగ్మెంట్ 42 శాతం వృద్ధి సాధించింది. మొత్తం స్మార్ట్ఫోన్ల సరఫరాలో 28%వాటాను దక్కించుకు ంది. ఒప్పో గణనీయంగా పెరగ్గా శాంసంగ్, వివోల మార్కెట్ వాటా తగ్గింది. ఈ విభాగంలో ఈ మూడింటి వాటా 53 %గా ఉంది. » 5జీ స్మార్ట్ఫోన్ల సరఫరా 57% నుంచి 83%కి పెరిగింది. అదే సమయంలో సగటు విక్రయ ధర (ఏఎస్పీ) 20% తగ్గింది. 5జీ సెగ్మెంట్లో మాస్ బడ్జెట్ విభాగం (రూ. 8,000–రూ. 16,000 వరకు ధర) దాదాపు రెట్టింపై 50 శాతానికి చేరింది. షావోమీ రెడ్మీ 13సీ, యాపిల్ ఐఫోన్ 15, ఒప్పో కే12ఎక్స్, వివో టీ3ఎక్స్.. వై28 మోడల్స్ మూడో త్రైమాసికంలో అత్యధికంగా సరఫరా అయ్యాయి. -
మిడిల్ క్లాస్ అబ్బాయి.. నేడు బిలియనీర్ కుర్రాడు
అత్యంత పోటీ ఉండే వ్యాపార రంగంలో కొంతమంది సంచలనంగా దూసుకొస్తారు. అలాంటివారిలో ఒకరే పెరల్ కపూర్. ఎన్నో ఏళ్లు వ్యాపారంలో తలలు పండితేగానీ రాని గుర్తింపు, ఘనతలు ఈయన చిన్న వయసులోనే సొంతం చేసుకున్నారు. 27 ఏళ్ల వయసుకే బిలియన్ డాలర్ల సంపదను ఆర్జించారు. పెరల్ కపూర్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు.ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన బిజినెస్మెన్లలో ఒకరైన పెరల్ కపూర్‌కు అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. అలాగే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీలో అగ్రగామి సంస్థ అయిన జైబర్ 365 గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌గా ఉన్నారు. మరిన్ని వ్యాపారాలు స్థాపించే యోచనలో ఉన్న పెరల్ కపూర్ ప్రస్తుత నెట్‌వర్త్ 1.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 9,243 కోట్లు.మధ్యతరగతి కుటుంబం నుంచి..పెరల్ కపూర్ ప్రయాణం అంత సునాయాసంగా సాగలేదు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కపూర్ ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే కసితో ఉండేవాడు. కంప్యూటర్ సైన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో రాణించిన పెరల్‌కు చిన్ననాటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఉండేది. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత కపూర్ ప్రతిష్టాత్మకమైన క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లో సీటు సాధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో ఎంఎస్ఈ చేశారు. లండన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించి బ్లాక్‌చెయిన్ ఎడ్యుకేషన్, సైబర్‌సెక్యూరిటీలో సంచలనాత్మక వెంచర్‌ను స్థాపించారు.ఇంటర్న్‌షిప్‌లతో ప్రారంభంపెరల్ కపూర్ కెరియర్ దేశ, విదేశాలలోని ప్రముఖ టెక్ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లతో చాలా సాంప్రదాయ మార్గంలో ప్రారంభమైంది. లండన్‌లోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులలోనూ ఆయన ఇంటర్న్‌షిప్‌లు చేశారు. అయినప్పటికీ ఆయనలో ఉన్న వ్యవస్థాపక స్ఫూర్తి అనతికాలంలోనే బయటపడింది. 2019లో లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 2023 మేలో జైబర్ (Zyber) 365 గ్రూప్‌ని స్థాపించి సాహసోపేతమైన అడుగు వేశారు.జైబర్ 365 గ్రూప్ వెంచర్ క్యాపిటల్ ప్రపంచం దృష్టిని తక్కువ రోజుల్లోనే ఆకర్షించింది. పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకువచ్చారు. ప్రీ రెవెన్యూ నిధుల సేకరణలో జైబర్ 365 గ్రూప్ విశేషమైన ప్రయాణం టెక్ పరిశ్రమలో ఒక కొత్త ఉదాహరణను నెలకొల్పింది. కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతున్న ట్రెండ్‌ను ప్రతిబింబిస్తుంది. ఉత్పత్తులు ఇంకా మార్కెట్‌కు సిద్ధంగా లేకపోయినా వినూత్న ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు.నిరాడంబర జీవనశైలి పెరల్ కపూర్ ప్రస్తుతం మొనాకోలో నివసిస్తున్నారు. ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యే పెరల్ విలాసవంతమైన జీవితానికి కాస్త దూరంగానే ఉంటారు. అంత సంపద ఉన్నప్పటికీ నిరాడంబరమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. కొత్త వ్యాపార వెంచర్లతో కొత్త ఆలోచనలను తీసుకురావడానికి తన టీమ్‌తో కలిసి పని చేస్తూ ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతారు. చదవడం, ప్రయాణించడంతోపాటు కొత్త సాంకేతిక పోకడలను అన్వేషించడాన్ని ఆనందిస్తారు. బుగట్టి సెంటోడీసి, కోయినిగ్సెగ్ వంటి సూపర్ కార్లంటే ఆయనకు ఇష్టం. సంగీతం వినడం, క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడటాన్ని కూడా ఇష్టపడతారు. -
త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ (ఆటోమేటెడ్ పీపుల్ మూవర్-ఏపీఎం) సర్వీసు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది. ఎయిర్ ట్రైన్ అనేది మెట్రో తరహాలోని డ్రైవర్ లేని రైలు.ప్రయాణికులు ఇప్పటివరకూ విమానాశ్రయంలోని మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు, లేదా విమానాన్ని డీబోర్డింగ్ చేశాక క్యాబ్‌ను ఎక్కేందుకు బస్సు సర్వీస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ. రెండువేల కోట్లతో 7.7 కి.మీ. పొడవున ఎయిర్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. 🚨 Delhi airport to get India's first air train by 2027, connection terminals 1, 2, and 3. pic.twitter.com/z9Qsiok9t9— Indian Tech & Infra (@IndianTechGuide) September 24, 2024ఎయిర్ ట్రైన్ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్మెంట్లను కలిగి ఉంటుంది. ఇది ట్రాక్‌లపై నడుస్తుంది. నిర్ణీత ట్రాక్‌లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళుతుంది. దీంతో వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. విమానాశ్రయంలోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్ స్థలాలు, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు మొదలైన వాటిని చేరుకోవడానికి ఎయిర్ ట్రైన్స్ ఉపయోగపడతాయి. ఇది కూడా చదవండి: చైనా క్షిపణి ప్రయోగం.. అమెరికా, తైవాన్, జపాన్‌లకు ముప్పు -
కువైట్ నుంచి భారత్ కు 45 మృతదేహాలు
-
అప్పటికల్లా 10 కోట్ల మంది ధనికులు! అంతా లగ్జరీనే..
దేశంలో ధనికుల జనాభా వేగంగా పెరగుతోంది. వచ్చే నాలుగేళ్లలో 10 కోట్లకు చేరుకుంటుందని తాజాగా విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. వినియోగదారుల పోకడలు, సంపద గతిశీలతను పునర్నిర్మించడంలో ఇప్పటికే కీలక పాత్ర పోషించిన వీరు.. రానున్న రోజుల్లో లగ్జరీ వస్తువులు, నివాసాల కొనుగోలు, స్టాక్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతారని ఆ నివేదిక పేర్కొంటోంది. ‘ది రైజ్ ఆఫ్ అఫ్లుయెంట్ ఇండియా’ పేరుతో గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక భారత్‌లో ధనికుల జనాభా 2027 నాటికి 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో ధనికుల జనాభా 6 కోట్లుగా ఉంది. అంటే నాలుగేళ్లలో 67 శాతం పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఇలా 10 కోట్లకు పైగా ధనికులు ఉన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా 14 మాత్రమే ఉన్నాయి. ధనికులంటే.. వార్షిక ఆదాయం 10,000 డాలర్లు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.8.3 లక్షలు) అంతకంటే ఎక్కువ ఉన్నవారిని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక ధనికులుగా నిర్వచించింది. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నవారి జనాభాలో 10 వేల డాలర్లు సంపాదిస్తున్నవారు 4 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. ప్రధాన సవాళ్లు ఇవే..
ఢిల్లీ: నేడు సాయంత్రం ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశం కానుంది. 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ , ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై చర్చించనున్నారు. కూటమి ముందున్న ప్రధాన సవాళ్ళు ఇవే.. ప్రధానమంత్రి అభ్యర్థి.. కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనడానికి దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. దాదాపు 28 పార్టీలు కూటమిలో ఉన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూటమి తరపున ఒక ప్రధాన అభ్యర్థిని ప్రధాని మోదీకి అభిముఖంగా నిలబెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా, అన్ని పార్టీల అంగీకరంతో ఓ అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇదే కూటమి ముందు ఉన్న ప్రధాన సవాళుగా పేర్కొనవచ్చు. టికెట్ల పంపిణీపై కుదరని ఏకాభిప్రాయం ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ లాంటి జాతీయ పార్టీలతో పాటు అనేక చిన్ని పార్టీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ప్రాబల్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు పోటీ చేయకుండా ఆయా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంలో కూటమి పెద్దలు ఇప్పటికే తలమునకలయి ఉన్నాయి. ఈ అంశంలో సమన్వయ కమిటీ ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. దీనిపై నేడు భేటీలో చర్చించనున్నారు. #WATCH | Mumbai, Maharashtra: Shiv Sena (UBT) leader Sanjay Raut says, "Today we will go to the meeting... The agenda decided in the Mumbai meeting will be discussed. Everybody is going to attend the meeting except TMC. TMC leader Abhishek Banerjee is a member of this committee,… pic.twitter.com/FglophdMXr — ANI (@ANI) September 13, 2023 టీఎంసీ Vs కాంగ్రెస్, లెఫ్ట్: అటు.. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ , కాంగ్రెస్ కు సీట్లు కేటాయించేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. అధికారంలో ఉన్న టీఎంసీ బెంగాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోగలిగే సత్తా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు, లెఫ్ట్‌లకు సీట్లను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అక్కడ జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ సత్తా చాటింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించగల విశ్వాసంతో ఉంది. లెఫ్ట్ Vs కాంగ్రెస్: కేరళలోనూ ఇదే తరహా వివాదం నెలకొంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న పీనరయ్ విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ పార్టీ నేతలు.. తాము సొంతంగా మెజారిటీ సీట్లను సాధించగలమని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు సీట్ల పంపిణీపై నిరాసక్తతతో ఉన్నారు. ఆప్ Vs కాంగ్రెస్: ఢిల్లీ, పంజాబ్ , హర్యానాలో టిక్కెట్ల పంపిణీ పై ఆప్ - కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్.. మరిన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే పంజాబ్‌లో అధికారాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపిణీ కూటమి ముందు ప్రధాన సమస్యగా మారింది. ఈ అంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. ఇదీ చదవండి: ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం.. ఎజెండా ఏమిటంటే..? -
Independence Day 2023: మేరా భారత్ మహాన్
దేశం అనగానే భారతీయ ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయిపోతారు. సరైన దేశభక్తి సినిమా వస్తే సూపర్ డూపర్ హిట్ చేసి భావోద్వేగంతో ఊగిపోతారు. బాలీవుడ్లో మంచి మంచి దేశభక్తి సినిమాలు వచ్చాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన 10 దేశభక్తి సినిమాలు.. హకీకత్ (1964): దేశాల మధ్య యుద్ధాలు వస్తే సైనికుల వీరోచిత పోరాటాలు, త్యాగాలు తప్పనిసరి. వాటిని చూపుతూనే యుద్ధాలు ఎలా సగటు సైనికుడి ్రపాణాలు బలిగొంటాయో కూడా చూపిన సినిమా హకీకత్. 1962 నాటి ఇండో చైనా యుద్ధం మీద వచ్చిన ఈ సినిమా అతి తక్కువ మంది భారత సైనిక పటాలం చైనా భారీ సేనతో ఎలా తలపడిందో చూపుతుంది. బల్రాజ్ సహానీ, ధరేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. కైఫీ ఆజ్మీ రాసిన ప్రఖ్యాత దేశభక్తి గీతం ‘కర్ చలే హమ్ ఫిదా జాన్ ఏ వతన్ సాథియో’ ఇందులోదే. ఉప్కార్ (1967): దేశభక్తి సినిమాలు తీసి ‘మిస్టర్ భరత్’ బిరుదు ΄÷ందిన నటుడు మనోజ్ కుమార్ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సూచన మేరకు ‘జై జవాన్ జై కిసాన్’ నినాదానికి ఇచ్చిన సినీ రూపం ‘ఉప్కార్’. సైనికులు దేశ సరి హద్దుల వద్ద మాత్రమే సంఘర్షణ చేస్తారు... కాని రైతులు దేశంలో జీవితాంతం సంఘర్షణ చేసి గింజలు పండించి జనం కడుపులు నింపుతారు... వారే నిజమైన హీరోలు అని చెప్పే సినిమా ఇది. ‘ఇస్ దేశ్ కి ధర్తీ ఉగ్లే హీరా మోథీ’ హిట్ గీతం ఇందులోదే. బోర్డర్ (1997): యుద్ధంలో చావు కళ్ల ముందు కదలాడుతుంటే దేశం తప్ప మరేమీ గుర్తు రాక సంతోషంగా బలిదానం ఇచ్చే సైనికుల వీరత్యాగం ఎలా ఉంటుందో ‘బోర్డర్’లో చూడాలి. 1971 నాటి ఇండో పాక్ యుద్ధాన్ని కథాంశంగా తీసుకుని దర్శకుడు జె.పి. దత్తా తీసిన ఈ సినిమా ఒక గొప్ప వార్ మూవీ. సన్ని డియోల్, సునీల్ శెట్టి తదితరులు నటించిన ఈ సినిమాలో సైనికుల జీవితాన్ని వాస్తవికంగా చూపడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. యుద్ధ వ్యూహాలు కూడా ఈ సినిమాలో తెలుస్తాయి. లగాన్ (2001): దేశభక్తికి క్రీడలు జత చేసి గొప్ప సంచలనం సృష్టించిన సినిమా ‘లగాన్’. పన్నుల మీద పన్నులు వేసి దాష్టీకం చేస్తున్న బ్రిటిష్ వారిని చిన్న పల్లెజనం క్రికెట్లో ఓడించడం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఆస్కార్ నామినేషన్ ΄÷ందింది. అద్భుతమైన కథనం, సంగీతం, నటన, భావోద్వేగాలు, ఆటలో ఉండే మలుపులు తోడు కావడంతో ప్రేక్షకులు జేజేలు పలికారు. ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్ (2002): అమర దేశభక్తుడు భగత్ సింగ్ కథను తీసుకుని రాజ్ కుమార్ సంతోషి తీసిన అద్భుతమైన సినిమా ఇది. అజయ్ దేవగణ్– భగత్ సింగ్ పాత్రను పోషించి ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించాడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్... ఈ ముగ్గురు దేశభక్తులు తమ ఉడుకు నెత్తురుతో దేశం కోసం పోరాడి లేత వయసులో మరణించడం ప్రేక్షకుల మనసు కలచి వేసేలా ఈ సినిమా చూపుతుంది. దేశం కోసం ఎలాంటి స్ఫూర్తితో ఉండాలో తెలుపుతుంది. లక్ష్య (2004): మంచి దేశభక్తి సినిమా మాత్రమే కాదు యువతను లక్ష్యం వైపు నడిపించే సినిమా కూడా. రిలీజైనప్పుడు ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉన్నా ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. కార్గిల్ వార్‌ను నేపథ్యంగా తీసుకుని గొప్ప సాంకేతిక విలువలతో తీశారు. హృతిక్ రోషన్‌తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. మిలట్రీ వాతావరణం, క్రమశిక్షణ, ధీరత్వం ఈ సినిమాలో పుష్టిగా చూడొచ్చు. స్వదేశ్ (2004): ఈ దేశం నీకేమిచ్చిందని కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అని తరచి ప్రశ్నించుకోవాలని నెహ్రూ అన్నారు. ఆ ప్రశ్నకు జవాబు ఈ సినిమా. ఈ దేశంలో పుట్టి పెరిగి చదువుకుని పరాయి దేశానికి వెళ్లి ఆ దేశానికి సేవ చేయడం తప్పు కాదు కానీ మన దేశానికి ఏదైనా చేయాలన్న బాధ్యతను మరువకూడదని ఎంతో గట్టిగా చెప్పింది ‘స్వదేశ్’. షారూక్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఎన్ఆర్ఐల బాధ్యతను నిలదీసిన సినిమా ఇది. రంగ్ దే బసంతి(2006): ఉద్యోగం వచ్చే చదువును చదువుకోవడం వేరు, దేశం పట్ల చైతన్యాన్ని కలిగించుకుని బాధ్యతను గుర్తెరగడం వేరు. నేటి యువత తమ కెరీర్‌ను వెతుక్కుంటున్నది గాని దేశం కోసం ఏం చేయాలో ఆలోచించడం లేదు. ‘రంగ్ దే బసంతి’... అల్లరి చిల్లరి యూనివర్సిటీ కుర్రాళ్లను దేశం కోసం ఏదైనా గట్టిగా చేయాలని నిర్ణయించుకోవడాన్ని చూపుతుంది. పుచ్చిపోయిన వ్యవస్థను సరిచేయాలనుకుని ్రపాణాలు అర్పించే కుర్రాళ్ల కథ ఇది. రాకేష్ మెహ్రా దర్శకుడు. ఆమిర్ ఖాన్ హీరో. ది ఫర్గాటెన్ హీరో (2004): నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం ఈ దేశం గుండె సగర్వంగా స్పందిస్తూనే ఉంటుంది. బ్రిటిష్ వారిపై పోరాడటానికి ఏకంగా సైన్యాన్ని నిర్మించిన ధీరుడు ఆయన. నేతాజీ మరణం ఇంకా మిస్టరీనే. నేతాజీ జీవితాన్ని అథెంటిక్‌గా చూపిన సినిమా ఇది. శ్యామ్ బెనగళ్ దర్శకునిగా ఎంత రీసెర్చ్ చేశాడో తెలుస్తుంది. నేతాజీగా సచిన్ ఖడేకర్ అద్భుతంగా నటించారు. గతించిన చరిత్రకు దర్పణం ఈ సినిమా. రాజీ (2018): దేశం కోసం గూఢచారిగా పని చేసి త్యాగాలు చేసిన వారు ఎందరో. వారిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. అలాంటి ఒక స్త్రీ కథ ‘రాజీ’. ఆలియా భట్ నటించిన ఈ సినిమా పాకిస్తాన్‌కు కోడలుగా వెళ్లి అక్కడ భారత్ కోసం గూఢచారిగా పని చేసిన సెహమత్ అనే స్త్రీ ఎదుర్కొన్న సవాళ్లను చూపుతుంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో నిర్మితమైనా భారీ వసూళ్లను రాబట్టింది. -
భారత్ విదేశీ రుణ భారం 625 బిలియన్ డాలర్లు!
ముంబై: భారత్ విదేశీ రుణ భారం 2023 మార్చితో ముగిసిన సంవత్సరానికి 624.7 బిలియన్ డాలర్లకు చేరింది. 2022 మార్చితో పోల్చితే 5.6 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. కాగా, ఇదే కాలంలో స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) విలువలతో పోల్చితే రుణ నిష్పత్తి తగ్గడం గమనార్హం. 2021–22 ఆర్థిక సంవత్సరం జీడీపీలో రుణ నిష్పత్తి 20 శాతం ఉంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ నిష్పత్తి 18.9 శాతానికి తగ్గింది. డాలర్–రూపీ విలువల్లో అలాగే యన్, ఎస్డీఆర్, యూరో–రూపీ విలువల్లో వ్యత్యాసాల వల్ల భారత్‌కు 2023 మార్చి నాటికి రుణ భారం 20.6 బిలియన్ డాలర్లు తగ్గింది. ఈ పరిస్థితి లేకపోతే భారత్ రుణ భారం ఈ కాలంలో 5.6 బిలియన్ డాలర్లు కాకుండా, 26.2 బిలియన్ డాలర్లుగా నమోదైఉండేది. -
మోదీ హయాంలో రెండు రకాల భారత్‌లు
పానిపట్: ‘‘నరేంద్ర మోదీ ఏలుబడిలో రెండు రకాల భారత్‌లు కనిపిస్తున్నాయి. ఒకటి కోట్లాది కార్మికులు, రైతులు, నిరుద్యోగులది. రెండోది దేశంలోని సగం సంపదను గుప్పెట్లో ఉంచుకున్న 100 మంది ధనికులది’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ చెబుతున్న హిందుస్తాన్ నిజ స్వరూపం ఇదేనని ఎద్దేవా చేశారు. శుక్రవారం జోడో యాత్ర సందర్భంగా హరియాణాలోని పానిపట్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం వస్తుసేవల పన్ను(జీఎస్టీ), నోట్ల రద్దు విధానాలను ఆయుధంగా వాడుకుందని ఆరోపించారు. ఇదీ చదవండి: Joshimath Sinking: దేవభూమికి బీటలు! -
సర్కారు ఉల్లి కిలో రూ. 30
కలెక్టరేట్ : సామాన్యులకు ఉల్లిని అందుబాటు ధరలో అందించడానికి విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ తెలిపా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ రైతు బజారులో ప్రభుత్వం తరపున ఉల్లిగడ్డ విక్రయ కేంద్నాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో ఉల్లిని కిలో రూ. 50 వరకు విక్రయిస్తున్నారన్నారు. ఈ కేంద్రాల ద్వారా 30 రూపాయలకే కిలో ఉల్లి అందిస్తున్నామని పేర్కొన్నారు. పులాంగ్ చౌరస్తాలోని రైతు బజారులో కూడా ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. డిమాండ్‌ను బట్టి కామారెడ్డి, బోధన్, ఆర్మూర్‌లలో కూడా ఉల్లి విక్రయ కేంద్రాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్ఓ కొండల్రావు, డీఎంసీఎస్ దివాకర్, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.