ఢిల్లీ: నేడు సాయంత్రం ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశం కానుంది. 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ , ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై చర్చించనున్నారు.
కూటమి ముందున్న ప్రధాన సవాళ్ళు ఇవే..
ప్రధానమంత్రి అభ్యర్థి..
కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనడానికి దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. దాదాపు 28 పార్టీలు కూటమిలో ఉన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూటమి తరపున ఒక ప్రధాన అభ్యర్థిని ప్రధాని మోదీకి అభిముఖంగా నిలబెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా, అన్ని పార్టీల అంగీకరంతో ఓ అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇదే కూటమి ముందు ఉన్న ప్రధాన సవాళుగా పేర్కొనవచ్చు.
టికెట్ల పంపిణీపై కుదరని ఏకాభిప్రాయం
ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ లాంటి జాతీయ పార్టీలతో పాటు అనేక చిన్ని పార్టీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ప్రాబల్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు పోటీ చేయకుండా ఆయా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంలో కూటమి పెద్దలు ఇప్పటికే తలమునకలయి ఉన్నాయి. ఈ అంశంలో సమన్వయ కమిటీ ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. దీనిపై నేడు భేటీలో చర్చించనున్నారు.
#WATCH | Mumbai, Maharashtra: Shiv Sena (UBT) leader Sanjay Raut says, "Today we will go to the meeting... The agenda decided in the Mumbai meeting will be discussed. Everybody is going to attend the meeting except TMC. TMC leader Abhishek Banerjee is a member of this committee,… pic.twitter.com/FglophdMXr
— ANI (@ANI) September 13, 2023
టీఎంసీ Vs కాంగ్రెస్, లెఫ్ట్:
అటు.. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ , కాంగ్రెస్ కు సీట్లు కేటాయించేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. అధికారంలో ఉన్న టీఎంసీ బెంగాల్‌లో మెజారిటీ సీట్లను గెలుచుకోగలిగే సత్తా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు, లెఫ్ట్‌లకు సీట్లను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అక్కడ జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ సత్తా చాటింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించగల విశ్వాసంతో ఉంది.
లెఫ్ట్ Vs కాంగ్రెస్:
కేరళలోనూ ఇదే తరహా వివాదం నెలకొంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న పీనరయ్ విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ పార్టీ నేతలు.. తాము సొంతంగా మెజారిటీ సీట్లను సాధించగలమని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు సీట్ల పంపిణీపై నిరాసక్తతతో ఉన్నారు.
ఆప్ Vs కాంగ్రెస్:
ఢిల్లీ, పంజాబ్ , హర్యానాలో టిక్కెట్ల పంపిణీ పై ఆప్ - కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్.. మరిన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే పంజాబ్‌లో అధికారాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపిణీ కూటమి ముందు ప్రధాన సమస్యగా మారింది. ఈ అంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు.
ఇదీ చదవండి: ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం.. ఎజెండా ఏమిటంటే..?
Comments
Please login to add a commentAdd a comment