Independence Day 2023: మేరా భారత్‌ మహాన్‌ | Independence Day 2023: Special Patriotic Bollywood Top 10 Movies | Sakshi
Sakshi News home page

Independence Day 2023: మేరా భారత్‌ మహాన్‌

Published Tue, Aug 15 2023 1:06 AM | Last Updated on Tue, Aug 15 2023 8:28 AM

Independence Day 2023: Special Patriotic Bollywood Top 10 Movies - Sakshi

దేశం అనగానే భారతీయ ప్రేక్షకులు వెంటనే కనెక్ట్‌ అయిపోతారు. సరైన దేశభక్తి సినిమా వస్తే సూపర్‌ డూపర్‌ హిట్‌ చేసి భావోద్వేగంతో ఊగిపోతారు. బాలీవుడ్‌లో మంచి మంచి దేశభక్తి సినిమాలు వచ్చాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం   సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన 10 దేశభక్తి సినిమాలు..

హకీకత్‌ (1964): దేశాల మధ్య యుద్ధాలు వస్తే సైనికుల వీరోచిత పోరాటాలు, త్యాగాలు తప్పనిసరి. వాటిని చూపుతూనే యుద్ధాలు ఎలా సగటు సైనికుడి ్రపాణాలు బలిగొంటాయో కూడా చూపిన సినిమా హకీకత్‌. 1962 నాటి ఇండో చైనా యుద్ధం మీద వచ్చిన ఈ సినిమా అతి తక్కువ మంది భారత సైనిక పటాలం చైనా భారీ సేనతో ఎలా తలపడిందో చూపుతుంది. బల్‌రాజ్‌ సహానీ, ధరేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు చేతన్‌ ఆనంద్‌ దర్శకుడు. కైఫీ ఆజ్మీ రాసిన ప్రఖ్యాత దేశభక్తి గీతం ‘కర్‌ చలే హమ్‌ ఫిదా జాన్‌ ఏ వతన్‌ సాథియో’ ఇందులోదే.

ఉప్‌కార్‌ (1967): దేశభక్తి సినిమాలు తీసి ‘మిస్టర్‌ భరత్‌’ బిరుదు ΄÷ందిన నటుడు మనోజ్‌ కుమార్‌ నాటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి సూచన మేరకు ‘జై జవాన్‌ జై కిసాన్‌’ నినాదానికి ఇచ్చిన సినీ రూపం ‘ఉప్‌కార్‌’. సైనికులు దేశ సరి హద్దుల వద్ద మాత్రమే సంఘర్షణ చేస్తారు... కాని రైతులు దేశంలో జీవితాంతం సంఘర్షణ చేసి గింజలు పండించి జనం కడుపులు నింపుతారు... వారే నిజమైన హీరోలు అని చెప్పే సినిమా ఇది. ‘ఇస్‌ దేశ్‌ కి ధర్తీ ఉగ్‌లే హీరా మోథీ’ హిట్‌ గీతం ఇందులోదే.

బోర్డర్‌ (1997): యుద్ధంలో చావు కళ్ల ముందు కదలాడుతుంటే దేశం తప్ప మరేమీ గుర్తు రాక సంతోషంగా బలిదానం ఇచ్చే సైనికుల వీరత్యాగం ఎలా ఉంటుందో ‘బోర్డర్‌’లో చూడాలి. 1971 నాటి ఇండో పాక్‌ యుద్ధాన్ని కథాంశంగా తీసుకుని దర్శకుడు జె.పి. దత్తా తీసిన ఈ సినిమా ఒక గొప్ప వార్‌ మూవీ. సన్ని డియోల్, సునీల్‌ శెట్టి తదితరులు నటించిన ఈ సినిమాలో సైనికుల జీవితాన్ని వాస్తవికంగా చూపడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. యుద్ధ వ్యూహాలు కూడా ఈ సినిమాలో తెలుస్తాయి.

లగాన్‌ (2001): దేశభక్తికి క్రీడలు జత చేసి గొప్ప సంచలనం సృష్టించిన సినిమా ‘లగాన్‌’. పన్నుల మీద పన్నులు వేసి దాష్టీకం చేస్తున్న బ్రిటిష్‌ వారిని చిన్న పల్లెజనం క్రికెట్‌లో ఓడించడం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఆమిర్‌ ఖాన్‌ నిర్మించిన ఈ సినిమాకు అశుతోష్‌ గోవారికర్‌ దర్శకుడు. ఆస్కార్‌ నామినేషన్‌ ΄÷ందింది. అద్భుతమైన కథనం, సంగీతం, నటన, భావోద్వేగాలు, ఆటలో ఉండే మలుపులు తోడు కావడంతో ప్రేక్షకులు జేజేలు పలికారు.

ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌సింగ్‌ (2002): అమర దేశభక్తుడు భగత్‌ సింగ్‌ కథను తీసుకుని రాజ్‌ కుమార్‌ సంతోషి తీసిన అద్భుతమైన సినిమా ఇది. అజయ్‌ దేవగణ్‌– భగత్‌ సింగ్‌ పాత్రను పోషించి ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించాడు. భగత్‌ సింగ్, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్‌... ఈ ముగ్గురు దేశభక్తులు తమ ఉడుకు నెత్తురుతో దేశం కోసం పోరాడి లేత వయసులో మరణించడం ప్రేక్షకుల మనసు కలచి వేసేలా ఈ సినిమా చూపుతుంది. దేశం కోసం ఎలాంటి స్ఫూర్తితో ఉండాలో తెలుపుతుంది.

లక్ష్య (2004): మంచి దేశభక్తి సినిమా మాత్రమే కాదు యువతను లక్ష్యం వైపు నడిపించే సినిమా కూడా. రిలీజైనప్పుడు ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉన్నా ఆ తర్వాత  కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచింది. కార్గిల్‌ వార్‌ను నేపథ్యంగా తీసుకుని గొప్ప సాంకేతిక విలువలతో తీశారు. హృతిక్‌ రోషన్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటించారు. మిలట్రీ వాతావరణం, క్రమశిక్షణ, ధీరత్వం ఈ సినిమాలో పుష్టిగా చూడొచ్చు.

స్వదేశ్‌ (2004): ఈ దేశం నీకేమిచ్చిందని కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్‌ అని తరచి ప్రశ్నించుకోవాలని నెహ్రూ అన్నారు. ఆ ప్రశ్నకు జవాబు ఈ సినిమా. ఈ దేశంలో పుట్టి పెరిగి చదువుకుని పరాయి దేశానికి వెళ్లి ఆ దేశానికి సేవ చేయడం తప్పు కాదు కానీ మన దేశానికి ఏదైనా చేయాలన్న బాధ్యతను మరువకూడదని ఎంతో గట్టిగా చెప్పింది ‘స్వదేశ్‌’. షారూక్‌ ఖాన్‌ నటించిన ఈ చిత్రానికి అశుతోష్‌ గోవారికర్‌ దర్శకుడు. ఎన్‌ఆర్‌ఐల బాధ్యతను నిలదీసిన సినిమా ఇది.

రంగ్‌ దే బసంతి(2006): ఉద్యోగం వచ్చే చదువును చదువుకోవడం వేరు, దేశం పట్ల చైతన్యాన్ని కలిగించుకుని బాధ్యతను గుర్తెరగడం వేరు. నేటి యువత తమ కెరీర్‌ను వెతుక్కుంటున్నది గాని దేశం కోసం ఏం చేయాలో ఆలోచించడం లేదు. ‘రంగ్‌ దే బసంతి’... అల్లరి చిల్లరి యూనివర్సిటీ కుర్రాళ్లను దేశం కోసం ఏదైనా గట్టిగా చేయాలని నిర్ణయించుకోవడాన్ని చూపుతుంది. పుచ్చిపోయిన వ్యవస్థను సరిచేయాలనుకుని ్రపాణాలు అర్పించే కుర్రాళ్ల కథ ఇది. రాకేష్‌ మెహ్రా దర్శకుడు. ఆమిర్‌ ఖాన్‌ హీరో.

ది ఫర్‌గాటెన్‌ హీరో (2004): నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కోసం ఈ దేశం గుండె సగర్వంగా స్పందిస్తూనే ఉంటుంది. బ్రిటిష్‌ వారిపై పోరాడటానికి ఏకంగా సైన్యాన్ని నిర్మించిన ధీరుడు ఆయన. నేతాజీ మరణం ఇంకా మిస్టరీనే. నేతాజీ జీవితాన్ని అథెంటిక్‌గా చూపిన సినిమా ఇది. శ్యామ్‌ బెనగళ్‌ దర్శకునిగా ఎంత రీసెర్చ్‌ చేశాడో తెలుస్తుంది. నేతాజీగా సచిన్‌ ఖడేకర్‌ అద్భుతంగా నటించారు. గతించిన చరిత్రకు దర్పణం ఈ సినిమా.

రాజీ (2018): దేశం కోసం గూఢచారిగా పని చేసి త్యాగాలు చేసిన వారు ఎందరో. వారిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. అలాంటి ఒక స్త్రీ కథ ‘రాజీ’. ఆలియా భట్‌ నటించిన ఈ సినిమా పాకిస్తాన్‌కు కోడలుగా వెళ్లి అక్కడ భారత్‌ కోసం గూఢచారిగా పని చేసిన సెహమత్‌ అనే స్త్రీ ఎదుర్కొన్న సవాళ్లను చూపుతుంది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో నిర్మితమైనా భారీ వసూళ్లను రాబట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement