హీరోహీరోయిన్లకున్న డిమాండే వేరు! రెండు హిట్లు పడ్డాయంటే చాలు పారితోషికం అమాంతం పెంచేస్తారు. అదే వరుసగా ఫ్లాప్స్ వచ్చాయనుకో.. ఆ పారితోషికంలో హెచ్చుతగ్గులు లేకుండా అదే కంటిన్యూ చేస్తారు. సినిమా పీకల్లోతు నష్టాల్లో మునిగినప్పుడు మాత్రమే రెమ్యునరేషన్‌లో కొంత కట్ చేస్తారు.. అది కూడా ఎవరో ఒకరిద్దరు మాత్రమే! సినిమా బడ్జెట్‌లో పారితోషికానికే ఎక్కువగా ఖర్చవుతోంది. ఇప్పుడున్న అగ్రతారలంతా ఒక్కో సినిమాతో కోట్లు గడిస్తున్నారు. మూడు నిమిషాల పాటలో కనిపించినా కోటి వెనకేస్తున్నారు. అలాంటిది వారి ఆస్తులు ఎన్ని కోట్లుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
20 ఏళ్ల వయసులో వెండితెరపై ఎంట్రీ
అయితే 30 ఏళ్ల క్రితమే బాలీవుడ్‌కు దూరమైన ఓ నటి వేల కోట్ల సామ్రాజ్యానికి మమారాణిగా మారింది. సినిమాలతో ఎంత సంపాదించిందో కానీ బిలియనీర్‌ను పెళ్లి చేసుకుని అంతకంటే ధనవంతురాలిగా మారిపోయింది. ఆమె మరెవరో కాదు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ భార్య, మాజీ నటి టీనా అంబాని. ఆమె అసలు పేరు టీనా మునిమ్. 20 ఏళ్ల వయసులో దేశ్ పర్‌దేశ్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ఆమెను చూడగానే ఇటు ప్రేక్షకలోకం, అటు సినీలోకం పరవశించిపోయింది. రాజేశ్ ఖన్నా, రిషి కపూర్, అమల్ పాలేకర్ వంటి బాలీవుడ్ అగ్రహీరోలతో కలిసి నటించింది. మొదట్లో వరుస విజయాలతో దూకుడు చూపించిన ఆమె 80వ దశాబ్దం మధ్య కాలం నుంచి అపజయాలను మూటగట్టుకుంది.
టీనా కోసం హీరోల మధ్య గొడవ
1987 తర్వాత ఆమె రెండే రెండు సినిమాలు చేసింది. 1991లో వచ్చిన జిగర్వాలా చిత్రంలో చివరిసారిగా కనిపించింది. సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందిన రోజుల్లో టీనా పలువురు హీరోలతో లవ్వాయణం నడిపిందని వార్తలు వచ్చేవి. అందులో రిషి కపూర్ పేరు కూడా ఉంది. అయితే అది నిజం కాదని రిషి కపూర్ తన ఆత్మకథలో స్పష్టం చేశాడు. ఈ పుకారు నిజమేననుకున్న మరో హీరో సంజయ్ దత్ తనతో గొడవ పడేందుకు నేరుగా ఇంటికే వచ్చాడని కూడా వెల్లడించాడు. అంటే అప్పట్లో టీనా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం
1991 ఫిబ్రవరి 2న ఆమె అగ్ర వ్యాపారవేత్త అనిల్ అంబానీని పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె ఆస్తుల విలువ ఒకానొక దశలో రూ.10,000 కోట్లు. ఆమె భర్త అనిల్ అంబానీ (42 బిలియన్ డాలర్ల ఆస్తులతో) ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆరవ వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. అయితే వరుసగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ రావడంతో వీరి సంపాదన కొంత ఆవిరైపోయింది. దీంతో ప్రస్తుతం టీనా ఆస్తి విలువ రూ.2331 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment