
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భామ.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో అభిమానులను అలరిస్తోంది. సూపర్ హిట్ సిరీస్ ఆర్యలో నటించింది. అంతేకాకుండా తాళి అనే వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించని సుస్మితా సేన్.. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైంది. ముంబయిలో జరిగిన ఈ ఈవెంట్‌లో తన మాజీ భాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. సుస్మితా సేన్ నటుడు రోహ్మన్ షాల్‌తో డేటింగ్ చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. తాజాగా వీరిద్దరు మరోసారి ఓకే ఈవెంట్‌లో మెరవడంతో బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఈ జంట మళ్లీ కలవబోతున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈవెంట్‌లో రోహ్మాన్ షాల్‌ను సుస్మితాతో ఫోజు ఇవ్వాలని అక్కడున్న వారు అడగడంతో సరదాగా వెనక నిలబడి కెమెరాకు పోజులిచ్చాడు. అయితే సుస్మితా మాత్రం అతన్ని పట్టించుకోకుండా తన స్నేహితులతో మాట్లాడుతూ కనిపించింది.
కాగా.. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్‌లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది.