ఒకప్పుడు వెండితెరను ఏలింది.. మూకీ, టాకీ సినిమాల్లో కథానాయికగా నటించింది. కానీ ఒక్క దెబ్బ.. ఒకే ఒక చెంపదెబ్బ ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. హీరోయిన్ నుంచి సైడ్ క్యారెక్టర్లు చేసే స్థితికి తీసుకొచ్చింది. ఒంటి కన్నుతో విలనిజం పండించే పాత్రలు చేసుకుంటూ పోయింది.. ఆవిడే భారతీయ సినిమా తొలితరం నటి లలితా పవార్. ఆమె గురించే నేటి ప్రత్యేక కథనం..
హీరోయిన్‌గా, నిర్మాతగా..
మహారాష్ట్రలో 1916 ఏప్రిల్ 18న లలితా పవార్ జన్మించింది. తండ్రి లక్ష్మణ్ రావు వ్యాపారవేత్త. తొమ్మిదేళ్ల వయసులోనే లలిత నటనవైపు అడుగులు వేసింది. 1928లో వచ్చిన రాజా హరిశ్చంద్రలో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. 1940లో హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో హీరోయిన్‌గా సినిమాలు చేసింది. ఖైలాష్ (మూకీ చిత్రం), దునియా క్యా హై (టాకీ) చిత్రాలను నిర్మించింది. ఆమెకు వెండితెరపై తిరుగులేదు అనుకునే సమయంలో ఓ చెడు సంఘటన జరిగింది.
జీవితం తలకిందులైన రోజు
1942లో 'జంగ్ ఇ ఆజాద్' సినిమాలో నటుడు మాస్టర్ భగవాన్.. ఆమె చెంప చెళ్లుమనిపించాలి. అతడు సీన్ బాగా రావాలని ఎంతో గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె చెవి నుంచి రక్తం కారింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫేషియల్ పెరాలసిస్ (ముఖానికి పక్షవాతం) వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎడమ కన్ను కూడా డ్యామేజ్ అయినట్లు తెలిపారు. అలా మూడేళ్లు ఇంటికే పరిమితమైంది. తర్వాత చాలాకాలం వరకు ఒంటికన్నుతోనే సినిమాలు చేసింది.
చికిత్స వికటించడం వల్లే..
అయితే వైద్యుల చికిత్స వికటించడం వల్లే తనకు శరీరం కుడివైపు కూడా పక్షవాతం వచ్చిందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం తర్వాత తనకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ అన్నీ నెగెటివ్ పాత్రలే! అయినా అన్నింటినీ ప్రాణం పెట్టి చేసింది. గయ్యాలి అత్తగా, కుట్రలు కుతంత్రాలు చేసే దుష్టురాలిగా భయపెట్టింది. అనాది, శ్రీ 420, గోర కుంభర్.. ఇలా అనేక చిత్రాలతో దాదాపు ఏడు దశాబ్దాలపాలు సినీప్రియులను అలరిచింది. రామాయణం సీరియల్‌లో మందరగా నటించింది. 70 ఏళ్లపాటు ఇండస్ట్రీలో రాణించిన నటిగా గిన్నిస్ రికార్డుకెక్కింది.
సొంత చెల్లితోనే ఎఫైర్
లలిత.. నిర్మాత గణపత్‌రావుని పెళ్లాడింది. కానీ అతడు తన సొంత చెల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భరించలేకపోయింది, విడాకులిచ్చేసింది. అనంతరం నిర్మాత రాజ్ గుప్తాను పెళ్లాడింది. వీరికి జై పవార్ అనే కుమారుడు సంతానం. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో లలితకు నోటి క్యాన్సర్ వచ్చింది. అప్పటివరకు ముంబైలోనే ఉన్న ఆమె చికిత్స కోసం పుణెకు షిఫ్ట్ అయింది. నెగెటివ్ క్యారెక్టర్స్ పోషించడం వల్లే తనకు ఇలా జరిగిందని లోలోపలే మథనపడింది. 1998లో ఆమె కన్నుమూసింది.
చదవండి: 'బ్రో'ని పెళ్లి చేసుకున్న నటి.. రెండేళ్లయినా పిల్లలు ఎందుకు లేరంటే?
Comments
Please login to add a commentAdd a comment