గ్లామర్‌ హీరోయిన్‌.. మతిస్థిమితం కోల్పోయి.. చివరి రోజుల్లో తిండి మానేసి.. | Parveen Babi Death Anniversary: Know About Tragic Life Story And Controversial Life Of Glamour Heroine In Telugu | Sakshi
Sakshi News home page

పెళ్లయినవారితో ప్రేమలో హీరోయిన్‌.. మతిస్థిమితం కోల్పోవడంతో వదిలేసిన ప్రియుడు.. అమితాబ్‌పై అనుమానం!

Published Mon, Jan 20 2025 6:15 PM | Last Updated on Mon, Jan 20 2025 6:54 PM

Parveen Babi Death Anniversary: Tragedy Life of Glamour Heroine

అందంతో కట్టిపడేసింది. నటనతో మంత్రముగ్ధుల్ని చేసింది. సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అందచందాలకు జనాలే కాదు సినీఇండస్ట్రీ దాసోహమైంది. తనతో పరిచయం పెంచుకోవాలని చూసినవారు కొందరైతే ప్రేమాయణం నడిపినవారు మరికొందరు. కానీ ఏ ప్రేమా పెళ్లిదాకా వెళ్లలేదు. సినీ ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్‌ చూసిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్స్‌తోనే సావాసం చేసింది. ఆఖరి రోజుల్లో మానసిక స్థితి సరిగా లేక.. అనారోగ్యంతో కన్నుమూసింది. వెండితెరకు గ్లామర్‌ టచ్‌ ఇచ్చిన ఆవిడ పేరు పర్వీన్‌ బాబి. నేడు (జనవరి 20) ఆమె ఇరవయ్యవ వర్ధంతి. ఈ సందర్భంగా తనపై ప్రత్యేక కథనం..

పద్నాలుగేళ్లకు పుట్టిన ఆశాదీపం పర్వీన్‌
పర్వీన్‌ బాబి (Parveen Babi) గుజరాత్‌లో పుట్టింది. పెళ్లయిన పద్నాలుగేళ్లకు పర్వీన్‌ పుట్టడంతో ఆ పేరెంట్స్‌ సంతోషపడిపోయారు. ఒక్కగానొక్క కూతురని అల్లారుముద్దుగా పెంచారు. కానీ తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు తండ్రి క్యాన్సర్‌తో చనిపోయాడు. తండ్రి మరణం తర్వాత తల్లితో ఓ హవేలీలో నివసించింది. సైకాలజీ చదివిన పర్వీన్‌ మోడలింగ్‌లోనూ అడుగుపెట్టింది. అక్కడి నుంచి సినీపరిశ్రమవైపు అడుగులు వేసింది. క్రికెటర్‌ సలీమ్‌ దురానీ సరసన చరిత్ర మూవీలో యాక్ట్‌ చేసింది. ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చింది దర్శకుడు కిశోర్‌ సాహు. 

వేశ్యగా నటించిన పర్వీన్‌
తనకు గుర్తింపు ఇచ్చిన ఫస్ట్‌​ మూవీ మజ్బూర్‌ అయితే సెన్సేషన్‌ సృష్టించింది మాత్రం దీవార్‌. ఈ సినిమాలో పర్వీన్‌.. వేశ్యగా నటించింది. తర్వా అమర్‌ అక్బర్‌ ఆంటోని, కాల పత్తర్‌, సుహాగ్‌, షాన్‌, నమక్‌ హలాల్‌, ద బర్నింగ్‌ ట్రైన్‌.. ఇలా ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించింది. అమితాబ్‌ బచ్చన్‌తో ఆరు సినిమాలు చేయగా అన్నీ హిట్లు, సూపర్‌ హిట్లుగానే నిలవడం విశేషం. ఎక్కువగా మోడ్రన్‌, గ్లామర్‌ పాత్రలే వేస్తూ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగింది. అమెరికాకు చెందిన టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై కనిపించిన మొట్టమొదటి బాలీవుడ్‌ నటిగానూ చరిత్ర సృష్టించింది.

ప్రేమ- పెళ్లి?
1969లో పాకిస్తాన్‌కు చెందిన దూరపు బంధువుతో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధం వల్ల ఆ నిశ్చితార్థం పెళ్లిదాకా రాకుండానే ఆగిపోయింది. తర్వాత నటుడు, విలన్‌ డేనీ డెంజోంగ్పా(Danny Denzongpa)ను ప్రేమించింది. చిత్రపరిశ్రమ అంతా పర్వీన్‌ వెంటపడుతుంటే ఆమె మాత్రం డానీ కోసం పరితపించింది. అతడు కూడా పర్వీన్‌ను చూసి ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉండటం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. కానీ ఇద్దరూ సినిమాలతో బిజీ అవడంతో కాసేపు కలిసుండే సమయం కూడా కరువైంది. దీంతో ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకుని ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగించారు.

(చదవండి: సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్‌ ఎంతంటే?)

పెళ్లయిన వ్యక్తితో లవ్‌
అనంతరం నటుడు, వివాహితుడు కబీర్‌ బేడీ (Kabir Bedi)తో ప్రేమలో పడింది. ఇటాలియన్‌ సీరియల్‌ సెట్‌ వీరి ప్రేమకు పునాది వేసింది. కానీ కబీర్‌కు యూరప్‌లో గ్రాఫ్‌ పెరగడంతో బాలీవుడ్‌ రాలేకపోయాడు. అటు పర్వీన్‌.. తను సంతకం చేసిన సినిమాల కోసం ముంబై తిరిగిరాక తప్పలేదు. రెండేళ్ల లవ్‌ జర్నీకి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. గుండె నిండా ఆ బాధ కూరుకుపోయినప్పుడే ఉన్నప్పుడే మహేశ్‌ భట్‌ (Mahesh Bhatt) పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం.. స్నేహంగా, ప్రేమగా మారింది. కానీ అప్పటికే మహేశ్‌కు పెళ్లయి కూతురు (పూజా భట్‌) కూడా ఉంది. పర్వీన్‌కు పిచ్చి అభిమాని అయిన మహేశ్‌ కుటుంబాన్ని వదిలేశాడు. ఇల్లొదిలేసి పర్వీన్‌తో సహజీవనం మొదలుపెట్టాడు. మూడేళ్లు కలిసున్నారు.

దిగజారిన మానసిక స్థితి
ఓ రోజు మహేశ్‌ ఇంటికి వచ్చేసరికి పర్వీన్‌ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నన్ను చంపడానికి అమితాబ్‌ ఫ్యాన్‌లో ఏదో డివైజ్‌ పెట్టాడు అంటూ కత్తి పట్టుకుని నిల్చుంది. అమితాబ్‌ తనను కిడ్నాప్‌ చేయించాడంది. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు అక్కడున్న శంఖంలో బాంబ్‌ ఉందంటూ అరిచి గోల చేసింది. తనను ఎవరో ఏదో చేస్తారని మంచం కింద దాక్కునేది. తనకు పెట్టే భోజనంలో విషం కలుపుతున్నారని అనుమానించేది. ఎవరైనా ఒక ముద్ద తింటేకానీ ప్లేటు ముట్టేది కాదు. ఇలా రోజురోజుకూ ఆమె మానసిక ఆరోగ్యం దిగజారుతుంటే మహేశ్‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. 

ఉన్న ఒక్క స్నేహితుడినీ గెంటేసిన హీరోయిన్‌
సైకియాట్రిస్ట్‌కు చూపిస్తే పారనాయిడ్‌ స్కిజోఫ్రీనియా అని తేలింది. టాబ్లెట్స్‌తో ఫలితం లేకపోవడంతో సినిమా వాతావరణానికి దూరంగా బెంగళూరులో ఉంచారు. అక్కడ ఆమె ఎక్కువరోజులు ఉండలేక ముంబైకి తిరుగుప్రయాణమైంది. డానీ.. తనకు ఏ కాస్త సమయం దొరికినా పర్వీన్‌ దగ్గరకు వెళ్లి ఆమెను సరదాగా ఉంచేందుకు ప్రయత్నించాడు. కానీ ఓ రోజు డానీని ఇంట్లోకి రానివ్వలేదు పర్వీన్‌. నన్ను చంపేందుకు నిన్ను అమితాబ్‌ పంపాడు కదా.. గెటవుట్‌ అని అరిచింది. బిగ్‌బీ మనుషులు తనను చంపాలనుకుంటున్నారన్న అనుమానంతో నిద్రాహారాలకు దూరమైంది. 

ఒంటరిగా..
మహేశ్‌ తన పరిస్థితి చూడలేక ఇంట్లో నుంచి వచ్చేశాడు. భార్యకు దగ్గరయ్యాడు. దీంతో పర్వీన్‌ ఒంటరిగానే మిగిలిపోయింది. మధుమేహం, కీళ్లనొప్పులతోనూ బాధపడింది. 2005 జనవరి 20న పర్వీన్‌ (50) చనిపోయింది. ఆ విషయం రెండు మూడు రోజులవరకు ఇరుగుపొరుగుకు కూడా తెలియలేదు. తిండి మానేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని చెప్తుంటారు. పర్వీన్‌ మరణవార్త తెలిసి పరుగెత్తికొచ్చిన మహేశ్‌ ఆమె అంత్యక్రియలు జరిపించాడు. పర్వీన్‌ తన ఆస్తిని ‘బాబీ’అనే ముస్లిం తెగలోని అనాథలకు, ముంబైలోని క్రిస్టియన్, హిందూ అనాథ శరణాలయాలకు సమానంగా రాసిచ్చింది.

చదవండి:ర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను!
చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్‌ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement