Parveen Babi
-
తాప్సీ ఫేవరెట్ బుక్ ‘పర్వీన్‌బాబీ: ఏ లైఫ్’
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన తాప్సీ పన్ను ‘గేమ్ ఓవర్’ ‘తప్పడ్’ ‘బద్లా’... మొదలైన సినిమాలతో బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి పర్వీన్‌బాబీ: ఏ లైఫ్ బుక్. ఈ పుస్తకం సంక్షిప్త పరిచయం... చిత్రమేమిటంటే బాబీ గురించి మనకు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ ఏమీ తెలియదు! గాసిప్‌ల నుంచి ఆమె జీవితాన్ని కాచి వడబోయలేం కదా! ఏదో ఒక శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలి కదా.... సరిగ్గా ఈ ప్రయత్నమే పర్వీన్‌బాబీ: ఏ లైఫ్ బుక్. ఫిల్మ్ జర్నలిస్ట్ కరిష్మ ఉపాధ్యాయ్ ఈ పుస్తకాన్ని రాశారు. తన రిసెర్చ్‌లో భాగంగా పాత ఇంటర్య్వూలను సేకరించడంతో పాటు బాలీవుడ్ ప్రముఖులు డానీ, కబీర్‌బేడి, మహేష్భట్లాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేశారు. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అనే భయంతో మొదట మాట్లాడడానికి నిరాకరించారు చాలామంది. వారిని ఒప్పించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. సినిమా వ్యక్తులనే కాదు అహ్మదాబాద్‌లో బాబీ చదివిన కాలేజికి వెళ్లారు. ఆమెకు పరిచయం ఉన్న వాళ్లతో మాట్లాడారు. కెరీర్ మొదలైన రోజుల్లో బాబీ నటించిన ‘చరిత్ర’ కమర్శియల్ సినిమా ఏమీ కాదు. ఒక బాధిత యువతి పాత్రలో ఇందులో నటించింది. ‘ఇందులో నటించిన అమ్మాయికి గర్వం తలకెక్కపోతే భవిష్యత్‌లో మంచి నటి అవుతుంది’ అని రాసింది ఒక పత్రిక. ఆమెకు గర్వం తలకెక్కిందా లేదా అనేది వేరే విషయంగానీ, బాలీవుడ్‌ను ఊపేసిన కథానాయికగా ఎదిగింది. గ్లామర్‌డాల్‌గా మాత్రమే సుపరిచితమైన బాబీలో మరోకోణం...ఆమె గుడ్ స్టూడెంట్. మంచి చదువరి. రచనలు చేస్తుంది. పెయింటింగ్స్ వేస్తుంది. మద్యపానం, మాదకద్రవ్యాలకు బానిస కావడమే ఆమె మానసిక సమస్యలకు కారణమనే వాదాన్ని కరిష్మ ఖండిస్తారు. పాలు, నీళ్లను వేరు చేసినట్లు అపోహలు, వాస్తవాలను వేరు చేసే క్లోజప్ వెర్షన్ ఈ పుస్తకం. -
పర్వీన్ కోసం వాళ్లను కాదనుకున్నాడు
కబీర్ బేడీతో అనుబంధాన్ని తెంచుకున్నంత వేగంగా ఆ బాధలోంచి బయటపడలేకపోయింది పర్వీన్. ఆ సమయంలో డానీ స్నేహం ఒక్కటే ఆమెకు కాస్త ఊరటైంది. అప్పుడే మహేశ్ భట్ తారసపడ్డాడు ఆమెకు. ఆనాటికే ఆమె స్టార్డమ్తో ఉంది. మహేశ్.. దర్శకత్వంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పర్వీన్ బాబీకి పిచ్చి అభిమాని కూడా. తొలి పరిచయంలోనే అతను ఆమెకు మంచి స్నేహితుడిగా కనిపించాడు. టీకి ఇంటికి ఆహ్వానించింది. చెలిమి పెరిగింది. మహేశ్ భట్ సాంగత్యంలో గతం మరిచిపోగలుగుతోంది. దాంతో ఆమెకు అతను సాంత్వన అయ్యాడు. ఆమె అతనికి ప్రేమిక అయింది. అప్పటికే మహేశ్ భట్‌కు లారెన్ బ్రైట్‌తో పెళ్లయి కూతురు కూడా (పూజా భట్). పర్వీన్ కోసం వాళ్లను కాదనుకున్నాడు. ఇల్లొదిలి వచ్చేశాడు. పర్వీన్‌తో సహజీవనం మొదలుపెట్టాడు. ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. చాలా రోజుల తర్వాత స్నేహితురాలి మొహంలో నవ్వు చూసి సంతోషపడ్డాడు డానీ. అమితాబ్ చంపే ప్లాన్ చేస్తున్నాడు! పర్వీన్, మహేశ్ భట్ దాదాపు మూడేళ్లు కలిసున్నారు. తనకు తెలిసిన ప్రపంచాన్నంతా పర్వీన్‌కు చూపించాడు మహేశ్. తన గైడ్, ఫిలాసఫర్.. జిడ్డు కృష్ణమూర్తినీ పరిచయం చేశాడు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్నప్పుడు ఒకరోజు.. మహేశ్ భట్ షూటింగ్ ముగించుకొని ఇంటికొచ్చేటప్పటికి పర్వీన్ వాళ్లమ్మ భయంభయంగా కారిడార్‌లో పచార్లు చేస్తోంది. ‘ఏమైంది?’ అని మహేశ్ భట్ అడిగేలోపే ‘పర్వీన్‌ను చూస్తే భయమేస్తోంది’ అంటూ భోరుమంది. ఆవిడను సముదాయించి అతను లోపలికెళ్లిచూస్తే.. కనీసం షూటింగ్ కాస్ట్యూమ్స్ కూడా తీయకుండా చేతిలో కూరగాయల కత్తితో గోడకు ఆనుకొని బెదిరిపోతూ కనిపించింది పర్వీన్. ‘పర్వీన్..’ అని మహేశ్ పిలిచేసరికి ‘ష్.. గట్టిగా మాట్లాడకు. ఆ ఫ్యాన్‌లో ఏదో సీక్రెట్ డివైజ్ ఉంది’ అంది ఆమె ఫ్యాన్‌ను చూపిస్తూ. విస్తుపోయిన అతను.. ‘ఏం డివైజ్? ఎవరు పెట్టారు?’ అని అడిగాడు. ‘నన్ను చంపడానికి.. అమితాబ్ బచ్చన్ పెట్టించాడు’ చెప్పింది పర్వీన్. హతాశుడయ్యాడు మహేశ్. ఇంకోసారి.. ఎప్పటిలాగే ఓ రోజు డానీని భోజనానికి పిలిచింది పర్వీన్. డైనింగ్ టేబుల్ మీద వెండి శంఖం కనబడేసరికి.. ఊదాలని సరదాపడ్డాడు డానీ. అంతే ‘అమ్మో.. దాంట్లో బాంబ్ ఉంది. అవతల పడేసేయ్’ అంటూ గట్టిగట్టిగా అరిచిందట పర్వీన్. ఈసారి షాక్ అవడం డానీ వంతైంది. ‘ఈ మధ్య తరచూ ఇలాగే ప్రవర్తిస్తోంది. నాకేం అర్థం కావట్లేదు’ చెప్పాడు మహేశ్. ఆ సంఘటన నుంచి పర్వీన్ మానసిక ఆరోగ్యం దిగజారిపోయింది. మహేశ్‌కు కంటిమీద కునుకు కరువైంది. సైకియాట్రిస్ట్‌కు చూపిస్తే పారనాయిడ్ స్కిజోఫ్రీనియా అని తేలింది. మాత్రలతో ఫలితం కనిపించలేదు. బెంగళూరు, జిడ్డు కృష్ణమూర్తి దగ్గరకు తీసుకెళ్లాడు పర్వీన్‌ను. కొన్నాళ్లు సినిమా వాతావరణానికి దూరంగా, ప్రశాంతంగా అక్కడే బెంగుళూరులో ఉండమని ఆమెకు సలహానిచ్చిడు కృష్ణమూర్తి. అయిష్టంగానే ఒప్పుకుంది. కాని ఉండలేక ముంబైకి తిరుగు ప్రయాణమైంది. డానీ సమక్షంలోనే కాస్త తేలికపడేదట పర్వీన్. అది గ్రహించిన మహేశ్ ‘నీ మాటలతో కాస్త ధైర్యపడుతున్నట్టుంది. వీలుచిక్కినప్పుడల్లా వస్తూ ఉండు’ అంటూ డానీని అభ్యర్థించాడు. అప్పటి నుంచి తనకు ఏ కాస్త టైమ్ దొరికినా వాళ్లింటికి వస్తూ పర్వీన్‌ను సరదాగా ఉంచే ప్రయత్నం చేయసాగాడు డానీ. ఆ క్రమంలో ఒకరోజు తమ ఇంటికి వచ్చిన డానీని గుమ్మంలోంచే బయటకు పంపించేసింది పర్వీన్.. ‘నన్ను చంపడానికి నిన్ను అమితాబ్ పంపాడు కదా? నువ్వు అతని ఏజెంట్‌వి. గెటవుట్’ అని అరుస్తూ. స్థాణువైపోయాడు డానీ. అతను వెళ్లిపోయే వరకు అరుస్తూ ఉందట పర్వీన్. దానికి కారణం.. ఆ రోజు ఓ పత్రికలో ఆమె అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ చదవడం. అందులో అమితాబ్.. డానీని తన ఆప్తమిత్రుడుగా పేర్కొనడం. కోలుకోలేదు మందులు వాడినా ఆమె మానసిక స్థితి మెరుగుపడలేదు. తనను అమితాబ్ మనుషులు వెంటాడుతున్నారని, ఇంట్లో దాక్కున్నారని, తనను చంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే నిరంతర అనుమానాలతో నిద్రాహారాలకు దూరమైంది. మహేశ్‌కు నరకాన్ని తలపించింది. ఇక ఆమెతో ఉండలేక ఆ ఇంట్లోంచి వచ్చేసి అతను తర్వాత భార్య లారెన్‌కు దగ్గరయ్యాడు మళ్లీ. ఒంటరిగానే మిగిలిపోయింది పర్వీన్. పారనాయిడ్ స్కిజోఫ్రీనియా, మధుమేహం ఇతర ఆరోగ్య సమస్యలతో 2005లో ఈ లోకాన్ని విడిచిపోయింది పర్వీన్ బాబీ. ఆమె చనిపోయిన రెండు రోజులకుగాని ఆ విషయం ఆమె ఇరుగుపొరుగుకు తెలియలేదు. పర్వీన్ మరణవార్త విన్నవెంటనే పరిగెత్తుకొచ్చాడు మహేశ్. డానీ, కబీర్‌బేడీ చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలను మహేశ్ భట్ జరిపించాడు. పర్వీన్‌కు తుది వీడ్కోలు పలికిన వాళ్లలో ఈ ముగ్గురితోపాటు జానీ బక్షి, రంజిత్, ప్రొడ్యూసర్ హరీష్ షా మాత్రమే ఉన్నారు. తన ఆస్తిని ‘బాబీ’అనే ముస్లిం తెగలోని అనాథలకు, ముంబైలోని క్రిస్టియన్, హిందూ అనాథ శరణాలయాలకు సమంగా రాసిచ్చింది పర్వీన్ బాబీ. ∙ఎస్సార్ -
పర్వీన్ కూడా ప్రేమ కోసం పరితపించింది
బాలీవుడ్‌కు గ్లామర్ అద్దిన నటి.. హీరోయిన్‌కు అదా నేర్పిన వ్యక్తి.. పర్వీన్ బాబీ.. తెర మీద ఆమె విసిరిన చూపులను.. ఒలికించిన నవ్వులను ఏరుకోవడానికి థియేటర్లకు పరిగెత్తిన దీవానాలు ఎందరో! సినిమా వాళ్లలోనూ ఆమె ఆరాధకులు తక్కువేం లేరు! పర్వీన్ కూడా ప్రేమ కోసం పరితపించింది.. ఒంటరిగానే జీవితాన్ని సాగించింది.. విషాదంగా ముగిసింది.. ఆ ట్రాజెడీ లవ్ అండ్ లైఫ్ స్టోరీ... కేర్ నాట్ అటిట్యూడ్.. ఫ్లూయెంట్ ఇంగ్లిష్.. కంప్లీట్ క్లారిటీతో పర్వీన్ బాబీ అనే ఉత్తుంగ తరంగం మోడలింగ్ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా ఫ్లాప్. అయినా నిర్మాతలు క్యూ కట్టారు ఆమె ఇంటి ముందు. కాల్షీట్ల కోసం పోటీ పడ్డారు దర్శకులు. పర్వీన్ బాబీ గ్లామర్ అలాంటిది. ఆమె రాకతో బాలీవుడ్ స్క్రీన్ కొత్త మెరుపులు సంతరించుకుంది. ఇదీ పర్వీన్ బాబీ సిగ్నేచర్. బాంబే చిత్రసీమ అంతా ఆమె కోసం వెంపర్లాడుతుంటే పర్వీన్ మాత్రం డేనీ డెంజోంగ్పా కోసం పరితపించింది. 1970ల సంగతి.. డానీ, పర్వీన్ ఇద్దరూ సమవయస్కులే. విలన్‌గా డానీ, హీరోయిన్గా పర్వీన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకరితో ఒకరికి పరిచయం అయింది. అప్పటికీ పర్వీన్ బాబీ గురించి డానీ విని ఉన్నాడు. తొలి చూపులోనే మతిపోగొట్టుకున్నాడు. పర్వీన్‌కూ డానీ ప్రత్యేకమయ్యాడు. అలా ఆ ఇద్దరి మనసులు కలిశాయి. తన ఫస్ట్ లవ్‌గా పర్వీన్‌ను మనసులో భద్రంగా దాచుకున్నాడు. కబర్లు, లాంగ్ డ్రైవ్‌లు వాళ్ల సాంగత్యాన్ని మరింత పెంచింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి తెచ్చింది. లివ్ ఇన్.. కలిసి ఉండడం ప్రారంభించారు. పెళ్లికాకుండా ఆ జంట ఒకే ఇంట్లో ఉండడం అప్పట్లో బాలీవుడ్లో సంచలనం. దాంతో బుగ్గలు నొక్కుకుంది. గాసిప్స్ పంచింది. ఖాతరు చేయలేదు ఆ ఇద్దరూ. పర్వీన్ తల్లికి తెలిసినా బిడ్డ సంతోషాన్ని చూసి మనసుకు సర్దిచెప్పుకుంది. వరుస హిట్లతో పర్వీన్ బిజీ అయిపోయింది. అవకాశాల పరంపర డానీనీ తీరిక లేకుండా చేసింది. ఒకే రంగంలో ఉన్నా ఇద్దరి ప్రపంచాలూ వేరవడం మొదలైంది. ఒకే ఇంట్లో ఉంటున్నా కలిసి గడిపే కాలం కరువవడం స్టార్ట్ అయింది. మౌనంగానే ఎవరికి వారవసాగారు. ఆ విషయం ఇద్దరికీ అర్థమైంది. బంధం తెగిపోయినా స్నేహం చెడిపోవద్దనే అవగాహనకు వచ్చారు. ఆ ఇంటిని ఖాళీ చేసి తమ ప్రేమప్రయాణాన్ని ఆపేశారు. షేక్ హ్యాండ్‌తో స్నేహాన్ని కొనసాగించారు. సాండోకాన్ పర్వీన్ బాబీతో బ్రేకప్ అయ్యాక డేనీ.. నటి కిమ్ యశ్పాల్ ప్రేమలో పడ్డాడు. కాని పర్వీన్.. డానీని మరిచిపోలేకపోయింది. ఆప్తమిత్రుడుగా అతడి అండను కోరుకుంటూనే ఉంది. ఈలోపు కబీర్ బేడీ దృష్టిలో పడింది పర్వీన్. ఇటలీలో... ‘సాండోకాన్’ అనే ఇటాలియన్ సీరియల్ సెట్స్‌లో. అందులో పర్వీన్ కూడా ఓ భూమిక పోషించింది. ఆ సెట్స్‌లో కబీర్ మనసులో అలజడి రేపిన పర్వీన్ త్వరలోనే అతని ప్రేమిక అయింది. ఈ జంట ప్రేమ ఇటాలియన్, స్పానిష్ మీడియానూ కనువిందు చేసింది. అక్కడి దిన పత్రికల పేజ్‌త్రీ కాలమ్స్, మ్యాగజీన్స్కు పర్వీన్, కబీర్ల డేటింగ్ కబుర్లు, ఫోటోలు బాగానే కాలక్షేపం అయ్యాయి. సాండోకాన్తో యూరప్‌లో కబీర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. చాన్స్‌ల గ్రాఫ్ కూడా హెచ్చింది. వెనక్కి బాలీవుడ్‌కు మళ్లే అవకాశం కనిపించలేదు. కాని బాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఉన్న పర్వీన్ బాబీకి ముంబై తిరిగిరాక తప్పలేదు. అప్పటికే ఆమె కోసం 40 సినిమాలు వేచి చూస్తున్నాయి. ముంబైలో పర్వీన్ ఫోన్లో పలకగానే నిర్మాతలంతా నిశ్చింతగా నిట్టూర్చారట. కెరీరా? కబీరా? అన్న పరిస్థితి వచ్చింది పర్వీన్ బాబీకి. కెరీర్ ఎంత ముఖ్యమో కబీర్‌తో లైఫ్ అంతకన్నా ముఖ్యం. కబీర్‌ను ఇండియాకు వచ్చేయమనడం అంత భావ్యంగా అనిపించలేదు ఆమెకు. అలాగని తన కెరీర్‌నూ వదులుకోవడానికి మనసొప్పలేదు. అలా అతనక్కడ.. ఇలా తానిక్కడ.. కుదిరేట్లు లేదు. కబీర్ అదివరకే వివాహితుడు. ప్రతిమా బేడీ నుంచి విడిపోవాలనుకుంటున్న సమయంలో తాను అతనికి దగ్గరైంది. కాని తనకూ ఓ లైఫ్ ఉంది.. గుర్తింపు ఉంది. దాన్ని వదులుకొని కబీర్‌కు నీడలా ప్రపంచమంతా తిరగాలని లేదు ఆమెకు. దాంతో కబీర్ చేయి విడిపించుకొని రెండేళ్ల ఆ ప్రణయానికి ఫుల్స్టాప్ పెట్టేంది పర్వీన్ బాబీ. ‘కబీర్‌ను వదులుకున్నందుకు నేనెప్పుడూ రిగ్రెట్స్ ఫీలవలేదు. అతని జర్నీకి నేను హార్డిల్ అయ్యి, ఆయన సక్సెస్‌ను శాసించాలనుకోలేదు. అలాగని నా ఐడెంటిటీనీ కోల్పోవడానికి సిద్ధపడలేదు. మహిళగా నాకూ ఈగో ఉంది. ప్రైడ్ ఉంది. దాన్ని కాపాడుకోవాలనుకున్నా. ఇంకా చెప్పాలంటే ఐ కుడ్ నెవర్ బికమ్ ఎ మ్యాన్స్ డాగ్. నేనెప్పుడూ నార్మల్ సెక్యూర్ రిలేషన్‌నే కోరుకున్నా. అతనితో అది సాధ్యంకాదని అర్థమైంది’ అని చెప్పింది పర్వీన్ బాబీ ఒక ఇంటర్వ్యూలో. ప్రేమంటే జీవితమంత పర్వా పర్వీన్‌కు. కబీర్ తర్వాతా ఆ అన్వేషణ కొనసాగింది. ఆ కథ వచ్చేవారం. -ఎస్సార్ -
పర్వీన్ బాబీ జీవిత చరిత్రపై విద్యాబాలన్ చూపు
ముంబై: గణిత మేధావి శకుంతల దేవి బయోపిక్‌లో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటన అందరిని అలరించింది. ఈ నేపథ్యంలో బయోపిక్‌లపై విద్యాబాలన్ ఆసక్తి చూపుతోంది. కాగా మాజీ బాలీవుడ్ నటి పరవీన్ బాబీ జీవీత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని జర్నలిస్ట్ కరీష్మా బాయ్ ఇటీవల విడుదల చేశారు. కాగా పరవీన్ బాబీ 2005సంవత్సరంలో మరణించారు. పరవీన్ జీవితంలో ఎన్నో భావోద్వేగాలు, మలుపులు, ఆరోగ్య సమస్యలు తదితర విభిన్న సంఘటనలతో బయోపిక్కు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. పర్వీన్ బాబీ గురించి జర్నలిస్ట్ కరీష్మా చెబుతూ.. పర్వీన్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఆమె సినిమా కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు, ఓ ఆధ్యాత్మిక గురువు ఆమెను సినిమాలో నటించవద్దని చెప్పడం లాంటి ట్వీస్ట్‌లు ఆమె జీవితంలో అనేకం ఉన్నాయి. కాగా, నటి పరవీన్ను గొప్ప నటి అంటూ విద్యాబాలన్ కొనియాడారు. అయితే, పర్వీన్ బాబీ జీవిత చరిత్రను బమోపిక్గా రూపొందించడానికి విద్యాబాలన్ ప్రయత్నిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. -
పర్వీన్ బాబీగా అమలాపాల్?
‘‘1970ల్లో ఇండస్ట్రీకి వచ్చి శ్రమిస్తున్న దర్శకుడు, ఆ సమయంలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న హీరోయిన్‌కి మధ్య ఉన్న అనుబంధాన్ని కథగా మలిచి నా వెబ్‌సిరీస్ ప్రయాణం మొదలుపెడుతున్నాను’’ అని ఆ మధ్య ప్రకటించారు హిందీ దర్శక–నిర్మాత మహేశ్ భట్. అయితే ఇది నటి పర్వీన్ బాబీకి, మహేశ్ భట్‌కి మధ్య జరిగిన వాస్తవ కథే అని బాలీవుడ్ టాక్. పర్వీన్ బాబి బయోపిక్ తరహాలోనే ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం. పర్వీన్ బాబీగా అమలాపాల్ నటించబోతున్నారన్నది తాజా వార్త. పర్వీన్ బాబీ పాత్రకు అమలా పాల్ కరెక్ట్‌గా సరిపోతారని టీమ్ భావించారట. ఈ వెబ్ సిరీస్‌ను మహేశ్ భట్, ముఖేష్ భట్ కలిసి విశేష్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తారు. త్వరలోనే ఈ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారట అమలా పాల్. -
ఆ హీరోయిన్ ఆస్తిలో 80 శాతం విరాళం
బాలీవుడ్ దివంగత నటి పర్వీన్ బాబీ ఆస్తి వివాదం ముగిసింది. ఆమె మరణించిన 11 ఏళ్ల తర్వాత ఈ కేసు పరిష్కారమైంది. పర్వీన్ బాబీ రాయించిన వీలునామా చట్టబద్ధమైనదిగా బాంబే హైకోర్టు శుక్రవారం ప్రకటించింది. దీని ప్రకారం ఆమె ఆస్తుల్లో 80 శాతం వీధిబాలలు, మహిళల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. పర్వీన్ మేనమామ మురాద్ఖాన్ బాబీ (82) ఆధ్వర్యంలో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి నడపనున్నారు. బాబీ వర్గానికి చెందిన వారికి సాయం చేయనున్నారు. మిగిలిన 20 శాతం సంపద ఆమె మేనమామ మురాద్ఖాన్కు చెందుతుంది. పర్వీన్ తన చేతులపై పెరిగిందని, ఆమె తనతో సన్నిహితంగా ఉండేదని, ఆమె ఆస్తులను పేదల కోసం వినియోగిస్తానని మురాద్ఖాన్ చెప్పాడు. గుజరాత్‌లోని జునాగాధ్లో జన్మించిన పర్వీన్ బాబీ 1970, 80ల్లో బాలీవుడ్లో పలు హిట్ చిత్రాల్లో నటించింది. జుహు ఫ్లాట్‌లో ఒంటరిగా నివసించిన ఆమె 56వ ఏట 2005 జనవరి 22న అనారోగ్యంతో మరణించింది. అవివాహిత అయిన పర్వీన్‌కు వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తి ఎవరికి దక్కుతుందనే సందేహం ఏర్పడింది. కాగా జునాగాధ్లో ఉంటున్న మురాద్ఖాన్ ఆమె రాయించిన వీలునామాను బయటపెట్టాడు. 2005లో కోర్టులో ప్రవేశపెట్టగా, ఈ వీలునామా నకిలీదని ఆమె పుట్టింటి తరఫువారు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ కేసు సుదీర్ఘకాలం నడిచింది. కాగా పర్వీన్ పుట్టింటి తరఫువారు కేసును ఉపసంహరించుకోవడంతో వివాదం పరిష్కారమైంది. ఆమెకు ముంబైలో జుహు ప్రాంతంలో అరేబియా సముద్రానికి ఎదురుగా విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. ఇంకా జునాగాధ్లో ఓ బంగ్లా, బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో 20 లక్షల రూపాయల డిపాజిట్లు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. -
వెండితెరపై పర్వీన్ జీవితం?
సినిమా తారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా వెండితెరపై ఓ స్థాయిలో విజృంభించిన పర్వీన్ బాబీ లాంటి తారల గురించి తెలుసుకోవాలను కుంటున్నారు. నటిగా మంచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్న పర్వీన్ నిజజీవితంలో మాత్రం చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆ సంఘటనల సమాహారంగా హిందీ, బెంగాలీ భాషల్లో ఓ సినిమా రూపొందించనున్నారు దర్శకుడు అగ్నిదేవ్ చటర్జీ. ఈ సినిమాకి ‘డిస్టర్బ్డ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీ రూపంలో ప్రియాంక చోప్రాను నాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. బెంగాలీ చిత్రానికి ఇంకా నాయికను ఖరారు చేయలేదని సమాచారం. వచ్చే నెలలో కానీ, కుదరకపోతే జూన్‌లో కానీ ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.ఇందులో తనతనయుడు ఆకాశ్‌ని హీరోగా నటింపజేయాలనుకుంటు న్నారట దర్శకుడు అగ్నిదేవ్ చటర్జీ.