కబీర్ బేడీతో అనుబంధాన్ని తెంచుకున్నంత వేగంగా ఆ బాధలోంచి బయటపడలేకపోయింది పర్వీన్. ఆ సమయంలో డానీ స్నేహం ఒక్కటే ఆమెకు కాస్త ఊరటైంది. అప్పుడే మహేశ్ భట్ తారసపడ్డాడు ఆమెకు. ఆనాటికే ఆమె స్టార్‌డమ్‌తో ఉంది. మహేశ్.. దర్శకత్వంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పర్వీన్ బాబీకి పిచ్చి అభిమాని కూడా. తొలి పరిచయంలోనే అతను ఆమెకు మంచి స్నేహితుడిగా కనిపించాడు. టీకి ఇంటికి ఆహ్వానించింది. చెలిమి పెరిగింది. మహేశ్ భట్ సాంగత్యంలో గతం మరిచిపోగలుగుతోంది. దాంతో ఆమెకు అతను సాంత్వన అయ్యాడు. ఆమె అతనికి ప్రేమిక అయింది. అప్పటికే మహేశ్ భట్‌కు లారెన్ బ్రైట్‌తో పెళ్లయి కూతురు కూడా (పూజా భట్). పర్వీన్ కోసం వాళ్లను కాదనుకున్నాడు. ఇల్లొదిలి వచ్చేశాడు. పర్వీన్‌తో సహజీవనం మొదలుపెట్టాడు. ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. చాలా రోజుల తర్వాత స్నేహితురాలి మొహంలో నవ్వు చూసి సంతోషపడ్డాడు డానీ.
అమితాబ్ చంపే ప్లాన్ చేస్తున్నాడు!
పర్వీన్, మహేశ్ భట్ దాదాపు మూడేళ్లు కలిసున్నారు. తనకు తెలిసిన ప్రపంచాన్నంతా పర్వీన్‌కు చూపించాడు మహేశ్. తన గైడ్, ఫిలాసఫర్.. జిడ్డు కృష్ణమూర్తినీ పరిచయం చేశాడు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్నప్పుడు ఒకరోజు.. మహేశ్ భట్ షూటింగ్ ముగించుకొని ఇంటికొచ్చేటప్పటికి పర్వీన్ వాళ్లమ్మ భయంభయంగా కారిడార్‌లో పచార్లు చేస్తోంది. ‘ఏమైంది?’ అని మహేశ్ భట్ అడిగేలోపే ‘పర్వీన్‌ను చూస్తే భయమేస్తోంది’ అంటూ భోరుమంది. ఆవిడను సముదాయించి అతను లోపలికెళ్లిచూస్తే.. కనీసం షూటింగ్ కాస్ట్యూమ్స్ కూడా తీయకుండా చేతిలో కూరగాయల కత్తితో గోడకు ఆనుకొని బెదిరిపోతూ కనిపించింది పర్వీన్. ‘పర్వీన్..’ అని మహేశ్ పిలిచేసరికి ‘ష్.. గట్టిగా మాట్లాడకు. ఆ ఫ్యాన్‌లో ఏదో సీక్రెట్ డివైజ్ ఉంది’ అంది ఆమె ఫ్యాన్‌ను చూపిస్తూ. విస్తుపోయిన అతను.. ‘ఏం డివైజ్? ఎవరు పెట్టారు?’ అని అడిగాడు. ‘నన్ను చంపడానికి.. అమితాబ్ బచ్చన్ పెట్టించాడు’ చెప్పింది పర్వీన్. హతాశుడయ్యాడు మహేశ్.
ఇంకోసారి..
ఎప్పటిలాగే ఓ రోజు డానీని భోజనానికి పిలిచింది పర్వీన్. డైనింగ్ టేబుల్ మీద వెండి శంఖం కనబడేసరికి.. ఊదాలని సరదాపడ్డాడు డానీ. అంతే ‘అమ్మో.. దాంట్లో బాంబ్ ఉంది. అవతల పడేసేయ్’ అంటూ గట్టిగట్టిగా అరిచిందట పర్వీన్. ఈసారి షాక్ అవడం డానీ వంతైంది. ‘ఈ మధ్య తరచూ ఇలాగే ప్రవర్తిస్తోంది. నాకేం అర్థం కావట్లేదు’ చెప్పాడు మహేశ్. ఆ సంఘటన నుంచి పర్వీన్ మానసిక ఆరోగ్యం దిగజారిపోయింది. మహేశ్‌కు కంటిమీద కునుకు కరువైంది. సైకియాట్రిస్ట్‌కు చూపిస్తే పారనాయిడ్ స్కిజోఫ్రీనియా అని తేలింది. మాత్రలతో ఫలితం కనిపించలేదు. బెంగళూరు, జిడ్డు కృష్ణమూర్తి దగ్గరకు తీసుకెళ్లాడు పర్వీన్‌ను. కొన్నాళ్లు సినిమా వాతావరణానికి దూరంగా, ప్రశాంతంగా అక్కడే బెంగుళూరులో ఉండమని ఆమెకు సలహానిచ్చిడు కృష్ణమూర్తి.
అయిష్టంగానే ఒప్పుకుంది. కాని ఉండలేక ముంబైకి తిరుగు ప్రయాణమైంది. డానీ సమక్షంలోనే కాస్త తేలికపడేదట పర్వీన్. అది గ్రహించిన మహేశ్ ‘నీ మాటలతో కాస్త ధైర్యపడుతున్నట్టుంది. వీలుచిక్కినప్పుడల్లా వస్తూ ఉండు’ అంటూ డానీని అభ్యర్థించాడు. అప్పటి నుంచి తనకు ఏ కాస్త టైమ్ దొరికినా వాళ్లింటికి వస్తూ పర్వీన్‌ను సరదాగా ఉంచే ప్రయత్నం చేయసాగాడు డానీ. ఆ క్రమంలో ఒకరోజు తమ ఇంటికి వచ్చిన డానీని గుమ్మంలోంచే బయటకు పంపించేసింది పర్వీన్.. ‘నన్ను చంపడానికి నిన్ను అమితాబ్ పంపాడు కదా? నువ్వు అతని ఏజెంట్‌వి. గెటవుట్’ అని అరుస్తూ. స్థాణువైపోయాడు డానీ. అతను వెళ్లిపోయే వరకు అరుస్తూ ఉందట పర్వీన్. దానికి కారణం.. ఆ రోజు ఓ పత్రికలో ఆమె అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ చదవడం. అందులో అమితాబ్.. డానీని తన ఆప్తమిత్రుడుగా పేర్కొనడం.
కోలుకోలేదు
మందులు వాడినా ఆమె మానసిక స్థితి మెరుగుపడలేదు. తనను అమితాబ్ మనుషులు వెంటాడుతున్నారని, ఇంట్లో దాక్కున్నారని, తనను చంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే నిరంతర అనుమానాలతో నిద్రాహారాలకు దూరమైంది. మహేశ్‌కు నరకాన్ని తలపించింది. ఇక ఆమెతో ఉండలేక ఆ ఇంట్లోంచి వచ్చేసి అతను తర్వాత భార్య లారెన్‌కు దగ్గరయ్యాడు మళ్లీ. ఒంటరిగానే మిగిలిపోయింది పర్వీన్. పారనాయిడ్ స్కిజోఫ్రీనియా, మధుమేహం ఇతర ఆరోగ్య సమస్యలతో 2005లో ఈ లోకాన్ని విడిచిపోయింది పర్వీన్ బాబీ. ఆమె చనిపోయిన రెండు రోజులకుగాని ఆ విషయం ఆమె ఇరుగుపొరుగుకు తెలియలేదు. పర్వీన్ మరణవార్త విన్నవెంటనే పరిగెత్తుకొచ్చాడు మహేశ్. డానీ, కబీర్‌బేడీ చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలను మహేశ్ భట్ జరిపించాడు. పర్వీన్‌కు తుది వీడ్కోలు పలికిన వాళ్లలో ఈ ముగ్గురితోపాటు జానీ బక్షి, రంజిత్, ప్రొడ్యూసర్ హరీష్ షా మాత్రమే ఉన్నారు. తన ఆస్తిని ‘బాబీ’అనే ముస్లిం తెగలోని అనాథలకు, ముంబైలోని క్రిస్టియన్, హిందూ అనాథ శరణాలయాలకు సమంగా రాసిచ్చింది పర్వీన్ బాబీ.
∙ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment