ఒక్కగానొక్క కొడుకు.. అతడి మీదే ఆధారపడుతున్న తల్లిదండ్రులు.. న్యూయార్క్‌లో జీవిస్తున్న ఆ కుమారుడిపై ముష్కరులు దాడి చేసి చంపేస్తారు. ఈ విషయం తెలిసి ఆ వృద్ధ దంపతులు కుప్పకూలిపోతారు. అద్దె ఇంటికి మారతారు. కొడుకు అస్థికల కోసం నెలల తరబడి ఎదురుచూస్తారు. చివరకు అతడి అస్థికలు, తను వాడిన వస్తువులు అన్నీ ఇండియాకు వస్తాయి. కానీ అవి ఇవ్వాలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందేనన్నారు అధికారులు.
వృద్ధాప్యంలో ఉన్న తాము ఎక్కడి నుంచి డబ్బులు తేగలమని ప్రశ్నించాడా తండ్రి. వస్తువులు ఉంచేసుకోండి, కనీసం అస్థికలైనా ఇవ్వమని అర్థించాడు. అవమానించారు. చివరకు కస్టమ్స్ ఆఫీసు ప్రధాన అధికారిని కలిసి మొరపెట్టుకున్నాడు, కన్నీటిపర్యంతమయ్యాడు. అప్పుడు కానీ ఆ కొడుకు అస్థికలు, వస్తువులు తన చేతికి రాలేదు.. ఇది 1984లో వచ్చిన హిందీ మూవీ సారాంశ్ సినిమా కథ!
ఆఫీసర్లకు లంచం
ఇలాంటి ఘటనలు రీల్ లైఫ్‌లో కన్నా రియల్ లైఫ్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సారాంశ్ సినిమా వచ్చి 40 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహేశ్ భట్ ఓ నిజ సంఘటనను చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'సింగర్ జగజీత్ సింగ్ కుమారుడు ఓ యాక్సిడెంట్‌లో మరణించాడు. అప్పుడతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి జూనియర్ ఆఫీసర్లకు లంచం ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. సారాంశ్ సినిమా ప్రాముఖ్యత అప్పుడర్థమైందన్నాడు. చాలాచోట్ల తమ సొంత కుటుంబీకుల మృతదేహాలను చూసేందుకు, ఇంటికి తీసువెళ్లేందుకు సాధారణ ప్రజలు ఎంతగానో ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చాడు.
జగజీత్ సింగ్
20 ఏళ్లకే మరణం
కాగా జగజీత్ సింగ్- చిత్రల ఏకైక తనయుడు వివేక్ 1990లో కారు ప్రమాదంలో మరణించాడు. అప్పుడతడి వయసు 20 ఏళ్లు మాత్రమే! తనయుడి మరణం వారిని ఎంతగానో కుంగదీసింది. కొంతకాలానికి ఇద్దరూ సంగీతపరిశ్రమకు దూరమయ్యారు. సారాంశ్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని మహేశ్ భట్ తెరకెక్కించాడు. అనుపమ్ ఖేర్ ఈ మూవీ ద్వారా నటుడిగా పరిచయమయ్యాడు. అప్పుడతడి వయసు 28 ఏళ్లు. అయినప్పటికీ పాత్ర నచ్చడంతో 60 ఏళ్ల వృద్ధుడిగా నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment