న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ సరఫరా వరుసగా అయిదో త్రైమాసికంలో కూడా పెరిగింది. జూలై–సెప్టెంబర్ క్వార్టర్‌లో సుమారు 6 శాతం వృద్ధి చెంది 4.6 కోట్లకు చేరింది. 72 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీల హవా కొనసాగింది.
16 శాతం షేర్‌తో వివో అగ్రస్థానంలో ఉండగా, టాప్ 10 బ్రాండ్స్‌లో ఐకూ అత్యధిక వృద్ధి సాధించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా, శాంసంగ్ వాటా 12.3 శాతంగా ఉంది. వివో వాటా 13.9 శాతం నుంచి 15.8 శాతానికి పెరిగింది.
అందుబాటు ధరలోని వై సిరీస్‌తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన టీ3, వీ40 సిరీస్‌ల దన్నుతో వరుసగా మూడో త్రైమాసికంలో కూడా వివో అగ్రస్థానంలో నిల్చింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఒప్పో 13.9 శాతం, రియల్‌మీ 11.5 శాతం, షావోమీ 11.4 శాతం, పోకో 5.8 శాతం, మోటరోలా 5.7 శాతం, ఐకూ 4.2 శాతం, వన్‌ప్లస్ 3.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. యాపిల్ అత్యధికంగా 40 లక్షల యూనిట్లు సరఫరా చేసింది.
మిగతా విశేషాలు..
» రూ. 50,000 నుంచి రూ. 68,000 వరకు ధర శ్రేణి ఉండే ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్ వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా 86 శాతం వృద్ధి చెందింది. మొత్తం సరఫరా 2 శాతం నుంచి సుమారు 4 శాతానికి పెరిగింది. ఐఫోన్ 15/13/14, గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 12 ప్రధాన మోడల్స్‌గా నిల్చాయి. ఈ విభాగంలో యాపిల్ వాటా 71 శాతానికి పెరగ్గా శాంసంగ్ వాటా 30 శాతం నుంచి 19 శాతానికి పడిపోయింది.
» రూ. 16,000 నుంచి రూ. 35,000 ధర శ్రేణిలోని ఎంట్రీ–ప్రీమియం సెగ్మెంట్ 42 శాతం వృద్ధి సాధించింది. మొత్తం స్మార్ట్‌ఫోన్ల సరఫరాలో 28%వాటాను దక్కించుకు ంది. ఒప్పో గణనీయంగా పెరగ్గా శాంసంగ్, వివోల మార్కెట్ వాటా తగ్గింది. ఈ విభాగంలో ఈ మూడింటి వాటా 53 %గా ఉంది.
» 5జీ స్మార్ట్‌ఫోన్ల సరఫరా 57% నుంచి 83%కి పెరిగింది. అదే సమయంలో సగటు విక్రయ ధర (ఏఎస్‌పీ) 20% తగ్గింది. 5జీ సెగ్మెంట్లో మాస్ బడ్జెట్ విభాగం (రూ. 8,000–రూ. 16,000 వరకు ధర) దాదాపు రెట్టింపై 50 శాతానికి చేరింది. షావోమీ రెడ్‌మీ 13సీ, యాపిల్ ఐఫోన్ 15, ఒప్పో కే12ఎక్స్, వివో టీ3ఎక్స్.. వై28 మోడల్స్ మూడో త్రైమాసికంలో అత్యధికంగా సరఫరా అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment