
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏప్రిల్–జూన్ కాలంలో 3.4 కోట్ల స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 86 శాతం వృద్ధి నమోదైంది. షావొమీ 29.2 శాతం మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలిచింది. శామ్‌సంగ్, వివో, రియల్‌మీ, ఒప్పో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర క్రితం ఏడాదితో పోలిస్తే 15 శాతం అధికమై రూ.13,700లకు చేరింది. ధరల పెరుగుదల, 5జీ మోడళ్ల రాకతో సగటు విక్రయ ధర రానున్న త్రైమాసికాల్లో దూసుకెళ్లనుంది. 2020తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో వృద్ధి 9 శాతంలోపే ఉంటుందని ఐడీసీ అంచనా వేస్తోంది.
థర్డ్ వేవ్ ముప్పు, సరఫరా అడ్డంకులు, పెరుగుతున్న విడిభాగాల ధరలు, ద్రవ్యోల్బణం ఇందుకు కారణమని వెల్లడించింది. వినియోగదార్లు ఫీచర్ ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవడం, తక్కువ, మధ్యస్థాయి ఫోన్లు వాడుతున్నవారు మెరుగైన స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు, 5జీ మోడళ్ల వెల్లువతో 2022లో మార్కెట్ తిరిగి పుంజుకుంటుందని వివరించింది. ఇక 5జీ మోడళ్ల అమ్మకం విషయంలో భారత్ నాల్గవ స్థానంలో ఉంది.
చైనా, యూఎస్, జపాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో 50 లక్షల 5జీ స్మార్ట్‌ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 5జీ మోడల్ సగటు విక్రయ ధర రూ.30,500 నమోదైంది. ఈ ఏడాది చివరినాటికి రూ.15,000లోపు ధర గల మోడళ్లు వెల్లువెత్తుతాయని ఐడీసీ అంచనా వేస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే, అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment