డ్రోన్‌ మార్కెట్‌ @ రూ.2 లక్షల కోట్లు | India drone industry is set for major growth 2030 | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ మార్కెట్‌ @ రూ.2 లక్షల కోట్లు

Jul 8 2025 6:16 AM | Updated on Jul 8 2025 9:42 AM

India drone industry is set for major growth 2030

2030 నాటికి చేరుకోవచ్చు 

నెక్స్‌జెన్‌ నివేదిక అంచనా 

సాగు, రక్షణ రంగాల నుంచి మద్దతు

న్యూఢిల్లీ: రక్షణ, వ్యవసాయం, లాజిస్టిక్స్, మౌలికం తదితర ఎన్నో రంగాల్లో డ్రోన్ల వినియోగంతో మంచి ఫలితాలు కనిపిస్తుండడంతో ఈ మార్కెట్‌ వచ్చే ఐదు సంవత్సరాల్లో గణనీయంగా వృద్ధి చెందనుందని నెక్స్‌జెన్‌ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి దేశీ డ్రోన్‌ తయారీ పరిమాణం 23 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.1.96 లక్షల కోట్లు) చేరుకోవచ్చని పేర్కొంది. ఆధునిక యుద్ధ తంత్రాల్లో డ్రోన్లు కీలకంగా మారిన విషయాన్ని ప్రస్తావించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సింధూర్‌లో డ్రోన్ల వినియోగం స్పష్టమైన మార్పునకు నిదర్శనంగా పేర్కొంది. 

15 పట్టణాలకు చెందిన 150 కంపెనీల అభిప్రాయాలను నెక్స్‌జెన్‌ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. ముఖ్యంగా వ్యవసాయం, కచ్చితమైన సాగు అవసరాలు 2030 నాటికి డ్రోన్ల డిమాండ్‌కు కీలకంగా నిలుస్తాయని 40 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత రక్షణ రంగం నుంచి ఎక్కువ డిమాండ్‌ వస్తుందని పేర్కొన్నాయి. స్మార్ట్‌ సాగు రూపంలో వచ్చే ఐదేళ్లో గ్రామీణ వ్యవసాయంలో డ్రోన్లు బూమ్‌ను సృష్టిస్తాయని నమ్ముతున్నట్టు సర్వేలో 20 శాతం కంపెనీల ప్రతినిధుల తెలిపారు. లాజిస్టిక్స్‌ (వస్తు రవాణా), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలు సైతం డ్రోన్ల తయారీకి చోదకంగా నిలుస్తాయని 15 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి.  

ఢిల్లీలో అంతర్జాతీయ డ్రోన్స్‌ ప్రదర్శన 
ఈ డిమాండ్‌నకు మరింత మద్దతునిచ్చే చర్యల్లో భాగంగా ఈ నెల 31 నుంచి ఆగస్ట్‌ 1 వరకు ఢిల్లీలో అతిపెద్ద ‘డ్రోన్‌ అంతర్జాతీయ ప్రదర్శన 2025’ నిర్వహించనున్నట్టు నెక్స్‌జెన్‌ తెలిపింది. నెక్స్‌జెన్‌ ఎగ్జిబిషన్స్‌ దీన్ని నిర్వహిస్తుండడం గమనార్హం. రష్యా, తైవాన్, కెనడా, ఉక్రెయిన్, భారత్‌ సహా ఆరు దేశాలు తమ నూతన డ్రోన్‌ ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నట్టు వెల్లడించింది. అలాగే, 50కు పైగాఅంతర్జాతీయ డ్రోన్‌ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్టు తెలిపింది.

 ‘‘ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో డ్రోన్లు చూపించిన అద్భుత సామర్థ్యాలను యావత్‌ ప్రపంచం గమనించింది. దేశీ తయారీ డ్రోన్లను ప్రోత్సహించడం ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుందని, పలు రంగాల్లో దేశ శ్రేయస్సుకు మేలు చేస్తుందని భావిస్తున్నాను’’అని నెక్స్‌జెన్‌ ఎగ్జిబిషన్స్‌ డైరెక్టర్‌ ఆధార్‌ బన్సాల్‌ తెలిపారు. వ్యవసాయంలో విత్తనాలు నాటడం, మందుల పిచికారీతోపాటు నిఘా, పంటల ఆరోగ్యం పరిశీలన సహా ఎన్నో రూపాల్లో డ్రోన్లు సేవలు అందిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయంగా వ్యవసాయ డ్రోన్ల మార్కెట్‌ 2030 నాటికి చేరుకోవచ్చని 6 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలను నెక్స్‌జెన్‌ నివేదిక ప్రస్తావించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement