దేశంలోని కొందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖలు తమ నిరాంబర శైలితో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో నిరంజన్ హీరానందని (Niranjan Hiranandani) ఒకరు. వేల కోట్ల సంపదకు అధిపతి అయినా లోకల్ ట్రైన్‌లోనే ప్రయాణిస్తూ పలువురి ఆదర్శంగా నిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో 'ఇండస్ట్రీ గురు'గా పేరొందిన ఆయన హీరానందని గ్రూప్ పేరుతో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి కొత్త శిఖరాలకు నడిపించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి డేటా సెంటర్స్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ బిజినెస్ కొత్త యుగం వరకు విస్తరించిన హీరానందని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు నిరంజన్ హీరానందని నాయకత్వం వహిస్తున్నారు. తన పదునైన వ్యాపార చతురత, నైపుణ్యంతో హీరానందని గ్రూప్‌ను ప్రపంచ ఖ్యాతి పొందిన కంపెనీగా మార్చడంలో ప్రసిద్ది చెందారు. నిరంజన్ హిరానందని గురించి, ఆయన విజయవంతమైన ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..?
నిరంజన్ హీరానందని నెట్‌వర్త్
హురున్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. భారతదేశంలోని 50 మంది ధనవంతులలో నిరంజన్ హీరానందనీ ఉన్నారు. నిరంజన్‌కు రూ. 12 వేల కోట్లకుపైగా విలువైన ఆస్తులు ఉన్నాయి . విలాసవంతమైన కార్ల కలెక్షన్ కూడా ఉంది. అయితే నిరంజన్ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన ఇప్పటికీ ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ కనిపిస్తారు.
లోకల్ ట్రైన్‌లో ప్రయాణం ఇందుకే..
ముంబై మహా నగరంలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అంతటి ట్రాఫిక్‌లో ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో టైమ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే నిరంజన్ హీరానందని ట్రాఫిక్‌లో సమయాన్ని వృథా చేయకుండా ముంబై లోకల్ రైలులో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. ఇలా రైలులో వెళ్తున్నప్పుడు సాధారణ వ్యక్తులతో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చన్నది ఆయన భావన.
"ఆయన (నిరంజన్ హీరానందానీ) తెలివిగల పెట్టుబడి వ్యూహాలు, మార్గదర్శక పరిణామాలకు ప్రసిద్ధి చెందారు. అతని ఆర్థిక విజయం రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాల అంకితభావం కృషి ప్రత్యక్ష ఫలితం" అని నిరంజన్ హీరానందానీ అధికారిక వెబ్‌సైట్ తెలిపింది. "ఆయన ప్రయత్నాలు ముంబై స్కైలైన్‌ను మార్చడమే కాకుండా, పట్టణ జీవన ప్రమాణాలను కూడా మార్చేశాయి, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, స్థిరమైన జీవనం ,విలాసవంతమైన జీవనశైలి అనేకమందికి అందుబాటులోకి తీసుకువచ్చాయి" వెబ్‌సైట్ పేర్కొంది.
స్వీయ నిర్మిత బిలియనీర్
నిరంజన్ హీరానందని సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న లక్ష్యంతో సీఏ చదువును అభ్యసించిన ఆయన తర్వాత అకౌంటింగ్ టీచర్‌గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. వాణిజ్య రంగంలో కొన్ని సంవత్సరాల తరువాత, హీరానందని తన సోదరుడితో కలిసి హీరానందని గ్రూప్‌ను స్థాపించారు. తరువాత 1981లో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా, హీరానందని తన దృష్టిని రియల్ ఎస్టేట్ పరిశ్రమపైకి మళ్లించి చివరికి ఆ రంగంలో తనను తాను ప్రముఖ వ్యక్తిగా స్థాపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment