అత్తిలిలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం నమోదు చేయించుకుంటున్న వాహనదారులు (ఫైల్)
తణుకు అర్బన్: పట్టణానికి చెందిన సుబ్బారావు ద్విచక్ర వాహనం పై వెళ్తూ వృద్ధురాలిని ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో వృద్ధురాలి తలకు తీవ్ర గాయమైంది. సదరు వాహనదారుడు సుబ్బారావుకు డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా ఆ వృద్ధురాలికి వాహన బీమా సౌకర్యం పొందలేక ఆ కుటుంబం వైద్య సేవలు చేయించేందుకు ఇబ్బందులు పడింది. వైద్యసేవలు చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి వృద్ధురాలిని ఢీకొట్టినందుకు సుబ్బారావుకు న్యాయస్థానం భారీగా జరిమానా విధించింది. అలాగే భీమవరంలో వెంకటేశ్వరరావు అనే యువకుడు ఆటో నడుపుతూ ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతిచెందడంతో సదరు ఆటో డ్రైవర్ వెంకటేశ్వరరావుకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో న్యాయస్థానం, జరిమానా, జైలు శిక్ష విధించింది.
మీ ముంగిట్లోకి..
ఎందరో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. ఇటువంటి వారి కోసం రవాణా శాఖ మీ ముంగిట్లోకి రవాణా సేవలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగి ఉండాలనే లక్ష్యంతో గత నెల 18 నుంచి 24వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో లెర్నర్ లైసెన్స్(ఎల్‌ఎల్‌ఆర్) మేళా నిర్వహించింది. దీనికి ప్రజల నుంచి కూడా స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 78 గ్రామాల్లో నిర్వహించిన ఈ మేళాలో 4,856 మంది ఎల్‌ఎల్‌ఆర్ పొందారు. నెల రోజుల తరువాత సంబంధిత రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి లైసెన్స్ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 7 రవాణా శాఖ కార్యాలయాల ద్వారా..
జిల్లాలోని 7 రవాణా శాఖ కార్యాలయాలైన ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, కొవ్వూరు కార్యాలయాల పరిధిలోని గ్రామాల్లో ఆయా మోటారు వెహికల్ ఇనస్పెక్టర్లు ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు వచ్చిన వాహనదారుల ధ్రువ పత్రాలను పరిశీలించి వారికి కంప్యూటర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో అర్హులైన వారికి అదేరోజు ఎల్‌ఎల్‌ఆర్ అందజేశారు. మామూలు రోజుల్లో స్లాట్ బుకింగ్‌కు మీ సేవా కేంద్రాలకు, ఎల్‌ఎల్‌ఆర్, లైసెన్స్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు అధికసంఖ్యలో హాజరై ఈ మేళాలో ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందారు. జిల్లాలోని 7 రవాణా కార్యాలయాల ద్వారా మూడు నెలల్లో నమోదయ్యే ఎల్‌ఎల్‌ఆర్‌ల సంఖ్య కేవలం వారం రోజుల్లో నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.
లైసెన్స్ లేకుంటే చిక్కులే..
వాహనదారుడికి, ఎదురుగా వచ్చే వారికి కూడా ధీమా కలిగించేది డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ లేని పక్షంలో జరిగే అనర్థాలు కోకొల్లలు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కీలకం కానుంది. లైసెన్స్ లేని ప్రయాణాలు జరిమానాలు నుంచి జైలు శిక్షల వరకు తీసుకువెళ్తున్నాయి. ప్రమాద బాధ్యుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో బాధితులకు బీమా సౌకర్యం కూడా అందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి పాల్పడిన వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సదరు వ్యక్తిని రికార్డుల నుంచి మార్చి బాధితుడికి బీమా సౌకర్యం అందేలా చేయాలనే ఒత్తిడి అధికారులకు వస్తోన్న సందర్భాలు జిల్లాలో వస్తున్నాయి. వాహన యజమాని నుంచి బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాల్సి వస్తోన్న సందర్భాల్లో సైతం అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లాలో ఎల్‌ఎల్‌ఆర్ మేళా వివరాలివి..ఎల్‌ఎల్‌ఆర్ మేళాకు మంచి స్పందన
ముంగిట్లో రవాణా శాఖ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎల్‌ఎల్‌ఆర్ మేళాకు జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 4,856 మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితులకు బీమా సౌకర్యం అందని పరిస్థితులు వస్తున్నాయి. 18 సంవత్సరాల వయస్సు నుంచి వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. లైసెన్స్ మంజూరు చేసే క్రమంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తాం.– ఎన్.శ్రీనివాస్, తణుకు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment