llr special drive
-
లైసెన్స్ లేకపోయినా.. నో ఫైన్ !
సాక్షి, భీమవరం: మన రోడ్లపై నిత్యం అనేకమంది ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో జరిమానాలు కట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా బైక్‌లు నడపడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఈ సమస్యకు భీమవరం పోలీసులు ఒక పరిష్కారం కనుగొన్నారు. ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వారికి ఫైన్ కాకుండా రూ. 410లు కట్టించుకుని వెంటనే ఎల్ఎల్ఆర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా అమలుచేసేలా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారిని తనిఖీ చేస్తే ప్రతి 10 మందిలో 8 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం లేదని పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. దీంతో ఎప్పీ రవిప్రకాష్ వినూత్నంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. పోలీసు సిబ్బంది తనిఖీలు చేసే సమయంలో లైసెన్స్‌లేని వారు అక్కడికక్కడే ఎల్ఎల్ఆర్ పొందేలా రూపకల్పన చేశారు. లైసెన్స్ లేనివారు లేని వారు కేవలం రూ. 410తో ఎల్ఎల్ఆర్ పొందే అవకాశం ఉండడంతో పాటు వెంటనే శాశ్వత లైసెన్స్ తీసుకునేలా వారికి అవగాహన కలి్పస్తున్నట్లు రవిప్రకాష్ చెప్పారు. ఈ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి లైసెన్స్‌లు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 7 వేల మందికి తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేసినట్లు చెప్పారు. హెల్మెట్ తప్పనిసరి వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని నివారించేలా చర్యలు చేపట్టారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వాహనాదారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. దీనిలో భాగంగా తనిఖీలు చేసే ప్రాంతాల్లో హెల్మెట్ల అమ్మకాలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. నాణ్యమైన హెల్మెట్లు విక్రయించేలా చేయడం వల్ల జరిమానా కట్టే కంటే హెల్మెట్ కొనుగోలు చేయడం, ధరించడం మేలనే భావన వాహనదారుల్లో కలిగేలా చైతన్యం కలిగించడానికి ప్రణాళిక రూపొందించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు భీమవరం జిల్లాకేంద్రంగా అవతరించిన తరువాత ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. అవసరాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాలు రూపొందించవచ్చనే అంశంపై పట్టణంలోని శ్రీవిష్ణు ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ప్రత్యేక సర్వే చేపట్టాం.సమస్య పరిష్కారానికి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాక.. జిల్లాలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్న తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆకివీడు పట్టణాల్లో కూడా ఇదే తరహా సర్వే చేయించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గాన్ని అన్వేíÙస్తాం. – రవిప్రకాష్ ఎస్పీ, భీమవరం జిల్లా -
చలానాలో చిలక్కొట్టుడు..!
విజయనగరం ఫోర్ట్: ‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన శిరికి రమణ అనే వ్యక్తి ఫిబ్రవరి 24వ తేదీన టూవీలర్ లెర్నర్ లైసెన్సు (ఎల్ఎల్ఆర్) కోసం అవసరమై చలానా తీసేందుకు ఉడాకాలనీలో ఉన్న ఆన్లైన్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఎల్ఎల్లర్ చలానా ఇచ్చి రూ.350 తీసుకున్నారు. చలానాలో రూ.260 ఉంది కదా రూ.350 ఎందుకని అడిగితే సర్వీస్ చార్జీగా బదులిచ్చారు. దీంతో చేసేది లేక మిన్నుకుండిపోయారు’. ఈ సమస్య ఈ ఒక్క వాహనచోదకుడితే కాదు. వేలాదిమందికి ఎదురవుతున్న సమస్య. ఎల్ఎల్ఆర్ లేదా డ్రైవింగ్ లైసెన్సు కోసం చలానా కోసం వెళితే వాహన చోదకుడి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ తంతు జరుగుతున్నా రవాణశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వాహన చోదకులు చేతిచమురు వదిలించుకోవాల్సిన దుస్థితి. 400కు పైగా సీఎస్సీ సెంటర్స్.. రవాణ శాఖలో ఆన్లైన్ సేవలను జిల్లాలో ఉన్న సీఎస్సీ (కామన్ సర్వీసెస్ సెంటర్స్)కు అప్పగించారు. రవాణ శాఖకు సంబంధించి పలు సేవలను ఈ సెంటర్స్‌లో పొందవచ్చు. అలాగే, మీ– సేవ కేంద్రాల్లో రవాణశాఖ సేవలు పొందవచ్చు. అయితే, కొన్ని సీఎస్సీ సెంటర్స్, కొన్ని మీ సేవ కేంద్రాల్లో వాహన చోదకుల నుంచి నిర్దేశించిన చలానా కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. చలానా కంటే రూ.50 నుంచి రూ.100 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, కొన్ని చోట్ల అయితే రూ.150 రూ.200 కూడా వసూలు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవంగా చలానాలు ఇలా... రవాణ శాఖకు ద్విచక్ర వాహనం ఎల్ఎల్ఆర్ చలానా కోసం రూ.260 చెల్లించాలి. అయితే, దీనికోసం రూ.300 నుంచి రూ.350 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే, నాలుగు చక్రాల వాహనం ఎల్ఎల్ఆర్ కోసం రూ.410 చెల్లించాలి. దీనికి రూ.450 నుంచి రూ.500, కొన్ని చోట్ల రూ.550 కూడా వసూలు చేస్తున్నారు. అలాగే, టూవీలర్ లైసెన్స్ కోసం రూ.950 చెల్లించాలి. అయితే, రూ.1000, రూ.1050 తీసుకుంటున్నారు. అలాగే, ఫోర్ వీలర్ లైసెన్సు కోసం రూ.1260 తీసుకోవాలి. దీనికోసం రూ.1300 నుంచి రూ.1350 వసూలు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం... కొన్ని సీఎస్సీ సెంటర్స్‌ల్లో చలానా కంటే అధికంగా వసూలు చేసినట్టు మా దష్టికి వచ్చింది. లిఖత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆయా సెంటర్లపై చర్యలు తీసుకుంటాం.– ఎ.దుర్గాప్రసాద్‌రావు, వెహికల్ ఇనస్పెక్టర్ -
ఎల్ఎల్ఆర్ మేళాతో మోసం
జంగారెడ్డిగూడెం : కాదేది వసూళ్లకు అనర్హం అన్నట్లుగా సాగింది ఓ సీఎస్సీ నిర్వాహకుడి తీరు. రవాణా శాఖ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎల్ఎల్ఆర్ మేళాను కాసులు కురిపించే కార్యక్రమంగా మార్చుకున్నాడు. అమాయక గిరిజనులను టార్గెట్ చేసుకుంటూ లక్షలాది రూపాయలు కాజేశాడు. మోసపోయామని తెలుసుకున్న గిరిజనులు ఐటీడీఏ పీఓను ఆశ్రయించడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రవాణా శాఖ ప్రతీ వాహన చోదకుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రవాణా శాఖ జంగారెడ్డిగూడెం సబ్యూనిట్ ఆధ్వర్యంలో ఇటీవల జీలుగుమిల్లిలో ఒక సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు మంచి స్పందన వచ్చింది. ఆ రోజు సర్వర్ సక్రమంగాపనిచేయకపోవడంతో కొద్ది మందికి మాత్రమే స్థానిక ఎంవీఐ సీహెచ్ వెంకటరమణ, ఏఎంవీఐ శ్రీనివాస్ ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీచేయగలిగారు. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. దీనినే సీఎస్సీ నిర్వాహకుడు కాసులు పండించే అవకాశంగా మలుచుకున్నాడు. రవాణాశాఖ అధికారులకు తెలియకుండా వారి అనుమతి లేకుండా ఏజెన్సీ గ్రామాల్లో సొంతంగా ఎల్ఎల్ఆర్ మేళాను ఏర్పాటు చేశారు. ఒక కారులో ల్యాప్‌టాప్ తీసుకుని ఆయా గ్రామాలకు వెళ్లి దండోరా వేయించి ఏకంగా పంచాయతీ కార్యాలయంలోనే ఎల్ఎల్ఆర్ మేళా ఏర్పాటు చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సిన వారు పంచాయతీ కార్యాలయానికి రావాలని డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని దండోరా వేయించారు. ఐటీడీఏ ద్వారా మేళాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. దీంతో అమాయక గిరిజనులు వందల సంఖ్యలో క్యూకట్టారు. ఇలా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో సదరు సీఎస్సీ నిర్వాహకుడు మేళాను ఏర్పాటు చేశారు. వాస్తవానికి మోటార్ సైకిల్ ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.260 తీసుకోవాల్సి ఉండగా సదరు నిర్వాహకుడు రూ.600, కారు లేదా ట్రాక్టర్‌కు అయితే రూ.410 తీసుకోవాల్సి ఉండగా రూ.1000 వరకు వసూలు చేశాడు. అంటే ఒక్కొక్క ఎల్‌ఎల్‌ఆర్‌కు రెట్టింపుపైగా వసూలు చేశాడు. సుమారు 2500 స్లాట్లు బుక్ చేశాడు. ఈ విధంగా లక్షలాది రూపాయలు దండుకున్నాడు. దీంతో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సెప్టెంబర్ 2వ వారం వరకు కూడా ఎల్‌ఎల్‌ఆర్‌కు స్లాట్లకు ఖాళీలేదు. సదరు నిర్వాహకుడు బుక్ చేసిన స్లాట్‌కు సంబంధించి గిరిజన యువకులు ఎంవీఐ కార్యాలయానికి వచ్చి లైసెన్స్ ఇమ్మని అడగడంతో రవాణా శాఖాధికారులు అవాక్కయ్యారు. దీనికోసం టెస్ట్ నిర్వహించడంతో వారంతా అవగాహన లేక టెస్ట్‌లో విఫలమయ్యారు. దీంతో గిరిజనులు ఐటీడీఏ పీఓ హరేంద్రప్రసాద్‌కు ఫిర్యాదుచేశారు. వెంటనే ఆయన స్థానిక ఎంవీఐ సీహెచ్ వెంకటరమణను అడగ్గా తామేమీ ఎల్ఎల్ఆర్మేళా నిర్వహించలేదని స్పష్టం చేశారు. దీంతో నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఐటీడీఏ మేనేజర్‌కు ఆదేశాలు జారీచేశారు. అయినా ఫలితం లేకపోయింది. గిరిజనులు మాత్రం డ్రైవింగ్ లైసెన్సుల కోసం స్థానిక ఎంవీఐ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎంవీఐ వెంకట రమణ సీఎస్సీ హెడ్ అయిన ఏలూరుకు చెందిన రాజుకు ఫోన్లో జీలుగుమిల్లి సీఎస్సీ నిర్వాహకుడిపై ఫిర్యాదు చేశారు. అయినా నేటికీ చర్యలు లేవు. తామంతా మోసపోయామని, తమ వద్ద ఎల్ఎల్ఆర్ పేరుతో లక్షలాది రూపాయలు సీఎస్సీ నిర్వాహకుడు వసూలు చేశాడని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజల వద్దకే రవాణా సేవలు
తణుకు అర్బన్: పట్టణానికి చెందిన సుబ్బారావు ద్విచక్ర వాహనం పై వెళ్తూ వృద్ధురాలిని ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో వృద్ధురాలి తలకు తీవ్ర గాయమైంది. సదరు వాహనదారుడు సుబ్బారావుకు డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా ఆ వృద్ధురాలికి వాహన బీమా సౌకర్యం పొందలేక ఆ కుటుంబం వైద్య సేవలు చేయించేందుకు ఇబ్బందులు పడింది. వైద్యసేవలు చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి వృద్ధురాలిని ఢీకొట్టినందుకు సుబ్బారావుకు న్యాయస్థానం భారీగా జరిమానా విధించింది. అలాగే భీమవరంలో వెంకటేశ్వరరావు అనే యువకుడు ఆటో నడుపుతూ ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతిచెందడంతో సదరు ఆటో డ్రైవర్ వెంకటేశ్వరరావుకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో న్యాయస్థానం, జరిమానా, జైలు శిక్ష విధించింది. మీ ముంగిట్లోకి.. ఎందరో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. ఇటువంటి వారి కోసం రవాణా శాఖ మీ ముంగిట్లోకి రవాణా సేవలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగి ఉండాలనే లక్ష్యంతో గత నెల 18 నుంచి 24వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో లెర్నర్ లైసెన్స్(ఎల్ఎల్ఆర్) మేళా నిర్వహించింది. దీనికి ప్రజల నుంచి కూడా స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 78 గ్రామాల్లో నిర్వహించిన ఈ మేళాలో 4,856 మంది ఎల్ఎల్ఆర్ పొందారు. నెల రోజుల తరువాత సంబంధిత రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి లైసెన్స్ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 7 రవాణా శాఖ కార్యాలయాల ద్వారా.. జిల్లాలోని 7 రవాణా శాఖ కార్యాలయాలైన ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, కొవ్వూరు కార్యాలయాల పరిధిలోని గ్రామాల్లో ఆయా మోటారు వెహికల్ ఇనస్పెక్టర్లు ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు వచ్చిన వాహనదారుల ధ్రువ పత్రాలను పరిశీలించి వారికి కంప్యూటర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో అర్హులైన వారికి అదేరోజు ఎల్ఎల్ఆర్ అందజేశారు. మామూలు రోజుల్లో స్లాట్ బుకింగ్‌కు మీ సేవా కేంద్రాలకు, ఎల్ఎల్ఆర్, లైసెన్స్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు అధికసంఖ్యలో హాజరై ఈ మేళాలో ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందారు. జిల్లాలోని 7 రవాణా కార్యాలయాల ద్వారా మూడు నెలల్లో నమోదయ్యే ఎల్‌ఎల్‌ఆర్‌ల సంఖ్య కేవలం వారం రోజుల్లో నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. లైసెన్స్ లేకుంటే చిక్కులే.. వాహనదారుడికి, ఎదురుగా వచ్చే వారికి కూడా ధీమా కలిగించేది డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ లేని పక్షంలో జరిగే అనర్థాలు కోకొల్లలు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కీలకం కానుంది. లైసెన్స్ లేని ప్రయాణాలు జరిమానాలు నుంచి జైలు శిక్షల వరకు తీసుకువెళ్తున్నాయి. ప్రమాద బాధ్యుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో బాధితులకు బీమా సౌకర్యం కూడా అందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి పాల్పడిన వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సదరు వ్యక్తిని రికార్డుల నుంచి మార్చి బాధితుడికి బీమా సౌకర్యం అందేలా చేయాలనే ఒత్తిడి అధికారులకు వస్తోన్న సందర్భాలు జిల్లాలో వస్తున్నాయి. వాహన యజమాని నుంచి బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాల్సి వస్తోన్న సందర్భాల్లో సైతం అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఎల్ఎల్ఆర్ మేళా వివరాలివి..ఎల్ఎల్ఆర్ మేళాకు మంచి స్పందన ముంగిట్లో రవాణా శాఖ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎల్ఎల్ఆర్ మేళాకు జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 4,856 మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితులకు బీమా సౌకర్యం అందని పరిస్థితులు వస్తున్నాయి. 18 సంవత్సరాల వయస్సు నుంచి వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. లైసెన్స్ మంజూరు చేసే క్రమంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తాం.– ఎన్.శ్రీనివాస్, తణుకు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ -
విద్యార్హతలేని వారికీ ఆటో డ్రైవింగ్ లైసెన్స్‌లు
- ప్రత్యేక డ్రైవ్‌కు విశేష స్పందన - దళారులను ఆశ్రయించవద్దు.. డీటీసీ సుందరవద్దీ - ఆటో కార్మికుల హర్షం అనంతపురం సెంట్రల్ : విద్యార్హతలేకపోవడంతో డ్రైవింగ్ లైసెన్స్‌నలు పొందలేక ఆటోలు నడుపుతూ అటు పోలీసులు, ఇటు రవాణా అధికారులతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న డ్రైవర్లకు జిల్లా ఆర్టీఏ అధికారులు స్పందించి వారి సమస్యను పరిష్కరించారు. విద్యార్హతలేకపోయిన వారికి వివిధ పరీక్షల నిర్వహించి లైసెన్స్‌లు మంజూరు చేసేందుకు శని, ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీనిపై ఆటో కార్మికుల నుంచి విశేష స్పందన లభించింది. అధికారులే దగ్గర ఉండి దరఖాస్తులు పూరించడంతోపాటు, వారికి వైద్య పరీక్షలు కూడా చేయించారు. అర్హులకు లైసెన్సులను మంజూరు చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో దాదాపు జిల్లా వ్యాప్తంగా 436 మంది ఆటో డ్రైవర్లు ఎల్‌ఎల్‌ఆర్‌లు (లర్నర్స్ లైసెన్స్ రూల్) పొందారు. ఇందులో ఆరుగురు మహిళా డ్రైవర్లు కూడా ఉండడం విశేషం. ఈ సందర్బంగా డీటీసీ సుందర్‌వద్దీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ లెసెన్స్ పొందేందుకు ముఖ్య అడ్డంకిగా మారిన విద్యార్హత, ఫిట్నెస్ సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించి ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ప్రతి ఆటో డ్రైవర్ లెసెన్స్ కలిగి ఉండడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే శని, ఆదివారాల్లో కూడా కొనసాగిస్తామన్నారు. భవిష్యత్‌లో డివిజన్‌స్థాయి ఆర్టీఓ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందినవారు నెలరోజుల తర్వాత నేరుగా వచ్చి పూర్తిస్థాయి డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందవచ్చునని, దళారీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీఏ శ్రీధర్, ఎంవీఐలు రమేష్, మధుసూదన్, కరుణాసాగర్, ఏఎంవీఐలు తిమ్మరసునాయుడు, రవిశంకర్, దీపిక, రాణి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆర్టీఏలో ఎల్ఎల్ఆర్ స్పెషల్‌డ్రైవ్
అనంతపురం సెంట్రల్ : నాన్ ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఎల్ఎల్ఆర్ మంజూరు చేసేందుకు శనివారం స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సుందర్‌వద్దీ తెలిపారు. శుక్రవారం ఆయన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. నాన్ ట్రాన్స్‌పోర్టు ఆటోరిక్షా డ్రైవర్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలకు ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్‌లు కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ప్రత్యేకంగా స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తామని వివరించారు. నెల రోజుల తర్వాత వారికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తామన్నారు. వయసు ధ్రువీకరణ పత్రం, స్కూల్ డిక్లరేషన్ సర్టిఫికెట్ లేకపోయినా వెరిఫికేషన్ చేసి ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.