చలానాలో చిలక్కొట్టుడు..! | Extra Money Collecting in LLR Challans | Sakshi
Sakshi News home page

చలానాలో చిలక్కొట్టుడు..!

Published Fri, Mar 1 2019 8:55 AM | Last Updated on Fri, Mar 1 2019 8:55 AM

Extra Money Collecting in LLR Challans - Sakshi

ఉపరవాణ కమిషనర్‌ కార్యాలయం రమణ ఎల్‌ఎల్‌ఎల్‌ఆర్‌ చలానా

విజయనగరం ఫోర్ట్‌: ‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన శిరికి రమణ అనే వ్యక్తి  ఫిబ్రవరి 24వ తేదీన టూవీలర్‌ లెర్నర్‌ లైసెన్సు (ఎల్‌ఎల్‌ఆర్‌) కోసం అవసరమై చలానా తీసేందుకు ఉడాకాలనీలో ఉన్న ఆన్‌లైన్‌ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఎల్‌ఎల్‌లర్‌ చలానా ఇచ్చి రూ.350 తీసుకున్నారు. చలానాలో రూ.260 ఉంది కదా రూ.350 ఎందుకని అడిగితే సర్వీస్‌ చార్జీగా బదులిచ్చారు. దీంతో చేసేది లేక మిన్నుకుండిపోయారు’.

ఈ సమస్య ఈ ఒక్క వాహనచోదకుడితే కాదు. వేలాదిమందికి ఎదురవుతున్న సమస్య.  ఎల్‌ఎల్‌ఆర్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్సు కోసం చలానా కోసం వెళితే వాహన చోదకుడి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ తంతు జరుగుతున్నా రవాణశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వాహన చోదకులు చేతిచమురు వదిలించుకోవాల్సిన దుస్థితి.

400కు పైగా సీఎస్‌సీ సెంటర్స్‌..
రవాణ శాఖలో ఆన్‌లైన్‌ సేవలను జిల్లాలో ఉన్న సీఎస్‌సీ (కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌)కు అప్పగించారు. రవాణ శాఖకు సంబంధించి పలు సేవలను ఈ సెంటర్స్‌లో పొందవచ్చు. అలాగే, మీ– సేవ కేంద్రాల్లో  రవాణశాఖ సేవలు పొందవచ్చు. అయితే, కొన్ని సీఎస్‌సీ సెంటర్స్, కొన్ని మీ సేవ కేంద్రాల్లో వాహన చోదకుల నుంచి నిర్దేశించిన చలానా కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. చలానా కంటే రూ.50 నుంచి రూ.100 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, కొన్ని చోట్ల అయితే రూ.150 రూ.200 కూడా వసూలు చేస్తున్నట్టు సమాచారం.

వాస్తవంగా చలానాలు ఇలా...
రవాణ శాఖకు ద్విచక్ర వాహనం ఎల్‌ఎల్‌ఆర్‌ చలానా కోసం రూ.260 చెల్లించాలి. అయితే,  దీనికోసం రూ.300 నుంచి రూ.350 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే, నాలుగు చక్రాల వాహనం ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం రూ.410 చెల్లించాలి. దీనికి రూ.450 నుంచి రూ.500, కొన్ని చోట్ల రూ.550 కూడా వసూలు చేస్తున్నారు. అలాగే, టూవీలర్‌ లైసెన్స్‌ కోసం రూ.950 చెల్లించాలి. అయితే, రూ.1000, రూ.1050 తీసుకుంటున్నారు. అలాగే, ఫోర్‌ వీలర్‌ లైసెన్సు కోసం రూ.1260 తీసుకోవాలి. దీనికోసం రూ.1300 నుంచి రూ.1350 వసూలు చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం...
కొన్ని సీఎస్‌సీ సెంటర్స్‌ల్లో చలానా కంటే అధికంగా వసూలు చేసినట్టు మా దష్టికి వచ్చింది. లిఖత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆయా సెంటర్లపై చర్యలు తీసుకుంటాం.– ఎ.దుర్గాప్రసాద్‌రావు, వెహికల్‌ ఇనస్పెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement