రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘనపై ఆర్టీఏ కొరడా | RTA Whipping Up In Violation Of Road Safety Regulations | Sakshi
Sakshi News home page

తస్మాత్‌ జాగ్రత్త!

Published Sat, Jun 29 2019 12:45 PM | Last Updated on Sat, Jun 29 2019 12:45 PM

 RTA Whipping Up In Violation Of Road Safety Regulations - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత నిబంధనల ఉల్లం‘ఘను’లు ఠారెత్తిస్తున్నారు. రహదారులపై ఇష్టారాజ్యంగా పరుగులు తీస్తున్నారు. రహదారి భద్రతపై ఎన్ని కఠినమైన చట్టాలను తెచ్చినప్పటికీ వాహనదారులు పెద్దగా లెక్కచేయడం లేదు. నిబంధనల పట్ల అవగాహనారాహిత్యం, నిర్లక్ష్యం రోడ్డు భద్రతకు పెనుసవాల్‌గా మారింది. గత ఐదేళ్లలో ఇలా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన సుమారు 14 వేల మంది డ్రైవింగ్‌ లైసెన్సులపై రవాణాశాఖ వేటు వేసింది.

3 నెలల కనిష్ట కాలపరిమితి నుంచి ఏడాది గరిష్ట కాలం వరకు డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేసింది. సెల్‌ఫోన్‌డ్రైవింగ్‌ అత్యంత  ప్రమాదకరమని  తెలిసినప్పటికీ చాలామంది నిబంధనలు పక్కన పెట్టేసి ‘సెల్‌’మోహనరంగా అంటూ పరుగులు తీస్తున్నారు. మరోవైపు పరిమితికి మించిన ఓవర్‌లోడింగ్, అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలు  ఎక్కువగా నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో రవాణాశాఖ  ‘ఉల్లంఘనుల’పై సీరియస్‌గా దృష్టి సారించింది.  

ప్రస్తుతం  ఏడాది గరిష్ట కాలానికి  డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దు చేస్తున్నప్పటికీ  భవిష్యత్తులో  శాశ్వతంగా రద్దు చేసే అంశాన్ని కూడా  పరిశీలిస్తున్నట్లు  రవాణాశాఖ సంయుక్త రవాణా కమిషనర్‌ సి.రమేష్‌  తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడేవారిపైన మరింత కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అలాంటి వాహనదారులు తిరిగి డ్రైవింగ్‌ చేయకుండా  నియంత్రించనున్నట్లు  చెప్పారు.  

పరిమితికి మించిన బరువుతో పరుగులు... 
రాత్రి, పగలు తేడా లేకుండా ఓవర్‌లోడ్‌ వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రైవేట్‌ బస్సులు నిబంధనలను తుంగలో తొక్కి  పరిమితికి మించిన ప్రయాణికులతో పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్న సుమారు 1000 ప్రైవేట్‌ బస్సుల్లో 80 శాతం ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నాయి.

కొన్ని బస్సులు పూర్తిగా సరుకు రవాణా వాహనాలుగా మారాయి. మరోవైపు వివిధ జిల్లాల నుంచి ఇసుక, కంకర, ఐరన్‌ వంటి వస్తువులను నగరానికి తరలిస్తున్న వాహనాలు సైతం ఓవర్‌లోడ్‌తో  ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇలా రహదారి భద్రతకు  ముప్పుగా మారిన ఓవర్‌లోడ్‌ వాహనాలు నడుపుతూ పట్టుబడిన 2532 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను ఆర్టీఏ రద్దు చేసింది.

ఓవర్‌లోడ్‌ వాహనాలను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. లైసెన్సులు రద్దు చేయడంతో పాటు ఇలాంటి వాహనాలను సైతం జఫ్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జేటీసీ చెప్పారు. 

డ్రంకెన్‌ డ్రైవర్లు... 
ఓవర్‌లోడింగ్‌తో పట్టుబడి డ్రైవింగ్‌ లైసెన్సులు కోల్పోయిన వారి తరువాత ఈ ఐదేళ్లలో డ్రంకన్‌ డ్రైవింగ్‌లో పట్టుబడి లైసెన్సులు పోగొట్టుకున్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ పోలీసులు నిరంతర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొంత వరకు ఫలితాన్నిచ్చాయి. గత ఐదేళ్లలో డ్రంకన్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడిన వారిలో 2117 మంది లైసెన్సులను రద్దు చేశారు. 2016లో 917 లైసెన్సులు రద్దు కాగా, 2017లో 580, 2018లో 439 చొప్పున లైసెన్సులు రద్దయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 123 లైసెన్సులను రద్దు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు భవిష్యత్తులో మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని  పేర్కొన్నారు.  

యధేచ్ఛగా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌... 
సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ సైతం హడలెత్తిస్తోంది. ఒకవైపు ఫోన్‌లో మాట్లాడుతూనే మరోవైపు వాహనాలను నడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వాహనాల వల్లనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, చివరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ రోడ్డు భద్రతకు సవాల్‌గా మారారు.

ఇప్పటి వరకు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడిన 720 మంది వాహనదారుల లైసెన్సులను ఆర్టీఏ రద్దు చేసింది. అలాగే పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 87 మంది లైసెన్సులపైన సస్సెన్షన్‌ విధించింది. ఇక రాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ  ప్రమాదాలకు పాల్పడిన 1661 మంది సైతం తమ లైసెన్సులను కోల్పోయారు. 

వివిధ రకాల ఉల్లంఘనలపై ఇప్పటి వరకు రద్దయిన డ్రైవింగ్‌ లైసెన్సులు 

ఓవర్‌లోడింగ్‌ 2532 
ఓవర్‌స్పీడ్‌ 87 
ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడిన గూడ్స్‌ వాహనాలు 633 
సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ 720 
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారు 2117 
ప్రమాదాలకు పాల్పడిన వారు 1661 
కోర్టు తీర్పులతో  లైసెన్సులు కోల్పోయిన వారు 908
ఇతర కేసులు 5313 
వివిధ రకాల ఉల్లంఘనలపై  గత 5 ఏళ్లలో సస్పెండ్‌ అయిన మొత్తం డ్రైవింగ్‌ లైసెన్సులు 13971  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement