over speeding
-
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్ జారీ
పట్నా: కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్ జారీ అయింది. మితిమీరిన వేగంతో ఆయన కారు వెళ్లినందుకు బీహార్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టం చలాన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి పాశ్వాన్ నేషనల్ హైవేపై హాజీపూర్ నుంచి చంపారన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.మరోవైపు.. బిహార్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్, ట్రాఫిక్ పోలీసులు ఇప్పటివరకు కొత్త ఈ డిటెక్షన్ సిస్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగఘించిన 16,700 మందికి ఈ-చలాన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ చలాన్ల విలువ సుమారుగా రూ. 9.49కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ డిటెక్షన్ సిస్టంను మోటార్ వాహన చట్టం కింద రాష్ట్రంలోని 13 టోల్ ప్లాజాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ-డిటెక్షన్ సిస్టం వాహనాలను చెక్ చేస్తూ.. సరైన పత్రాలు లేనట్లైతే ఆటోమేటిక్‌గా చలాన్ జారీ అవుతుందని అధికారులు పేర్కొన్నారు. -
రెండ్రోజుల క్రితం విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ బీభత్సం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
-
అధిక వేగంతో టిప్పర్ బీభత్సం
-
మల్లేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
గోకవరం/గండేపల్లి: అతివేగం, నిర్లక్ష్యం నాలుగు నిండుప్రాణాలను బలితీసుకున్నది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారు జీడి పిక్కల ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాత పడగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం, ఉండ్రాజవరం, ఏలూరు జిల్లా ఉంగుటూరు తదితర గ్రామాల నుంచి సుమారు 13 మంది అనకాపల్లి జిల్లా కశింకోటలో పరమటమ్మతల్లి జాతరలో ప్రదర్శన ఇచ్చేందుకు టాటా మేజిక్ వాహనంలో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు గండేపల్లి మండలం మల్లేపల్లి వచ్చే సరికి హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ ట్రాలీని అతి వేగంతో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన దుబ్బాకుల ప్రసాద్ (47) అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లజర్లకు చెందిన డ్రైవర్ నల్లకాసుల వెంకట్రావు (కొండ) (28), నల్లజర్ల మండలం నబీపట గ్రామానికి చెందిన పెనుపాక గుబ్బల మంగమ్మ (30) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా, ఉండ్రాజవరం మండలం చివటంకు చెందిన గారపాటి మహేష్ (20), రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని బుధవారం పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్ పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ వాహనం డ్రైవర్ అతివేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందన్నారు. కాగా, టాటా మేజిక్ వాహనం ట్రాలీని ఢీకొట్టి డ్రైవర్‌తో సహా ఇరుక్కుపోగా.. సుమారు అరగంట పాటు శ్రమించి బయటకు తీశారు. టాటా మేజిక్ డ్రైవర్ కుడికాలు దాదాపు తెగిపోయింది. క్షతగాత్రులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ప్రాణాలు తీస్తున్న అతివేగం
సాక్షి, అమరావతి: దేశంలో జాతీయ రహదారులపై అతివేగమే (ఓవర్ స్పీడ్) అత్యధిక రోడ్డు ప్రమాదాలకు, మరణాలకు కారణమని తేలింది. ఆ తరువాత తప్పుడు మార్గంలో డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి. 2019, 2020 సంవత్సరాల్లో ఈ రెండు కారణాల వల్లే అత్యధిక రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వం 2020లో రోడ్డు ప్రమాదాలపై విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అతివేగం కారణంగా దేశంలో జాతీయ రహదారులపై 74 శాతం ప్రమాదాలు జరుగుతుండగా.. 69 శాతానికిపైగా మరణాలు నమోదవుతున్నట్లు తెలిపింది. డ్రగ్స్, మద్యం తీసుకుని డ్రైవింగ్ చేయడం కారణంగా 33.3 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల 26.3 శాతం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నట్లు వివరించింది. రెడ్‌లైట్ సిగ్నల్స్ జంపింగ్ చేయడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాల్లో కొందరు మరణిస్తున్నట్లు తెలిపింది. 2019తో పోలిస్తే 2020లో ఈ ప్రమాదాలు, మరణాలు కూడా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. -
మొన్ననే ప్రారంభం.. అంతలోనే ప్రమాదాలు
సిమ్లా: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రపంచంలోనే పొడవైన అటల్ రోహ్తంగ్ టన్నెల్ ప్రమాదాలకు నెలవుగా మారింది. సేవలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే ఆ రహదారిపై మూడు వాహన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పర్యాటకులు వేగంగా వాహనాలు తోలడం, కొందరు యువకులు బైకులపై రేసింగులు చేయడంతో ఈ ప్రమాదాలు జరిగినట్టు బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) తెలిపింది. ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించింది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ రన్నింగ్‌లోనే కొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారని బీఆర్ఓ చీఫ్ ఇంజనీర్ బ్రిగేడియర్ కేపీ.పురుషోత్తం ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: డాక్టర్ అందమైన జ్ఞాపకం.. రాక్చమ్ కుగ్రామం) అంతేకాకాండా టన్నెల్ మధ్యలో ఎవరూ వాహనాలు నిలుపొద్దని సూచించారు. టన్నెల్ లోపల సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన ట్రాఫిక్ అధికారులను కోరారు. ఈ విషయంపై కులు ఎస్పీ గౌరవ్ సింగ్ మాట్లాడుతూ.. టన్నెల్ లోపల రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే టన్నెల్ లోపల సీడ్ గన్స్ ఆధారంగా అతివేగంగా వెళ్లిన వారికి నోటీసులు జారీ చేస్తామని అన్నారు. టన్నెల్ లోపల గంటకు 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా టన్నెల్ లోపల రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ రామ్‌లాల్ మర్కంద స్థానిక అధికారులను ఆదేశించారు. ఇదిలాఉండగా.. అటల్ రోహ్తంగ్ టన్నెల్ ద్వారా పేలుడు పదార్థాల రవాణాను బీఆర్ఓ నిషేధించింది. వచ్చే రెండు నెలలపాటు డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, కిరోసిన్‌పై తాత్కాలిక నిషేధం విధించినట్టు వెల్లడించింది. దాంతోపాటు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 10, సాయంత్రం 4 నుంచి 5 వరకు.. మొత్తం రెండు గంటలపాటు మెయింటెన్స్ నిమిత్తం టన్నెల్ మూసి ఉంటుందని తెలిపింది. కాగా, హరియాణాలోని 9.02 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్‌ను ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించారు. (చదవండి: బాధ్యతగా కృత్రిమ మేధ వినియోగం: మోదీ) -
కేసీఆర్ వాహనానికి ట్రాఫిక్ చలానా!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కాన్వాయ్‌లోని వాహనానికి ట్రాఫిక్ చలానా పడింది. హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేట పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఫైన్ తప్పలేదు. అతివేగంగా నాలుగుసార్లు వెళ్లడంతో చలానా విధించినట్టు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. దీంతో చలానా మొత్తం రూ.4,140 ను సీఎంవో అధికారులు బుధవారం చెల్లించారు. (చదవండి: హైదరాబాద్: సిటీ బస్సులకూ ఇక రైట్ రైట్!) -
డ్రైవింగ్ సీట్లో కుక్క..160 కి.మీ వేగంతో కారు!
వాషింగ్టన్: ప్రపంచంతో పాటు అమెరికాను వణికిస్తున్న కరోనా వైరస్ వార్తల్ని పక్కనబెడితే.. అమెరికా పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి చేసిన పనికి పోలీసులు నిశ్చేష్టులయ్యారు. 51 ఏళ్ల ఆల్బర్ట్ టిట్లో అనే వ్యక్తి కుక్కను డ్రైవింగ్ సీట్లో పెట్టి.. తాను ప్యాసెంజర్ సీట్లో కూర్చుని కారును ఏకంగా గంటకు 160 కి.మీ వేగంతో తోలాడు. దీంతో ఎమర్జెన్సీ కాల్ సెంటర్‌కు కొందరు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటన దక్షిణ సీటెల్‌లో గత ఆదివారం చోటుచేసుకుంది. (చదవండి: కరోనాకు 35,349 మంది బలి) ‘పదేళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. అధిక వేగంతో బండి నడిపి.. వారు చెప్పే సాకులు తెలుసు. కానీ, ఇతగాడు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను. ఎందుకంత వేగంగా కారు నడిపావ్ అని ప్రశ్నిస్తే.. కుక్కకు డ్రైవింగ్ నేర్పిస్తున్నా! అని చెప్పడంతో దిమ్మ తిరిగిపోయింది. ఇలాంటి వాళ్లను అస్సలు క్షమించకూడదు. అంత ఎత్తున్న ఆ శునకాన్ని షెల్టర్‌లో పెట్టాం. నిందితుడిపై డ్రగ్స్, మోటార్ వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశాం’అని పోలీస్ అధికారి హెథర్ ఆక్స్ట్మాన్ చెప్పుకొచ్చారు. కాగా, అమెరికా కరోనా క్రోధానికి బలవుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీలతో కలిపి దేశం మొత్తంమ్మీద 1.45 లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా.. 2,606 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,574 మంది కోలుకున్నారు. (చదవండి: కరోనా: గుడ్‌న్యూస్ చెప్పిన జర్నలిస్టు) -
రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘనపై ఆర్టీఏ కొరడా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత నిబంధనల ఉల్లం‘ఘను’లు ఠారెత్తిస్తున్నారు. రహదారులపై ఇష్టారాజ్యంగా పరుగులు తీస్తున్నారు. రహదారి భద్రతపై ఎన్ని కఠినమైన చట్టాలను తెచ్చినప్పటికీ వాహనదారులు పెద్దగా లెక్కచేయడం లేదు. నిబంధనల పట్ల అవగాహనారాహిత్యం, నిర్లక్ష్యం రోడ్డు భద్రతకు పెనుసవాల్‌గా మారింది. గత ఐదేళ్లలో ఇలా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన సుమారు 14 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులపై రవాణాశాఖ వేటు వేసింది. 3 నెలల కనిష్ట కాలపరిమితి నుంచి ఏడాది గరిష్ట కాలం వరకు డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. సెల్‌ఫోన్‌డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని తెలిసినప్పటికీ చాలామంది నిబంధనలు పక్కన పెట్టేసి ‘సెల్’మోహనరంగా అంటూ పరుగులు తీస్తున్నారు. మరోవైపు పరిమితికి మించిన ఓవర్లోడింగ్, అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలు ఎక్కువగా నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో రవాణాశాఖ ‘ఉల్లంఘనుల’పై సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రస్తుతం ఏడాది గరిష్ట కాలానికి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో శాశ్వతంగా రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు రవాణాశాఖ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడేవారిపైన మరింత కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అలాంటి వాహనదారులు తిరిగి డ్రైవింగ్ చేయకుండా నియంత్రించనున్నట్లు చెప్పారు. పరిమితికి మించిన బరువుతో పరుగులు... రాత్రి, పగలు తేడా లేకుండా ఓవర్‌లోడ్ వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రైవేట్ బస్సులు నిబంధనలను తుంగలో తొక్కి పరిమితికి మించిన ప్రయాణికులతో పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్న సుమారు 1000 ప్రైవేట్ బస్సుల్లో 80 శాతం ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని బస్సులు పూర్తిగా సరుకు రవాణా వాహనాలుగా మారాయి. మరోవైపు వివిధ జిల్లాల నుంచి ఇసుక, కంకర, ఐరన్ వంటి వస్తువులను నగరానికి తరలిస్తున్న వాహనాలు సైతం ఓవర్‌లోడ్‌తో ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇలా రహదారి భద్రతకు ముప్పుగా మారిన ఓవర్‌లోడ్ వాహనాలు నడుపుతూ పట్టుబడిన 2532 మంది డ్రైవింగ్ లైసెన్సులను ఆర్టీఏ రద్దు చేసింది. ఓవర్‌లోడ్ వాహనాలను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. లైసెన్సులు రద్దు చేయడంతో పాటు ఇలాంటి వాహనాలను సైతం జఫ్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జేటీసీ చెప్పారు. డ్రంకెన్ డ్రైవర్లు... ఓవర్‌లోడింగ్‌తో పట్టుబడి డ్రైవింగ్ లైసెన్సులు కోల్పోయిన వారి తరువాత ఈ ఐదేళ్లలో డ్రంకన్ డ్రైవింగ్‌లో పట్టుబడి లైసెన్సులు పోగొట్టుకున్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ పోలీసులు నిరంతర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొంత వరకు ఫలితాన్నిచ్చాయి. గత ఐదేళ్లలో డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో 2117 మంది లైసెన్సులను రద్దు చేశారు. 2016లో 917 లైసెన్సులు రద్దు కాగా, 2017లో 580, 2018లో 439 చొప్పున లైసెన్సులు రద్దయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 123 లైసెన్సులను రద్దు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు భవిష్యత్తులో మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. యధేచ్ఛగా సెల్‌ఫోన్ డ్రైవింగ్... సెల్‌ఫోన్ డ్రైవింగ్ సైతం హడలెత్తిస్తోంది. ఒకవైపు ఫోన్లో మాట్లాడుతూనే మరోవైపు వాహనాలను నడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వాహనాల వల్లనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, చివరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు భద్రతకు సవాల్‌గా మారారు. ఇప్పటి వరకు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 720 మంది వాహనదారుల లైసెన్సులను ఆర్టీఏ రద్దు చేసింది. అలాగే పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 87 మంది లైసెన్సులపైన సస్సెన్షన్ విధించింది. ఇక రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు పాల్పడిన 1661 మంది సైతం తమ లైసెన్సులను కోల్పోయారు. వివిధ రకాల ఉల్లంఘనలపై ఇప్పటి వరకు రద్దయిన డ్రైవింగ్ లైసెన్సులు ఓవర్లోడింగ్ 2532 ఓవర్‌స్పీడ్ 87 ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడిన గూడ్స్ వాహనాలు 633 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 720 మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారు 2117 ప్రమాదాలకు పాల్పడిన వారు 1661 కోర్టు తీర్పులతో లైసెన్సులు కోల్పోయిన వారు 908 ఇతర కేసులు 5313 వివిధ రకాల ఉల్లంఘనలపై గత 5 ఏళ్లలో సస్పెండ్ అయిన మొత్తం డ్రైవింగ్ లైసెన్సులు 13971 -
స్పీడ్ థ్రిల్స్ బట్...!
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్... మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్... ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్.. తాజాగా నందమూరి హరికృష్ణ... రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వీరిలో ఎవరికీ వాహనం నడపాల్సిన అవసరం లేదు. అయినా ప్యాషన్ కోసం స్టీరింగ్ పట్టి, మితిమీరిన వేగంతో దూసుకుపోతూ హఠాన్మరణం పాలయ్యారు. కేవలం ఇవే కాదు రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం శాతం అతి వేగం కారణంగానే జరుగుతున్నాయి. అంతర్గత రహదారులు గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో, జాతీయ రహదారులు గరిష్టంగా గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువని రవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. నగరంలోని రోడ్ల సామర్థ్యం, వాటి పైకి వస్తున్న వాహనాల గరిష్ట వేగానికి మధ్య పొంతన లేకపోవడం గమనార్హం. పరిమిత వేగం పాదచారులకూ రక్షణే... ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బాధితులుగా మారుతున్నది పాదచారులే. ఫుట్‌పాత్‌లు, క్రాసింగ్స్ సహా ఎలాంటి సౌకర్యాలు అవసరమైన స్థాయిలో ఉండవు. ఫలితంగా రోడ్డు దాటుతున్న, రహదారులపై నడుస్తున్న బాటసారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం వాహన వేగం 5 శాతం తగ్గినప్పుడు ప్రమాదాలబారిపడే ఆస్కారం 30 శాతం తగ్గుతుందని స్పష్టం చేసింది. గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణించే వాహనం ఓ పాదచారుడిని ఢీ కొట్టినా... అతడికి మరణం సంభవించే ప్రమాదం 30 శాతం తక్కువగా ఉంటుంది. వాహన వేగం గంటకు 80 కిమీ మించితే ఎదుటి వ్యక్తికి మరణం సంభవించే అవకాశం 60 శాతం పెరిగినట్లేనని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. రెస్పాన్స్ కావడానికి కొంత సమయం... ప్రతి వాహనచోదకుడు వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో యాదృచ్ఛికంగానే ముందు వస్తున్న ప్రమాదాలను గమనిస్తూనే ఉంటాడు. ఎదుటి వాహనం, గుంత... ఇలాంటి ఏవైనా ముప్పులు కనిపించినప్పుడు వెంటనే స్పందించి బ్రేక్ వేయడానికో, పక్కను తప్పించుకోవడానికో ప్రయత్నిస్తాడు. ఇలా ముప్పును గుర్తించిన తర్వాత, బ్రేక్ వేయడం వంటి స్పందనకు మధ్య కొంత సమయం పడుతుంది. దీనినే సాంకేతికంగా రెస్పాన్స్ టైమ్ అంటారు. ఎదుట ఉన్న ముప్పును మెదడు గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడానికి పట్టే సమయమిది. ఈ మధ్య కాలంలో వాహనం కొంత మేర ముందుకు ప్రయాణించేస్తుంది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత దూరంలోనే ముప్పును గుర్తించి, అవసరమైన ముందే బ్రేక్ వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
రహదారిపై రాడార్ కళ్లు
నగరంలోని 70 ప్రాంతాల్లో స్పీడ్ డిటెక్టర్లు సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ విభాగం నిపుణులు రోడ్డు ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రమాదం కలిగించేవి, ఎదుటి వారికి ప్రమాదం కలిగించేవి, ఇరువురుకీ ప్రమాదం కలిగించేవి. కీలకమైన మూడో కేటగిరీలోకి వచ్చే ఓవర్ స్పీడింగ్‌పై నగర ట్రాఫిక్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరికి చెక్ చెప్పడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్పీడ్ లేజర్ కెమెరాలకు తోడు రాడార్ స్పీడ్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి పనితీరుకు సంబంధించి జర్మనీకి చెందిన ఓ సంస్థ సోమవారం నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డితో పాటు ట్రాఫిక్ చీఫ్ డాక్టర్ వి.రవీందర్‌కు ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ రెంటికీ సంబంధం లేదు... రాజధానిలో వాహనాల సరాసరి వేగం గంటకు 18 కి.మీ. మించట్లేదు. రహదారులు దుస్థితి, నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్ పనులు, ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్న కొత్త వాహనాలు సహా మరెన్నో దీనికి కారణమవుతున్నాయి. వాస్తవానికి రాజధాని రోడ్లు గంటకు గరిష్టంగా 50 కి.మీ. వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసినవి. అయితే నగర రోడ్లపై తిరుగుతున్న వాహనాల గరిష్ట వేగం గంటకు 200 కి.మీ. వరకు ఉంటోంది. రహదారుల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం మధ్య పొంతన లేకపోయినప్పటికీ వీటిని నియంత్రించే ప్రత్యేక చట్టం, నియమనిబంధనలు ఏవీ లేవని అధికారులు చెబుతున్నారు. } రాత్రి వేళల్లో ఎక్కువ వేగంతో... ఇన్నర్ రింగ్‌రోడ్ వంటి కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే... వాహనాల రద్దీ, ట్రాఫిక్ పోలీసుల నిఘా, సిగ్నల్స్ తదితర కారణాల నేపథ్యంలో పగటి పూట మితిమీరిన వేగానికి ఆస్కారం లేదు. అయితే రాత్రి వేళల్లో దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో వాహనాలు అమిత వేగంతో ప్రయాణిస్తున్నాయి. రేసింగ్స్ వంటివీ జరుగుతున్నాయి. గత నెలలో చోటు చేసుకున్న నిషిత్ నారాయణ ప్రమాదం, గత సోమవారం తెల్లవారుజాము నాటి చింతలకుంట ప్రమాదం రాత్రి పూట జరిగినవే కావడం గమనార్హం. నగరంలో ఏటా జరుతున్న ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాల వల్ల ఎక్కువగా జరుగుతున్నాయని, మృత్యువాతపడుతున్న వారిలో యువత అధికంగా ఉన్నారని తేలింది. యువకులు రేసింగ్స్, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. దీన్ని గుర్తించిన నగర ట్రాఫిక్ విభాగం ఐదు స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది. కాగా, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వేపై తేలికపాటి వాహనాలు గరిష్టంగా గంటకు 80 కి.మీ., మధ్యతరహా వాహనాలు 65 కి.మీ. మించి పోకూడదు. రాత్రిపూటా రాడార్ నిఘా... ప్రసుత్తం అందుబాటులో ఉన్న లేజర్ గన్స్ పగలు మాత్రమే వినియోగించడానికి అనుకూలం. ఈ నేపథ్యంలోనే ఓవర్ స్పీడింగ్‌కు పగలు.. రాత్రి తేడా లేకుండా బ్రేక్‌లు వేయడానికి రహదారుల్లో రాడార్ ఉపకరణాలను అమరుస్తున్నారు. మొత్తం 70 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు తొలి దశలో రేసింగ్స్, ఓవర్ స్పీడింగ్ ఎక్కువగా జరిగే కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల నెలకొల్పనున్నారు. రాడార్ పరిజ్ఞానంతో పని చేసే, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీ–సీసీసీ)తో అనుసంధానించే ఈ ఉపకరణాలు మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాల ఫొటోలను సెకనుకు మూడు తీస్తాయి. వీటి ఆధారంగా అధికారులు ఈ–చలాన్లు జారీ చేస్తారు. 50 కి.మీ. రాజధాని రోడ్లు ఎంత వేగంగా వెళ్ళడానికి తగ్గట్లు డిజైన్ చేశారు 200 కి.మీ. రాజధాని నగర రోడ్లపై తిరుగుతున్న వాహనాల గరిష్ట వేగం -
ప్రాణాలు తీసిన అతి వేగం
నెల్లూరురూరల్ : వాహనచోదకుల అతివేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. బైక్‌పై అతివేంగా వెళ్తూ కారు ఢీకొని ఓ యువకుడు, ముందు వెళ్తున్న వాహనాన్ని అదిగమించబోయి బైకిస్ట్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనలు మండలంలోని వేర్వేర్లు చోట్ల జరిగాయి. నెల్లూరురూరల్ పోలీసుల కథనం మేరకు.. రాపూరు మండలం చిట్టుపాళెంకు చెందిన పులిబోయిన శివ(23) రాపూరు నుంచి నెల్లూరువైపు బైక్‌పై బయలుదేరాడు. ఆమంచర్ల వద్దకు వచ్చే సరికి ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొన్నాడు.. దీంతో తీవ్రంగా గాయపడిన శివను 108 వాహనంలో పెద్దాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. 4వ మైలుకు చెందిన కాటంరెడ్డి రవీంద్రరెడ్డి (40) బైక్‌పై ఆదివారం నెల్లూరు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో నెల్లూరు నుంచి కొత్తకాలువ మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రవీంద్రరెడ్డిని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాసుపత్రికి తరలించారు. ఈ మేరకు రెండు ప్రమాదాల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.