
సాక్షి, అమరావతి: దేశంలో జాతీయ రహదారులపై అతివేగమే (ఓవర్ స్పీడ్) అత్యధిక రోడ్డు ప్రమాదాలకు, మరణాలకు కారణమని తేలింది. ఆ తరువాత తప్పుడు మార్గంలో డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి. 2019, 2020 సంవత్సరాల్లో ఈ రెండు కారణాల వల్లే అత్యధిక రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వం 2020లో రోడ్డు ప్రమాదాలపై విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
అతివేగం కారణంగా దేశంలో జాతీయ రహదారులపై 74 శాతం ప్రమాదాలు జరుగుతుండగా.. 69 శాతానికిపైగా మరణాలు నమోదవుతున్నట్లు తెలిపింది. డ్రగ్స్, మద్యం తీసుకుని డ్రైవింగ్ చేయడం కారణంగా 33.3 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల 26.3 శాతం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నట్లు వివరించింది. రెడ్‌లైట్ సిగ్నల్స్ జంపింగ్ చేయడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాల్లో కొందరు మరణిస్తున్నట్లు తెలిపింది. 2019తో పోలిస్తే 2020లో ఈ ప్రమాదాలు, మరణాలు కూడా తగ్గినట్లు నివేదిక పేర్కొంది.