రహదారిపై రాడార్ కళ్లు
నగరంలోని 70 ప్రాంతాల్లో స్పీడ్ డిటెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ విభాగం నిపుణులు రోడ్డు ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ప్రమాదం కలిగించేవి, ఎదుటి వారికి ప్రమాదం కలిగించేవి, ఇరువురుకీ ప్రమాదం కలిగించేవి. కీలకమైన మూడో కేటగిరీలోకి వచ్చే ఓవర్ స్పీడింగ్‌పై నగర ట్రాఫిక్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. వీరికి చెక్ చెప్పడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్పీడ్ లేజర్ కెమెరాలకు తోడు రాడార్ స్పీడ్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి పనితీరుకు సంబంధించి జర్మనీకి చెందిన ఓ సంస్థ సోమవారం నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డితో పాటు ట్రాఫిక్ చీఫ్ డాక్టర్ వి.రవీందర్‌కు ప్రజెంటేషన్ ఇచ్చింది.
ఆ రెంటికీ సంబంధం లేదు...
రాజధానిలో వాహనాల సరాసరి వేగం గంటకు 18 కి.మీ. మించట్లేదు. రహదారులు దుస్థితి, నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్ పనులు, ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్న కొత్త వాహనాలు సహా మరెన్నో దీనికి కారణమవుతున్నాయి. వాస్తవానికి రాజధాని రోడ్లు గంటకు గరిష్టంగా 50 కి.మీ. వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసినవి. అయితే నగర రోడ్లపై తిరుగుతున్న వాహనాల గరిష్ట వేగం గంటకు 200 కి.మీ. వరకు ఉంటోంది. రహదారుల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం మధ్య పొంతన లేకపోయినప్పటికీ వీటిని నియంత్రించే ప్రత్యేక చట్టం, నియమనిబంధనలు ఏవీ లేవని అధికారులు చెబుతున్నారు. }
రాత్రి వేళల్లో ఎక్కువ వేగంతో...
ఇన్నర్ రింగ్‌రోడ్ వంటి కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే... వాహనాల రద్దీ, ట్రాఫిక్ పోలీసుల నిఘా, సిగ్నల్స్ తదితర కారణాల నేపథ్యంలో పగటి పూట మితిమీరిన వేగానికి ఆస్కారం లేదు. అయితే రాత్రి వేళల్లో దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో వాహనాలు అమిత వేగంతో ప్రయాణిస్తున్నాయి. రేసింగ్స్ వంటివీ జరుగుతున్నాయి. గత నెలలో చోటు చేసుకున్న నిషిత్ నారాయణ ప్రమాదం, గత సోమవారం తెల్లవారుజాము నాటి చింతలకుంట ప్రమాదం రాత్రి పూట జరిగినవే కావడం గమనార్హం. నగరంలో ఏటా జరుతున్న ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాల వల్ల ఎక్కువగా జరుగుతున్నాయని, మృత్యువాతపడుతున్న వారిలో యువత అధికంగా ఉన్నారని తేలింది. యువకులు రేసింగ్స్, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. దీన్ని గుర్తించిన నగర ట్రాఫిక్ విభాగం ఐదు స్పీడ్ లేజర్ గన్స్ ద్వారా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది. కాగా, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వేపై తేలికపాటి వాహనాలు గరిష్టంగా గంటకు 80 కి.మీ., మధ్యతరహా వాహనాలు 65 కి.మీ. మించి పోకూడదు.
రాత్రిపూటా రాడార్ నిఘా...
ప్రసుత్తం అందుబాటులో ఉన్న లేజర్ గన్స్ పగలు మాత్రమే వినియోగించడానికి అనుకూలం. ఈ నేపథ్యంలోనే ఓవర్ స్పీడింగ్‌కు పగలు.. రాత్రి తేడా లేకుండా బ్రేక్‌లు వేయడానికి రహదారుల్లో రాడార్ ఉపకరణాలను అమరుస్తున్నారు. మొత్తం 70 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు తొలి దశలో రేసింగ్స్, ఓవర్ స్పీడింగ్ ఎక్కువగా జరిగే కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల నెలకొల్పనున్నారు. రాడార్ పరిజ్ఞానంతో పని చేసే, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీ–సీసీసీ)తో అనుసంధానించే ఈ ఉపకరణాలు మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాల ఫొటోలను సెకనుకు మూడు తీస్తాయి. వీటి ఆధారంగా అధికారులు ఈ–చలాన్లు జారీ చేస్తారు.
50 కి.మీ.
రాజధాని రోడ్లు ఎంత వేగంగా వెళ్ళడానికి తగ్గట్లు డిజైన్ చేశారు
200 కి.మీ.
రాజధాని నగర రోడ్లపై తిరుగుతున్న వాహనాల గరిష్ట వేగం