మహబూబ్‌నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి జిల్లా పోలీస్ శాఖ డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. జనవరి నుంచి సెప్టెంబర్ 9 వరకు జిల్లాలోని 17 పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 4,809 కేసులు నమోదు చేయగా.. ఇందులో 2,922 మందికి రూ.46.62 లక్షల జరిమానా విధించగా మరో 55 మందికి జైలుశిక్ష విధించారు.
ఇటీవల హౌజింగ్‌బోర్డుకు చెందిన రాములు అనే వాహనదారుడికి అత్యధికంగా 16 రోజుల సాధారణ జైలుశిక్ష పడింది. 2021లో 3,057 కేసులు నమోదు చేయగా 3,045 కేసులకు సంబంధించి రూ.38,00,700 జరిమానా విధించగా 12 మందికి జైలుశిక్ష పడింది. అలాగే 2022లో 4,628 కేసులు నమోదు చేసి రూ.36 లక్షల జరిమానా వసూలు చేశారు. ఈ ఏడాది ఇంకా ఐదు నెలలు ఉండగా.. మరో 3 వేల కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
కేసు నమోదు..
బ్రీత్ ఎనలైజర్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌ను పసిగట్టే సెన్సార్ ఉంటుంది. ఇందులో కొన్ని రసాయన పదార్థాలను నిక్షిప్తం చేస్తారు. మద్యం తాగిన వ్యక్తి పరికరంలోకి గాలి ఊదినప్పుడు అతని శ్వాసలో కరిగి ఉన్న ఇథైల్ ఆల్కహాల్ సెన్సార్‌ను చేరుతుంది. ఇది శ్వాసలో ఇథనాల్ ఎంతశాతం ఉందో నమోదు చేస్తోంది. 0–30మిల్లీ గ్రాములు నమోదు సాధారణంగా చెబుతారు. 30 మి.గ్రా ఆపైన నమోదైతే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తారు.
ఇలా రెండుసార్లు వాహనం నడుపుతూ దొరికితే లైసెన్స్ రద్దు చేస్తారు. 100 మి.గ్రా., పైగా నమోదైతే జైలుకు పంపుతారు. పోలీస్ నిబంధనల ప్రకారం ఒక యూనిట్ లేదా 100 మి.లీ., రక్తంలో 0.03 శాతం లేదా 30 మి.గ్రా., మించి ఆల్కహాల్ ఉంటే మోటారు వాహనచట్టం 185 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తాగిన మోతాదును బట్టి రూ.2 వేలు జరిమానా, వారం నుంచి పదిరోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని పునరావృతం చేస్తే ఎక్కువ రోజుల జైలుశిక్షతోపాటు రూ.3–5 వేల వరకు జరిమానా విధించవచ్చు.
పాయింట్ల కేటాయింపు..
రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానాలు విధించి.. వారికి జీఓ 26 ప్రకారం పాయింట్లు ఇస్తోంది. 24 నెలల్లో 12 పాయింట్లు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దు చేస్తారు. ఏడాదిలో లైసెన్స్ పునరుద్ధరించాక మళ్లీ 12 పాయింట్లు సాధిస్తే రెండేళ్లపాటు తర్వాత మళ్లీ ఇలాగే చేస్తే మూడేళ్లపాటు రద్దు చేస్తారు.
ద్విచక్ర వాహనదారుడు మద్యం తాగితే 4 పాయింట్లు, నాలుగు చక్రాల వాహనదారుడు మద్యం తాగితే 4 పాయింట్లు, బస్సు, క్యాబ్ వాహనదారుడు మద్యం తాగితే 5 పాయింట్లు, ఆటోడ్రైవర్ తన పక్కన ప్రయాణికుడిని కూర్చొబెట్టుకోవడం, హెల్మెట్ లేకుంటే, సీటు బెల్టు పెట్టకుంటే ఒక పాయింట్ వేస్తారు.
కఠిన చర్యలు తప్పవు..
డ్రంకెన్ డ్రైవ్‌లో రెండోసారి పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. మొదట వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఆ తర్వాతే కోర్టులో హాజరుపరుస్తున్నాం. ప్రస్తుతం డ్రైంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని ట్యాబ్‌లో ఫొటో తీస్తున్నాం. వారు బార్‌లో తాగారా.. శివారు ప్రాంతాల్లో తాగారా.. ఇలా ప్రతీది నమోదు చేస్తున్నాం. ఒక్కసారి పట్టుబడిన వ్యక్తి మరోసారి పట్టుబడితే సులభంగా తెలిసిపోతుంది. జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపడుతున్నాం. – మహేష్, డీఎస్పీ, మహబూబ్‌నగర్
వినూత్నంగా శిక్షలు..
మొదట్లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువ మోతాదులో తాగి దొరికిన వారికి జరిమానాతోపాటు కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెట్టేవాళ్లు. ప్రస్తుతం చట్టాలకు మరింత పదును పెట్టారు. మోతాదుకు మించి అతిగా తాగిన వారికి 1 నుంచి 7 రోజుల జైలుశిక్ష విధిస్తున్నారు. మళ్లీ మళ్లీ డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వారికి గరిష్టంగా 30 రోజుల వరకు జైలుశిక్ష విధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment