జడ్చర్ల టౌన్: కట్టుకున్న భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన భర్త కత్తితో పొడిచి ఆమెను హతమార్చడంతో పాటు.. ఆమె ప్రియుడి గొంతు కోశాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూత్పూర్ మండలం భట్టుపల్లికి చెందిన శేఖర్‌గౌడ్‌కు అదే మండలం మొల్గరకు చెందిన అనూషతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.
వారికి ఇద్దరు మగ సంతానం ఉన్నారు. బతుకుదెరువు నిమిత్తం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాలనీ సమీపంలో అనూష లేడీస్ టైలర్ నిర్వహిస్తోంది. శేఖర్ జడ్చర్లలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. శేఖర్‌కు సోదరుడి వరుస అయ్యే భట్టుపల్లికి చెందిన ప్రదీప్‌గౌడ్ భూత్పూర్‌లో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వరసకు మరిది అయ్యే ప్రదీప్‌గౌడ్‌తో అనూషకు సన్నిహితం ఏర్పడి వివాహేతర సంబంధం కొనసాగింది.
కాగా.. టైలర్ షాపునకు పక్కన కూతురితో ఉంటున్న ఒంటరి మహిళతో అనూష స్నేహం చేసింది. తరుచూ ఆ మహిళ ఇంట్లోని వాష్‌రూం (మరుగుదొడ్డి)ని వినియోగించుకుంటుంది. ఇదే క్రమంలో బుధవారం సదరు ఒంటరి మహిళ ఓ పని నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా.. అనూష తన ప్రియుడు ప్రదీప్‌గౌడ్‌కు ఫోన్ చేసి అక్కడికి పిలుపించుకుంది.
ఒంటరి మహిళ కుమార్తెను టైలర్ షాపులో కూర్చొబెట్టి.. ప్రియుడితో కలిసి వారి ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో టైలరింగ్ దుకాణం వద్దకు చేరుకున్న శేఖర్‌గౌడ్ అక్కడ తన భార్య కనిపించకపోవడంతో అక్కడే ఉన్న బాలికను ప్రశ్నించాడు. తమ ఇంట్లో ఉన్న వాష్‌రూంకు వెళ్లిందని బాలిక చెప్పడంతో భర్త అక్కడికి వెళ్లాడు. ఈ సమయంలో అనూష, ప్రదీప్‌గౌడ్ సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేక ఆగ్రహంతో అదే గదిలో ఉన్న కత్తితో దాడి చేశాడు.
భార్యను కత్తిపోట్లు పొడవగా.. ప్రదీప్‌గౌడ్ గొంతు కోశాడు. ఆ సమయంలో అలజడి వినిపించి ఇంటి యజమానురాలు అక్కడికి వచ్చి.. ఇలా చేశావేంటని శేఖర్‌ను నిలదీసింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో భార్య, ప్రదీప్‌ను ఆయన మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే అనూష మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించారు.
ప్రదీప్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. భార్య మృతదేహాన్ని మొల్గరకు తీసుకెళ్లి జరిగిన విషయం మొత్తం కుటుంబసభ్యులకు చెప్పారు. దీంతో వారు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భూత్పూర్ పోలీసులు గ్రామానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు.
అనూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రదీప్‌గౌడ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల సీఐ రమేష్‌బాబు ఘటన జరిగిన ఇంటిని పరిశీలించి.. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment