కరీంనగర్‌కు చెందిన భూమయ్య తన కొత్త వాహనంలో శబరిమల వెళ్లాడు. ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసినా స్మార్ట్‌కార్డు రాకపోవడంతో ఏపీ, తమిళనాడు, కేరళలలో పలుచోట్ల చలానాలు చెల్లించాడు.
హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ ఓ ప్రముఖ క్యాబ్ సంస్థలో ఉద్యోగి. అక్టోబరులో తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నా ఇంత వరకూ అందలేదు. ఈ కారణంతో ఆ కంపెనీ ఇతనికి డ్యూటీలు ఇవ్వడం మానేసింది.
ఇది ఒక్క భూమయ్య, శ్రీకాంత్ పరిస్థితే కాదు. ఇటీవల ఆర్‌సీలు, డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఎదురుచూస్తోన్న వేలాదిమంది వాహనదారుల దుస్థితి. వీరంతా కొత్త వాహనాలు కొన్నారు. రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ టెస్టులు పూర్తి చేసుకున్నారు. ఇంతవరకూ వీరికి ఆర్‌సీ (రిజిస్ట్రేషన్ కార్డు), డ్రైవింగ్ లైసెన్సులు అందలేదు. మోటారు వాహన చట్టం నిబంధనల ప్రకారం.. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ టెస్టు, రెన్యువల్ పూర్తయిన 15 రోజుల్లోగా పోస్టులో ఇంటికి కార్డులు అందాలి. కానీ, వేలాదిమంది వాహనాలకు రిజిస్ట్రేషన్ పూర్తయినా.. ఇంతవరకూ కార్డులు అందలేదు.
కారణం ఏంటి?
స్మార్ట్‌కార్డుల ముద్రణకు రిబ్బన్ల కొరత 2017, అక్టోబరులోనే ఏర్పడింది. వీటి ముద్రణకు కావాల్సిన కార్డులు, రిబ్బన్లకు ఐటీ విభాగం టెండర్లు పిలుస్తుంది. మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టరు తెలంగాణ రవాణాశాఖకు రిబ్బన్ల సప్లయి చేసే కాంట్రాక్టు దక్కించుకున్నాడు. అతనికి రూ. 8 కోట్లు చెల్లించాలి. కేవలం రూ. 4 కోట్లే చెల్లించారు. మిగిలిన బకాయిలు అలాగే ఉండిపోయాయి. దీంతో రిబ్బన్ల సరఫరాను సదరు కాంట్రాక్టరు నిలిపివేశాడు. దీంతో ఆర్‌సీ కార్డులతోపాటు డ్రైవింగ్ లైసెన్సుల ముద్రణ కూడా నిలిచిపోయింది.
సర్క్యులర్ విడుదల చేయరా?
గ్రేటర్ పరిధిలో ప్రతీరోజు 1500 కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. గ్రేటర్‌లో 11, తెలంగాణ వ్యాప్తంగా 70 వరకు ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు ఒక్కో కార్యాలయానికి 300 వరకు వాహనాలు వస్తుంటాయి. 3నెలలుగా వీరందరికి కార్డులు జారీకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో కలిపి 2 లక్షలకుపైగా కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అయినా ఆ శాఖ అధికారులు ఆర్‌సీలు లేవన్న సాకుతో జరిమానాలు, కేసులు బుక్ చేస్తుండటం గమనార్హం. వీటిపై సర్క్యులర్ జారీ చేయక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
– సాక్షి, హైదరాబాద్
ఉపాధి కోల్పోతున్న డ్రైవర్లు..
ఆర్టీసీ, ప్రైవేటు రంగం, రక్షణ రంగంలోని పలువురు డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ కాకపోవడంతో వారికి డ్యూటీలు వేయడం లేదు. నగరంలో క్యాబ్‌లు నడిపే చాలా మంది డ్రైవర్లకు లైసెన్సు ఈ కారణం గా 4నెలలుగా పలు కంపెనీలు డ్యూటీలు వేయడం లేదు. దీంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. తాత్కాలిక ఆర్‌సీ 15 రోజులే వ్యాలిడిటీ. ఆ తరువాత ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ పోలీసులు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు.
– దయానంద్, తెలంగాణ ఆటో అండ్ మోటార్ వెల్ఫేర్ యూనియన్
కార్డులకు కొరత లేదు..
రిబ్బన్లకు ఎక్కడా కొరత లేదు. గతంలో కొరత ఉన్న మాట వాస్తవమే. కానీ, ఇపుడు లేదు. రిబ్బన్లు వచ్చాయి. అందరికీ కార్డులు జారీ చేస్తున్నాం.
– రమేశ్, జేటీసీ, ఆర్టీఏ
Comments
Please login to add a commentAdd a comment