సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ స్మార్ట్ సేవలకు మంగళం పాడింది. 13 ఏళ్ల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ, తదితర ధ్రువపత్రాలకు సంబంధించిన స్మార్ట్ కార్డులు ఇప్పుడు స్మార్ట్‘లెస్’ అయ్యాయి. ఈ స్మార్ట్ కార్డుల్లో వినియోగించే చిప్స్‌ను తొలగించారు. వాహనదారుకు సంబంధించిన పూర్తి వివరాలతో రూపొందించే చిప్స్ లేకుండానే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను ముద్రించి అందజేస్తున్నారు.
తైవాన్, చైనా, తదితర దేశాల నుంచి చిప్స్ దిగుమతి కావడం లేదనే కారణంతో కొంతకాలం పాటు స్మార్ట్ కార్డుల జారీని నిలిపివేశారు. ఆ తర్వాత చిప్స్ లేకుండానే కార్డులను ముద్రించి అందజేయడం ప్రారంభించారు. ప్రస్తుతం చిప్స్ కొరత లేకపోయినప్పటికీ వాటిని తిరిగి వినియోగింలోకి తేకుండానే చిప్‌లెస్ కార్డులనే వాహనదారులకు కట్టబెట్టడం గమనార్హం. వాహన తయారీ రంగంలో కీలకంగా భావించే చిప్స్ ప్రస్తుతం విదేశాల నుంచి నిరాటంకంగా దిగుమతి అవుతున్నాయి. దీంతో వాహన తయారీ రంగం కూడా తిరిగి వేగం పుంజుకుంది. రవాణాశాఖను మాత్రం ఇంకా చిప్స్ కొరత వెంటాడడం గమనార్హం.
త్రీటైర్‌తో పాటే చిప్స్..
రవాణాశాఖ వివిధ రకాల పౌరసేవలను పారదర్శకంగా అందజేసేందుకు 2009లో త్రీటైర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అప్పటి వరకు ఉన్న టూటైర్ సాంకేతిక వ్యవస్థ స్థానంలో మరింత అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచి్చంది. దీంతో ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయం నుంచే అన్ని రకాల పౌరసేవలకు కిందిస్థాయి వరకు చేరేలా చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, వాహన బదిలీ పత్రాలు వంటివి చిన్న సైజు స్మార్ట్ కార్డుల రూపంలోకి తెచ్చారు. వాహనదారులపైన ఇది ఆర్థికంగా భారమైనప్పటికీ పెద్ద పత్రాల రూపంలో వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తప్పింది.
మరోవైపు స్మార్ట్ కార్డుల్లో చిప్స్‌ను ప్రవేశపెట్టారు. వాహనదారుడి పూర్తి వివరాలను ఇందులో నమోదు చేశారు. దీనివల్ల ఎలాంటి నకిలీ పత్రాలకు తావు లేకుండా ఆర్టీఏ సేవలు మరింత నాణ్యంగా, పారదర్శకంగా మారాయి. వాహనదారుడికి పూర్తి భద్రత లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి స్మార్ట్ సేవలు అందుబాటులో లేని రోజుల్లోనే ‘చిప్స్’ను పరిచయం చేయడం విశేషం. కానీ వీటిలో నమోదు చేసిన సమాచారాన్ని తెలుసుకొనేందుకు కావాల్సిన రీడర్స్‌ను మాత్రం ఆర్టీఏ సమకూర్చుకోలేకపోయింది. రవాణాశాఖలోనే కాదు పోలీసుల వద్ద కూడా చిప్స్ రీడర్స్ లేకపోవడం గమనార్హం. వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు, ఇతరత్రా సంఘటనల్లో ఈ స్మార్ట్ కార్డులలోని చిప్స్ ద్వారా సమాచారం తెలుసుకొనే అవకాశం ఉన్నా రీడర్స్ లేకపోవడంతో అవి కేవలం అలంకారప్రాయంగా మారాయి.
ఏకంగా ఎత్తేశారు..
పారదర్శక సేవలను అందజేసే లక్ష్యంతో టు టైర్ నుంచి త్రీటైర్‌కు మారిన రవాణాశాఖ ఇప్పుడు చిప్స్ కొరతను సాకుగా చూపుతూ, చిప్ రీడర్స్ లేకపోవడంతో చిప్స్‌తో ఎలాంటి ఉపయోగం లేదనే అంశాన్ని ఎత్తి చూపుతూ ఇప్పుడు ఏకంగా చిప్స్‌నే తొలగించారు. దీంతో నకిలీ కార్డులకు ఊతమిచ్చినట్లయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆధార్, ఓటర్ గుర్తింపు వంటి వివిధ రకాల నకిలీ కార్డులు వెల్లువెత్తుతుండగా, చిప్స్ లేకపోవడంతో లైసెన్సులు, ఆర్సీల్లోనూ నకిలీ పత్రాలకు ఊతమిచ్చినట్లవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment