ఐదుగురు కార్మికుల మృతి..
13 మందికి తీవ్రగాయాలు
ఆటోక్లేవ్ యూనిట్ వద్ద పేలిన బాయిలర్
చెల్లాచెదురుగా మృతదేహాలు.. షాద్‌నగర్ పరిధిలో ఘటన
షాద్‌నగర్: గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామశివారులో వాహనాలకు సంబంధించిన గ్లాస్ అద్దాలను తయారుచేసే సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పరిశ్రమలోని ఆటో క్లేవ్ యూనిట్‌లో అద్దాలను గ్యాస్, వేడితో అతికించి, బాయిలర్ నుంచి బయటకు తీసే క్రమంలో ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో ఆటో క్లేవ్ యూనిట్ వద్ద ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారు. యూనిట్‌లో తయారైన గ్లాస్‌ను బయటకు తీసే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు. ఈ పేలుడుతో మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా సుమారు వంద మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి. ఓ కార్మికుడి మృతదేహం పరిశ్రమ షెడ్డు రేకులను చీల్చుకొని బయటకు ఎగిరిపడింది. మరో కార్మికుడి మృతదేహం పూర్తిగా యంత్రంలో ఇరుక్కుపోయింది. ముగ్గురి మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా సుమారు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి.
శరీరాల నుంచి కాళ్లు, చేతులు, తల, తదితర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మృతి చెందినవారిలో బిహార్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ (25), రాంఆశిష్ (18), రవుకాంత్ (25), రోషన్ (36), రతన్ దేవరియా (30) ఉన్నారు. వీరితోపాటు బిహార్‌కు చెందిన గోవింద్, మంటు, సమీద్‌కుమార్, రోషన్‌కుమార్, సురేంద్ర పాశ్వాన్, జార్ఖండ్‌కు చెందిన మైకేల్ ఎంబ్రామ్, కార్తీక్, సు¿ోద్, బూర్గుల గ్రామానికి చెందిన పుల్లని సుజాత, కాశిరెడ్డిగూడకు చెందిన నీలమ్మ, మమత, ఒడిశాకు చెందిన రేతికాంత్, రాజేశ్‌లు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు.
కేటీఆర్ దిగ్భ్రాంతి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని కర్మాగారాల్లో భద్రత తీరుపై పరిశీలన చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు: హరీశ్‌రావు
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పలు పరిశ్రమల్లో ప్రమా దాలు జరుగుతున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా ప్రమా దాలు జరుగుతున్నా, భద్రతా చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు.
ప్రమాద ఘటనపై సీఎం ఆరా
ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్న ఆయన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి తగిన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, అగి్నమాపక శాఖ, కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులు, వైద్య బృందాలు ఘటనాస్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. దీంతో కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ రాంకుమార్, ఆర్డీఓ వెంకటమాధవరావులు ఘటనా స్ధలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment