సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్‌కు చెందిన వినోద్ మే నెలలో డ్రైవింగ్ లైసెన్స్ చిరునామా మార్పు కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కొత్త లైసెన్స్ ‘స్మార్ట్ కార్డు’ పోస్టు ద్వారా వారం రోజుల్లో ఇంటికే వస్తుందని అధికారులు చెప్పారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు అతన్ని తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్సు చూపించమన్నారు. అది లేకపోవడంతో జరిమానా విధించారు.
ఐ లంగర్‌హౌస్‌లో ఉంటున్న సాయితేజ నెల రోజుల క్రితం కొత్త బైక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు వాహనం రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) చేతికి రాలేదు. 15 రోజుల పాటు ఎదురు చూసి అధికారులను సంప్రదించాడు. కార్డుల కొరత వల్ల పంపిణీ నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడతడు బండి బయటకు తీస్తే పోలీసులు పట్టుకుంటారేమోనని భయపడుతున్నాడు.
ఈ సమస్య వినోద్, సాయితేజలదే కాదు.. గ్రేటర్‌లోని సుమారు లక్షా 75 వేల మంది వాహన వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య. నగరంలోని ఒక్కో ఆర్టీఏ కార్యాలయంలో 10 వేల నుంచి 25 వేల వరకు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీ నిలిచిపోయింది. నగర శివారులోని ఒక్క ఇబ్రహీంపట్నం ఆర్టీఏ పరిధిలోనే సుమారు 20 వేల స్మార్ట్ కార్డుల పంపిణీకి బ్రేక్ పడింది. ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌లో 25 వేల కార్డులు ఆగిపోయాయి. ప్రస్తుతం అత్యంత ప్రముఖులకు మాత్రమే అతికష్టంగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు అందజేస్తున్నారు. మేడ్చల్, అత్తాపూర్, ఉప్పల్ తదితర అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత రవాణాశాఖకు సవాల్‌గా మారింది. రెండు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ప్రతిష్టంభన ఇప్పటికీకొనసాగుతూనే ఉంది.
ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం
డ్రైవింగ్ లైసెన్సు కోసం వినియోగదారుడు రూ.1550 వరకు చెల్లిస్తాడు. రవాణాశాఖ అందజేసే పౌరసేవల కోసం చెల్లించే ఫీజుతో పాటు, కార్డుపైన వాహనదారుడి వివరాలను ముద్రించి ఒక ప్రామాణికమైన డ్రైవింగ్ లైసెన్సు రూపంలో పోస్టు ద్వారా అందజేసేందుకు రూ.35 పోస్టల్ చార్జీలతో సహా రూ.250 సేవా రుసుం, ఇతరత్రా అన్ని ఖర్చులను ముందే చెల్లిస్తాడు. గతంలో డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలు పూర్తయిన వెంటనే నేరుగా లైసెన్స్ ఇచ్చేవారు. ఆర్సీలూ అంతే. వాహనదారుల చిరునామా ధ్రువీకరణ కోసం కొంతకాలంగా పోస్టు ద్వారా పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల్లో వినియోగదారుడికి చేరేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ అన్ని రకాల ఫీజులు, సర్వీసు చార్జీలు చెల్లించిన సుమారు లక్షా 75 వేల మంది వినియోగదారులకు గత రెండు నెలలుగా స్మార్ట్ కార్డులు అందడం లేదు. ఒక్కో వినియోగదారుడు సగటున రూ.1500 ఫీజు చెల్లించినట్లు భావించినా ఈ రెండు నెలల్లో రవాణాశాఖ ఖజానాలో జమ అయిన మొత్తం అక్షరాలా రూ.26.25 కోట్లపైనే.. అంటే వాహనదారుల నుంచి ముందుగానే ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసిన రవాణశాఖ వారికి అందించాల్సిన స్మార్ట్‌కార్డుల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏడాది కాలంగా ఈ సమస్య పదే పదే పునరావృతమవుతోంది. ఈ ఏడాది కాలంలో పౌరసేవలపైన వినియోగదారుల నుంచి వందల కోట్ల రూపాయలు ఆర్జించిన రవాణాశాఖ.. వారికి అందజేయవలసిన పౌరసేవలపైన మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తోంది.
బకాయిలు రూ.4 కోట్లే
ప్రతినెలా 1.15 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను ముద్రించి పంపిణీ చేస్తారు. ఇందుకోసం వినియోగించే స్టేషనరీని పూణేకు చెందిన ఎంటెక్ ఇన్నొవేషన్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. సాధారణంగా వినియోగదారుల డిమాండ్ మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సంస్థ 6 లక్షల కార్డులను రవాణాశాఖకు అందజేస్తుంది. అలాగే ముంబైకి చెందిన శ్రీనాథ్ ఎంటర్‌ప్రైజెస్ స్మార్ట్ కార్డుల ముద్రణకు అవసరమైన రిబ్బన్‌ను సరఫరా చేస్తుంది. ప్రతి 3 నెలలకోసారి ఈ రెండు సంస్థలకు నిధులు చెల్లించాలి. ఎంటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇంకా 9 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ రూ.4 కోట్ల మేర బకాయీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆ సంస్థ మే నెలాఖరు నుంచి కార్డుల సరఫరాను నిలిపివేసింది. అప్పటి వరకు అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిల్వ ఉన్న కార్డులను పంపిణీ చేయగా జూన్ నుంచి తీవ్ర కొరత ఏర్పడింది.
వాహనదారులకు రెండు విధాలా నష్టం..
ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. అన్ని రకాల ఫీజులు చెల్లించి సకాలంలో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు అందుకోలేకపోవడం ఒకటైతే.. సరైన ధ్రువపత్రాలు లేవనే కారణంతో ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం రెండోది. చాలా వరకు తమ వద్ద ఉన్న రశీదుల ఆధారంగా వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి బయటపడుతున్నప్పటికీ అవి కోల్పోయిన వారు మాత్రం తగిన ‘మూల్యం’ చెల్లించకతప్పడం లేదు. ఇలా ప్రతి రోజు సుమారు 250 మంది డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు లేక చలానాలు కడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment