ఆన్‌లైన్‌ రూట్లో ఆర్టీఏ | More Services In Online In RTA Soon | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ రూట్లో ఆర్టీఏ

Published Sun, Feb 23 2020 3:07 AM | Last Updated on Sun, Feb 23 2020 3:07 AM

More Services In Online In RTA Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రవాణా శాఖ ఆన్‌లైన్‌ బాటపడుతోంది. ప్రత్యేక నంబర్ల కోసం ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ విజయవంతంగా నిర్వహించిన ఆర్టీఏ.. మరిన్ని సేవలను ఆన్‌లైన్‌ పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వాహన వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావలసిన అవసరంలేని సేవల్ని గుర్తించి ఆన్‌లైన్‌ పరిధిలోకి తెచ్చారు. ఇంటి వద్ద నుంచే నేరుగా ఈ సేవలను పొందవచ్చు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదుకే అవకాశం ఉంది. ఒకసారి స్లాట్‌ (సమయం,తేదీ) నమోదు చేసుకున్న వినియోగదారులు నెట్‌బ్యాంకింగ్‌ లేదా ఈ సేవ కేంద్రా ల్లో ఫీజు చెల్లించి నిర్ణీత సమయం ప్రకారం ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి ఉండేది. ఇకపై కొన్ని సేవలకు మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం ప్రత్యేక నంబర్లకు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ నిర్వహిస్తున్నట్టే సుమారు 20 రకాల పౌరసేవలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. వినియోగదారుల అభ్యర్థనలు, వారు అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్లు, చిరునామా ధ్రువీకరణ ఇతర పత్రాలను అధికారులు పరిశీలించి సంతృప్తి చెందితే.. వారు కోరుకున్న సేవలను ఆన్‌లైన్‌లోనే అందజేస్తారు. ఇందుకోసం నెట్‌బ్యాంకింగ్, ఈ సేవా కేంద్రాల ద్వారా చెల్లిస్తున్నట్టే ఫీజులను చెల్లించాలి. రవాణాశాఖ మంత్రి నుంచి ఆమోదం లభించిన వెంటనే మార్చి నుంచి ఆన్‌లైన్‌ సేవలను అమల్లోకి తేనున్నట్లు జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ రమేష్‌ తెలిపారు.

ఆన్‌లైన్‌ సేవలివే..

  • లెర్నింగ్‌ లైసెన్స్‌ కేటగిరీ: కాలపరిమితి ముగిసిన లెర్నింగ్‌ లైసెన్స్‌ కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. ఉదాహరణకు ద్విచక్ర వాహనం నడిపేందుకు మొదట అనుమతి పొందిన వారు తరువాత ఆన్‌లైన్‌లోనే కారు లేదా ఆటో వంటి వాటి కోసం అనుమతి పొందవచ్చు. లెర్నింగ్‌ లైసెన్స్‌ పోగొట్టుకొంటే తిరిగి డూప్లికేట్‌ పొందవచ్చు. కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ స్థానంలో లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకోవచ్చు.
  •  డ్రైవింగ్‌ లైసెన్స్‌ కేటగిరీ: రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతించే బ్యాడ్జి, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్, డూప్లికేట్‌ లైసెన్స్, అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్, లైసెన్స్‌లో చిరునామా మార్పు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ సేవలను పొందవచ్చు.
  • కండక్టర్‌ లైసెన్స్‌: ఆర్టీసీ కండక్టర్లు, ఇతర ప్రయాణికుల వాహనాల్లో కండక్టర్లుగా విధులు నిర్వహించే వారు ఆర్టీఏ నుంచి పొందే లైసెన్స్‌ ఆన్‌లైన్‌లోనే లభిస్తుంది. కొత్త లైసెన్స్‌ తీసుకోవడంతో పాటు రెన్యూవల్, డూప్లికేట్, అడ్రస్‌ మార్పువంటి అన్ని సదుపాయాలను పొందవచ్చు.
  • వాహనాల రిజిస్ట్రేషన్‌ కేటగిరీ: వాహనం యాజమాన్య బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం విక్రయించిన వారు, కొనుగోలు చేసిన వారు తమ పూర్తి వివరాలను, డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. డూప్లికేట్‌ ఆర్సీ తీసుకోవచ్చు. సదరు వాహనానికి ఫైనాన్స్‌ ఉంటే మాత్రం సాధ్యం కాదు. ఆర్సీ (వాహనం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌)లో చిరునామా మార్చుకోవచ్చు. వాహనంఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయితే నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తీసుకోవచ్చు.

డాక్యుమెంట్లే కీలకం
ఆన్‌లైన్‌ సేవల్లో వినియోగదారులు సమర్పించే డాక్యుమెంట్లను అధికారులు సీరియస్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు వాహన యాజమాన్యం ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయ్యేందుకు ప్రస్తుతం అందజేసే పత్రాలనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు వాహనం ఫొటో, అభ్యర్థుల తాజా చిత్రాలను సైతం అందజేయాలి. అభ్యర్థుల సంతకాలనూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ‘ఫొటోలకు సంబంధించి కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థుల సెల్ఫీ అప్‌లోడ్‌ చేయడమా లేక, ఇంకేదైనా చేయవచ్చా అనేది పరిశీలిస్తున్నాం’అని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement