సాక్షి, అమరావతి: ఇక నుంచి పేపర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, పేపర్ ఆర్సీ కార్డులుండవు. పేపర్ రహిత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా రాష్ట్ర రవాణా శాఖ ముందడుగు వేసింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికింది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కార్డుల జారీ విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రవాణా శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. డిజి లాకర్ /ఎం–పరివాహన్‌లోఇవి అందుబాటులో ఉంటాయి.
రాష్ట్రంలో దశాబ్దాలుగా రవాణా శాఖ ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను అందిస్తోంది. ఇందుకోసం దరఖాస్తుతో పాటు ఒక్కో కార్డుకు రూ.200 ఫీజు, రూ.35 పోస్టల్ చార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఈ విధానానికి శుక్రవారం నుంచి రవాణా శాఖ ముగింపు పలికింది. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింటింగ్‌లో జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే రూ.33.39 కోట్లు కేటాయించింది. ఇక శనివారం నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి దరఖాస్తుతో కార్డు కోసం రూ.200, పోస్టల్ చార్జీలకు రూ.35 వసూలు చేయరు.
దరఖాస్తులను పరిశీలించి తగిన ప్రక్రియ అనంతరం డిజిటల్ విధానంలోనే వీటిని జారీ చేస్తారు. ప్రత్యేకంగా ఎం–పరివాహన్, డిజి లాకర్‌లో అందుబాటులో ఉంచుతారు. వాహనదారులు, దరఖాస్తుదారులు వాటిని డౌన్‌లోడ్ చేసుకుని తమ మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారులు అడిగితే ఆ డిజిటల్ ఫార్మాట్‌లో ఉన్న కార్డులను చూపితే సరిపోతుంది. మొబైల్ ఫోన్లు వాడనివారు ఆ కార్డులను ప్రింట్ తీసుకుని కూడా తమతో ఉంచుకోవచ్చు. వాటిని చూపినా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఇక నుంచి రవాణా శాఖ జారీ చేసే అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచుతారు.
వాహనదారులకు సౌలభ్యం
డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల జారీ విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుంది. వారి నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయం. అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే చాలు. – ఎంకే సిన్హా, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment