Telangana Govt To Issue Chipless Cards For Driving License, RC - Sakshi
Sakshi News home page

Telangana: డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ కార్డుల జారీపై కీలక నిర్ణయం

Published Mon, Nov 28 2022 7:12 PM | Last Updated on Mon, Nov 28 2022 7:58 PM

Telangana Govt to Issue Chipless Cards For Driving License, RC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ కార్డులు ఇక చిప్‌ లేకుండానే జారీ కాబోతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి చిప్‌ లేని కార్డులను రవాణాశాఖ జారీచేయనుంది. గతంలో విచ్చలవిడిగా నకిలీ కార్డులు రావడంతో వాటిని అడ్డుకునే క్రమంలో రవాణాశాఖ చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డులను జారీ చేయడం ప్రారంభించింది. కానీ 40 రోజులుగా చిప్‌ల కొరతతో కార్డుల జారీ నిలిచిపోయింది. ఆరు లక్షల వరకు కార్డుల జారీ పేరుకుపోయింది. విదేశాల నుంచి చిప్‌ల దిగుమతి నిలిచిపోవటంతో తప్పనిస్థితిలో మళ్లీ పాతపద్ధతిలో కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. 

కార్డులు లేకపోవటంతో తనిఖీల్లో పోలీసులు చలానాలు రాస్తుండటం, రాష్ట్ర సరిహద్దుల్లో సమస్యలు ఎదురవుతుండటంతో గందరగోళంగా మారింది. ఈ మొత్తం పరిస్థితిని వారం కిందట ‘తైవాన్‌ చిప్‌ ఆగింది.. కార్డుల జారీ నిలిచింది’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలో నిలిచిపోయిన కార్డులన్నింటినీ చిప్‌లు లేకుండా వెంటనే జారీ చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. చిప్‌ లేని కార్డుల జారీ కోసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకుంది. మళ్లీ రెండుమూడు నెలల్లో చిప్‌లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్న రవాణాశాఖ.. అప్పటి వరకు చిప్‌ లేకుండానే కార్డులను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  

చిప్‌ ఉన్నా రీడర్లు లేవు.. 
వాహనం, దాని యజమానికి సంబంధించిన వివరాలను చిప్‌లో నిక్షిప్తం చేసి దాన్ని స్మార్ట్‌కార్డులో పొందుపరుస్తారు. పోలీసులు తనిఖీ సమయంలో కార్డును చిప్‌ రీడర్‌ పరికరం ముందు ఉంచగానే ఆ వివరాలు ఆ రీడర్‌లో కనిపిస్తాయి. కానీ మన అధికారుల వద్ద పరిమితంగానే చిప్‌ రీడర్లు ఉన్నాయి. దీంతో చిప్‌ఉన్నా దాని ఆధారంగా వివరాలు స్కాన్‌ చేసే వీలు లేకుండాపోయింది. ఇప్పుడు చిప్‌ లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదన్న భావనతో చిప్‌ లేని కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది.

అయితే, ఇప్పుడు చిప్‌ లేని కార్డుల జారీ మొదలైతే మళ్లీ నకిలీ కార్డులతో కేటుగాళ్లు దందా చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరలో చిప్‌లు తెప్పించి మళ్లీ చిప్‌ ఉండే కార్డులను జారీచేస్తామని రవాణాశాఖ చెబుతోంది. గతంలో చైనా, ఉక్రెయిన్, తైవాన్‌ దేశాల నుంచి చిప్‌లు దిగుమతి అయ్యేవి. చైనా నుంచి దిగుమతిని కేంద్రం నిషేధించగా, యుద్ధంతో ఉక్రెయిన్‌ చిప్‌లు రావడంలేదు. స్థానికంగా వినియోగం పెరగడంతో తైవాన్‌ కూడా ఆపేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement