లాభాల్లో ప్రైవేటుదే పైచేయి..! | Non-executive directors: RBI issues compensation norms for private ... | Sakshi
Sakshi News home page

లాభాల్లో ప్రైవేటుదే పైచేయి..!

Published Tue, Jun 2 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

లాభాల్లో ప్రైవేటుదే పైచేయి..!

లాభాల్లో ప్రైవేటుదే పైచేయి..!

తొలిసారి నికరలాభంలో ప్రభుత్వ బ్యాంకుల కన్నా ముందంజ
ప్రభుత్వ బ్యాంకులకు మొండిబకాయిలు గుదిబండలా మారుతున్నాయి. నానాటికీ ఇవి కొండలా పేరుకుపోతుండటంతో ఆ ప్రభావం వాటి లాభాలపై పడుతోంది. అందుకే... తొలిసారిగా దేశంలో 24 ప్రభుత్వ బ్యాంకుల మొత్తం నికర లాభాన్ని 13 ప్రయివేటు బ్యాంకుల నికరలాభం మించిపోయింది. దేశ చరిత్రలో తొలిసారి ఉమ్మడిగా ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేటు బ్యాంకులు అధిగమించాయి.

2014-15 ఆర్థిక సంవత్సరంలో 25 ప్రభుత్వ బ్యాంకుల మొత్తం నికరలాభం రూ.33,976 కోట్లు కాగా... టాప్ 13 ప్రైవేటు బ్యాంకుల ఉమ్మడి నికరలాభం రూ.37,361 కోట్లకు చేరింది. అంటే రూ.3,385 కోట్లు ఎక్కువన్న మాట.
 
మొండిబకాయిల కోసం, రాని బకాయిల కోసం ప్రభుత్వ బ్యాంకుల పక్కనబెట్టిన మొత్తం (ప్రొవిజనింగ్) విపరీతంగా పెరిగిపోవటంతో వాటి నికరలాభం గణనీయంగా పడిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) ఈ సారి ఏకంగా 0.58 శాతం పెరిగి 5.47 శాతానికి చేరుకున్నాయి. అదే ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఎన్‌పీఏల స్థాయి ఇంతలా లేదు.

ఈ ఏడాది పెరుగుదల 0.19 శాతం మాత్రమే ఉండగా మొత్తం ఎన్‌పీఏల శాతం 2.01గా ఉంది. అందుకే నిరర్ధక ఆస్తుల నిమిత్తం ప్రైవేటు బ్యాంకులు రూ.10,852 కోట్లు కేటాయించగా ప్రభుత్వ బ్యాంకులు ఏకంగా రూ.72,095 కోట్లు కేటాయించాయి. ఇదే వాటి నికరలాభం తగ్గుదలకు ప్రధాన కారణంగా మారింది. చిత్ర మేంటంటే ఏడాది కిందట పరిస్థితి ఇలా లేదు. 13 ప్రయివేటు బ్యాంకుల మొత్తం నికర లాభం కన్నా 24 ప్రభుత్వ బ్యాంకులే రూ.2,312 కోట్లను అధికంగా ఆర్జించాయి.
 
సగానికి క్షీణించిన నికరలాభం...
ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రెండింటి నికరలాభం గతేడాదితో పోలిస్తే సగమే నమోదయింది. గతేడాదికన్నా ఏకంగా 134 శాతం అధికంగా బీఓబీ ఏకంగా రూ.1,491 కోట్లను ఎన్‌పీఏల కోసం కేటాయించింది. చిత్రమేంటంటే ఈ విషయమై బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ, సీఈఓ రంజన్ ధావన్ ఇటీవల మాట్లాడుతూ... తదుపరి సంవత్సరానికి అంటే 2015-16కు ఎన్‌పీఏలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పలేమనటం. ‘‘బడా కార్పొరేట్ సంస్థలు చాలావరకూ దారుణమైన కష్టాల్లో ఉన్నాయి.

అలాంటి వాటిని ఎన్‌పీఏలుగా ప్రకటించాలా? లేదా? అనే విషయమై ఇంకా చర్చ జరుగుతోంది. నా ఉద్దేశం ప్రకారం వచ్చే ఐదారు నెలల్లో ఇవి ఎన్‌పీఏలుగా మారకపోవచ్చు. అలా మారితే గనక ఒకే కంపెనీ నుంచి వందల కోట్లు రాని బాకీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది’’ అని చెప్పారు. పీఎన్‌బీ విషయానికొస్తే ఈ ఏడాది దాదాపు 76% అధికంగా రూ.7,979 కోట్లను రాని బాకీల కోసం కేటాయించింది. దీనిపై బ్యాంకు ఎండీ, సీఈఓ గౌరీ శంకర్ మాట్లాడుతూ ‘‘రాని బాకీలుగా గుర్తించిన వాటిలో కొన్ని రికవరీ అయ్యే చాన్సుంది.

అదే జరిగితే ప్రొవిజనింగ్ మారి లాభం పెరుగుతుంది’’ అన్నారు. ఇన్‌ఫ్రా, ఉక్కు రంగాలు బాగా దెబ్బతిన్నట్లు చెప్పారాయన. ఈ మధ్యే దీనిపై ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా మాట్లాడతూ ఎన్‌పీఏలు అన్నిచోట్లా ఒకేలా లేవని, ప్రభుత్వ బ్యాంకుల్లో బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
 
ఎస్‌బీఐ కేటాయింపులు రూ. 25,812 కోట్లు
ఉదాహరణకు ఎస్‌బీఐను చూస్తే 2014-15 కోసం కేటాయించిన రూ.25,812 కోట్లలో రూ.19,086 కోట్లు రాని బాకీల కోసమే. దీంతో మొత్తం కేటాయింపులు ఈ ఏడాది ఏకంగా 21.6% పెరిగినట్లయింది.
 
ప్రొవిజనింగ్..
 - ఒక ఖాతా గనక ఏడాదిపాటు నిరర్థక ఆస్తిగా దాన్ని నాసిరకంగా పరిగణిస్తారు. అలాంటి ఖాతాకోసం 15% మొత్తాన్ని కేటాయించాలి.
 - నాసిరకంగా 12 నెలలు కొనసాగితే దాన్ని రికవరీ అవుతుందో రాదో తెలియని సందేహాస్పద ఖాతాగా పరిగణిస్తారు. దీనికి కనీసం 25%, గరిష్టంగా 100% ప్రొవిజనింగ్ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement