న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆకర్షణీయ పనితీరు చూపాయి. మొత్తం 12 సంస్థలు ఉమ్మడిగా రూ. 34,774 కోట్ల నికర లాభం ఆర్జించాయి. గతేడాది(2022–23) క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 15,306 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. అధిక వడ్డీ రేట్ల పరిస్థితులు ఇందుకు సహకరించాయి. రుణ రేట్ల సవరణ కారణంగా పలు బ్యాంకుల వడ్డీ మార్జిన్లు బలపడ్డాయి. వెరసి నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 3 శాతానికిపైనే నమోదయ్యాయి.
బీవోఎం అదుర్స్
పీఎస్‌యూ సంస్థలలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్‌ఐఎం అత్యధికంగా 3.86 శాతానికి చేరగా.. సెంట్రల్ బ్యాంక్ 3.62 శాతం, ఇండియన్ బ్యాంక్ 3.61 శాతం మార్జిన్లను సాధించాయి. నాలుగు సంస్థలు 100 శాతానికిపైగా నికర లాభంలో వృద్ధిని అందుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 307 శాతం అధికంగా రూ. 1,255 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ బాటలో నంబర్ వన్ సంస్థ ఎస్‌బీఐ నికర లాభం 178 శాతం దూసుకెళ్లి రూ. 16,884 కోట్లను తాకింది. ఇది బ్యాంక్ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో రికార్డ్‌కాగా.. మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల లాభాల్లో 50 శాతం వాటాను ఆక్రమించింది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 176 శాతం జంప్ చేసి రూ. 1,551 కోట్లకు చేరింది. గతేడాది మొత్తం లాభాల(రూ. 1.05 లక్షల కోట్లు)లోనూ ఎస్‌బీఐ నుంచి 50 శాతం సమకూరిన సంగతి తెలిసిందే.
ఐదు బ్యాంకులు భేష్
క్యూ1లో ఐదు ప్రభుత్వ బ్యాంకులు 50–100 శాతం మధ్య లాభాలు ఆర్జించాయి. వీటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 95 శాతం వృద్ధితో రూ. 882 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 88 శాతం అధికంగా రూ. 4,070 కోట్లు, యుకో బ్యాంక్ 81 శాతం వృద్ధితో రూ. 581 కోట్లు సాధించాయి. కేవలం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ మాత్రమే 25 శాతం క్షీణతతో రూ. 153 కోట్ల నికర లాభం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు పీఎస్‌యూ బ్యాంకుల పురోగతికి దోహదపడ్డాయి. గుర్తింపు, పరిష్కారం, పెట్టుబడులు, సంస్కరణల పేరుతో అమలు చేసిన వ్యూహాలు ఫలితాలినిచ్చాయి. దీంతో మొండి రుణాలు దశాబ్దకాలపు కనిష్టం 3.9 శాతానికి చేరాయి. ఇదే సమయంలో(గత ఎనిమిదేళ్లలో) మొండి రుణాల నుంచి రూ. 8.6 లక్షల కోట్ల రికవరీని సాధించాయి. 2017–21 మధ్య ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం రూ. 3,10,997 కోట్ల పెట్టుబడులను పీఎస్‌యూ బ్యాంకులకు అందించింది.
ప్రభుత్వ బ్యాంకుల లాభాల జోరు..క్యూ1 ఫలితాలు విడుదల
Published Mon, Aug 7 2023 7:38 AM | Last Updated on Mon, Aug 7 2023 8:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment