బ్యాంకుల ప్రైవేటీకరణే పరిష్కారమా? | Government Banks Privatization Guest Column By Satish Singh | Sakshi
Sakshi News home page

బ్యాంకుల ప్రైవేటీకరణే పరిష్కారమా?

Published Sat, Jan 29 2022 12:44 AM | Last Updated on Sat, Jan 29 2022 12:44 AM

Government Banks Privatization Guest Column By Satish Singh - Sakshi

ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల రాబడి రావచ్చు గానీ, దీన్నుంచి స్థూలంగా దేశానికి ఏం ప్రయోజనం కలుగుతుందన్నది ప్రశ్న. ప్రైవేట్‌ బ్యాంకులు ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాలకు సేవలు వంటి లాభదాయకం కాని సేవలనుంచి తప్పుకోవచ్చు. లాభం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై పని ఒత్తిడి, ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల పనితీరు తిరోగమిస్తోంది. మొత్తంమీద చూస్తే బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న సమస్యలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది సర్వరోగనివారిణి అయితే కాదు.

నీతి ఆయోగ్‌ సిఫార్సుల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌ సీస్‌ బ్యాంకు అనే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించబోతోంది. 2021 ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్‌లో, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒక ప్రభుత్వ బీమా కంపెనీని 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీ కరించాలనే లక్ష్యాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటీకరణ ప్రక్రియను ముగించడానికి, ప్రభుత్వం బ్యాంకింగ్‌ చట్టాల్లో మార్పులు తీసుకురావలసి ఉంది. అందుచేత, ప్రభుత్వం బ్యాంకింగ్‌ లాస్‌ (సవరణ) బిల్లు, 2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ కనీసం వాటా 51 నుంచి 26 శాతానికి కుదించబడుతుంది.

ప్రస్తుతానికి, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌ సీస్‌ బ్యాంక్‌ వాటాలు దాదాపు రూ. 44 వేల కోట్ల వరకు ఉండవచ్చని లెక్కించారు. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ. 31,641 కోట్లు కాగా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్కెట్‌ విలువ రూ. 12,359 కోట్లు. ఈ రీతిన ఈ బ్యాంకుల్లో ఉన్న తన వాటాను ప్రభుత్వం అమ్ముకోవడం ద్వారా తానుపెట్టిన మూల ధనాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం తన వాటాని అమ్ముకోవడానికి ఎంత సమయం పడుతుందని చెప్పడం కష్టమవు తుంది. ఈ మూలధనం విలువ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సమయంలో మార్కెట్‌ పరిస్థితులపైనా, బ్యాంక్‌ బలంపైనా అంటే బ్యాంకు శాఖలు, కస్టమర్లు, అలాగే బ్యాంక్‌ బిజినెస్‌ స్థాయి, నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఎలు) తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

బ్యాంకులను ప్రైవేటీకరించిన తర్వాత, ఈ బ్యాంకుల్లోకి మూలధనాన్ని మళ్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. పైగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ వంటి ప్రభుత్వ విభాగాలు ఈ సంస్థలను పర్యవేక్షించాల్సిన అవసరం ఇకపై ఉండదు. అయితే ఈ రెండు ప్రభుత్వ బ్యాంకులకు చెందిన వాటాలను కొను గోలు చేసిన వారు బ్యాంకును మరింత స్వేచ్ఛగా నిర్వహించు కోగలుగుతారు.

ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 95.8 శాతం వాటాలు ఉన్నాయి. ఇక సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రభుత్వ వాటా 92.4 శాతం వరకు ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన వాటాను ప్రభుత్వం మొదట 51 శాతానికి తగ్గించుకుంటుందనీ, తర్వాత దాన్ని 50 శాతంకంటే తక్కువకు కుదించి ఆ బ్యాంకుల అమ్మకం సజావుగా జరిగేందుకు వీలు కల్పిస్తుందనీ భావిస్తున్నారు. ప్రైవేటీకరణ తర్వాత, ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవచ్చు. దీనివల్ల ప్రభు త్వానికి ఉన్న సంక్షేమ ముద్రపై ప్రతికూల ప్రభావం కలుగుతుంది. భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా ఉద్యోగులు తమ పనిలో చురుకు దనం చూపలేకపోవచ్చు.

ఇది ఈ బ్యాంకుల పనితీరునే దెబ్బ తీయవచ్చు. పైగా ఈ రెండు బ్యాంకుల సేవా రుసుములు పెరుగు తాయి. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడం నుంచి ఈ బ్యాంకులు తప్పుకోవచ్చు. ప్రభుత్వ పథకాలను అమలు చేయ డానికి ఇవి ఆసక్తి చూపకపోవచ్చు. పైగా పెన్షన్‌ పంపిణీ, అటల్‌ పెన్షన్‌ యోజన, సుకన్యా సమృద్ధి యోజన వంటి తక్కువ ప్రతిఫలం లభించే తరహా సేవలకు సంబంధించిన పనులు చేయడంపై ఇవి ఆసక్తి చూపకపోవచ్చు. అదే సమయంలో తమ రాబడిని పెంచు కోవడానికి మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్‌ వంటి బ్యాంకింగేతర సేవలను అందించడానికి ఈ బ్యాంకులు పూనుకోవచ్చు. 

ప్రైవేటీకరణ జరిగిన తర్వాత, ఈ బ్యాంకుల పట్ల కస్టమర్లు మనస్సుల్లో ఉండే పరపతి స్థాయి తగ్గిపోవచ్చు. ఇటీవలే యస్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ (పీఎమ్‌సీ)లు మునిగిపోవడం చూశాం. ప్రభుత్వ పథకాలకు ఒక రూపమివ్వడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై తీవ్రమైన భారం పడవచ్చు.

ప్రైవేటీకరణ కోసం ప్రతిపాదించిన బ్యాంకుల పరిమాణం చిన్నది. సెంట్రల్‌ బ్యాంక్‌లో 33 వేలమంది, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులో 26 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 2021 ఆర్థిక సంవ త్సరంలో ఆరేళ్ల తర్వాత రూ. 831 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2020 సంవత్సరంలో ఈ బ్యాంకు రూ. 8,527 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 887.58 కోట్లకు చేరుకున్నాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నికర లాభం 20 శాతం పెరిగి రూ. 161 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలానికి గానూ బ్యాంకు 134 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ. 6,703.71 కోట్లకు నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 2 శాతం పెరిగి రూ. 6,833. 94 కోట్లకు చేరింది. బ్యాంకు నిర్వహణాత్మక లాభం 42.16 శాతం వృద్ధితో రూ. 1,458 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలా నికి బ్యాంకు లాభం రూ. 1,026 కోట్లు మాత్రమే. గత సంవత్సరం బ్యాంకు నిరర్థక ఆస్తులు 19.89 శాతంగా ఉండగా, ఈ సంవత్సరం అవి 17.36కి తగ్గాయి.

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నికరలాభం గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 148 కోట్లు కాగా ఈ సంవత్సరం ఇదే కాలానికి అది రెట్టింపై రూ. 376 కోట్లకు చేరింది. బ్యాంక్‌ ఇచ్చిన మొత్తం అడ్వాన్సులలో నికర ఆస్తుల వాటా 2.77 శాతం కాగా, గత సంవత్సరం ఇదే కాలానికి అది 4.30 శాతంగా ఉండింది. బ్యాంక్‌ మొత్తం నిరర్థక ఆస్తులు గత సంవత్సరంలో రూ. 5,291 కోట్లు కాగా, ఈ సంవత్సరం అవి రూ. 3,741 కోట్లకు తగ్గి పోయాయి. 

2017 మార్చి నెలలో, దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. విలీన ప్రక్రియ మొదలైన తర్వాత 2020 ఏప్రిల్‌ నాటికి వీటి సంఖ్య 12కి పడిపోయింది. దేశంలో ప్రైవేట్‌ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 21కి చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 10కి తగ్గిపోతుంది. అదే సమయంలో ప్రైవేట్‌ బ్యాంకుల సంఖ్య 23కి పెరుగుతుంది. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి కాదు. ఇటీవలికాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకుల పనితీరు తిరోగ మిస్తోంది. అనేక ప్రైవేట్‌ బ్యాంకులు మునిగిపోయాయి. యస్‌ బ్యాంక్, పీఎమ్‌సీ దీనికి తాజా ఉదాహరణ. కరోనా మహమ్మారి కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు ఎలా పనిచేశాయనన్నది అందరికీ తెలిసిందే.

ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రభు త్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల రాబడి రావచ్చు కానీ, దీన్నుంచి ప్రభుత్వం ఎలా ప్రయోజనం పొందుతుందన్నది పరిశీలించాల్సిన విషయమే. లాభం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై పని ఒత్తిడి, ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంతిమ పరిణామం ఏంట న్నది వేచి చూడాల్సిందే.

– సతీష్‌ సింగ్‌
సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement