Privatization of banks
-
ఐడీబీఐ బ్యాంక్ విక్రయం షురూ
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం తాజాగా తెరతీసింది. ఎల్ఐసీతో కలసి మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు ఆహ్వానం పలికింది. ఆసక్తి గల సంస్థలు బిడ్స్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 16 వరకూ గడువును ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకులో బీమా రంగ పీఎస్‌యూ ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. ప్రభుత్వం 45.48 శాతం వాటాను కలిగి ఉంది. వెరసి సంయుక్తంగా 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రైవేటైజేషన్‌లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. వాటాలతోపాటు బ్యాంకులో యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నట్లు బిడ్స్‌కు ఆహ్వానం పలికిన దీపమ్ వెల్లడించింది. ఇందుకు పలు నిబంధనలు వెల్లడించింది. డీల్ తదుపరి సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది. నిబంధనలివీ..: ఐడీబీఐ కొనుగోలుకి ఈవోఐ దాఖలు చేసే కంపెనీలు కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. అంతేకాకుండా గత ఐదేళ్లలో మూడేళ్లపాటు లాభాలు ఆర్జించిన కంపెనీకి మాత్రమే బిడ్డింగ్‌కు అర్హత లభిస్తుంది. కన్సార్షియంగా ఏర్పాటైతే నాలుగు కంపెనీలను మించడానికి అనుమతించరు. విజయవంతమైన బిడ్డర్ కనీసం ఐదేళ్లపాటు బ్యాంకులో 40% వాటాను తప్పనిసరిగా లాకిన్ చేయాలి. భారీ పారిశ్రామిక, కార్పొరేట్ హౌస్‌లు, వ్యక్తులను బిడ్డింగ్‌కు అనుమతించరు. ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 0.7 శాతం బలపడి రూ. 43 వద్ద ముగిసింది. ఈ ధరలో 60.72 శాతం వాటాకు రూ. 27,800 కోట్లు లభించే వీలుంది. -
హింద్ జింక్‌కు సర్కారు గుడ్‌బై
న్యూఢిల్లీ: మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) తాజాగా అనుమతించింది. హింద్ జింక్‌లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 38,000 కోట్లు సమకూరే అవకాశముంది. బుధవారం సమావేశమైన సీసీఈఏ ఇందుకు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు ఊపు లభించనున్నట్లు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లలో వాటాల వ్యూహాత్మక విక్రయం ద్వారా ఈ ఏడాది రూ. 65,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. రూ. 305 ధరలో..: బుధవారం ట్రేడింగ్‌లో హింద్ జింక్ షేరు బీఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 305 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 317ను అధిగమించింది. ప్రభుత్వం 29.5 శాతం వాటాకు సమానమైన దాదాపు 125 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచనుంది. తద్వారా సుమారు రూ. 38,000 కోట్లు లభించే వీలుంది. కాగా.. 2002 వరకూ హింద్ జింక్ ప్రభుత్వ రంగ సంస్థగా కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం 26 శాతం వాటాను స్టెరిలైట్ అపార్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్‌కు విక్రయించింది.డీల్ విలువ రూ. 445 కోట్లుకాగా.. తద్వారా వేదాంతా గ్రూప్ యాజమాన్య నియంత్రణను చేపట్టింది. తదుపరి వేదాంతా గ్రూప్ ఓపెన్ మార్కెట్ ద్వారా 20 శాతం వాటాను సొంతం చేసుకుంది. అంతేకాకుండా 2003 నవంబర్‌లో ప్రభుత్వం నుంచి మరో 18.92 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఫలితంగా హెచ్‌జెడ్‌ఎల్‌లో వేదాంతా వాటా 64.92 శాతానికి ఎగసింది. కాగా.. హెచ్‌జెడ్‌ఎల్‌లో అదనంగా 5 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఇటీవలే వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ పేర్కొనడం గమనార్హం! -
బ్యాంకుల ప్రైవేటీకరణే పరిష్కారమా?
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల రాబడి రావచ్చు గానీ, దీన్నుంచి స్థూలంగా దేశానికి ఏం ప్రయోజనం కలుగుతుందన్నది ప్రశ్న. ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాలకు సేవలు వంటి లాభదాయకం కాని సేవలనుంచి తప్పుకోవచ్చు. లాభం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై పని ఒత్తిడి, ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది, ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు తిరోగమిస్తోంది. మొత్తంమీద చూస్తే బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది సర్వరోగనివారిణి అయితే కాదు. నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు అనే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించబోతోంది. 2021 ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్లో, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒక ప్రభుత్వ బీమా కంపెనీని 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీ కరించాలనే లక్ష్యాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటీకరణ ప్రక్రియను ముగించడానికి, ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులు తీసుకురావలసి ఉంది. అందుచేత, ప్రభుత్వం బ్యాంకింగ్ లాస్ (సవరణ) బిల్లు, 2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ కనీసం వాటా 51 నుంచి 26 శాతానికి కుదించబడుతుంది. ప్రస్తుతానికి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ వాటాలు దాదాపు రూ. 44 వేల కోట్ల వరకు ఉండవచ్చని లెక్కించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 31,641 కోట్లు కాగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ. 12,359 కోట్లు. ఈ రీతిన ఈ బ్యాంకుల్లో ఉన్న తన వాటాను ప్రభుత్వం అమ్ముకోవడం ద్వారా తానుపెట్టిన మూల ధనాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం తన వాటాని అమ్ముకోవడానికి ఎంత సమయం పడుతుందని చెప్పడం కష్టమవు తుంది. ఈ మూలధనం విలువ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సమయంలో మార్కెట్ పరిస్థితులపైనా, బ్యాంక్ బలంపైనా అంటే బ్యాంకు శాఖలు, కస్టమర్లు, అలాగే బ్యాంక్ బిజినెస్ స్థాయి, నిరర్థక ఆస్తులు (ఎన్పీఎలు) తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులను ప్రైవేటీకరించిన తర్వాత, ఈ బ్యాంకుల్లోకి మూలధనాన్ని మళ్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. పైగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వంటి ప్రభుత్వ విభాగాలు ఈ సంస్థలను పర్యవేక్షించాల్సిన అవసరం ఇకపై ఉండదు. అయితే ఈ రెండు ప్రభుత్వ బ్యాంకులకు చెందిన వాటాలను కొను గోలు చేసిన వారు బ్యాంకును మరింత స్వేచ్ఛగా నిర్వహించు కోగలుగుతారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 95.8 శాతం వాటాలు ఉన్నాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ వాటా 92.4 శాతం వరకు ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన వాటాను ప్రభుత్వం మొదట 51 శాతానికి తగ్గించుకుంటుందనీ, తర్వాత దాన్ని 50 శాతంకంటే తక్కువకు కుదించి ఆ బ్యాంకుల అమ్మకం సజావుగా జరిగేందుకు వీలు కల్పిస్తుందనీ భావిస్తున్నారు. ప్రైవేటీకరణ తర్వాత, ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవచ్చు. దీనివల్ల ప్రభు త్వానికి ఉన్న సంక్షేమ ముద్రపై ప్రతికూల ప్రభావం కలుగుతుంది. భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా ఉద్యోగులు తమ పనిలో చురుకు దనం చూపలేకపోవచ్చు. ఇది ఈ బ్యాంకుల పనితీరునే దెబ్బ తీయవచ్చు. పైగా ఈ రెండు బ్యాంకుల సేవా రుసుములు పెరుగు తాయి. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడం నుంచి ఈ బ్యాంకులు తప్పుకోవచ్చు. ప్రభుత్వ పథకాలను అమలు చేయ డానికి ఇవి ఆసక్తి చూపకపోవచ్చు. పైగా పెన్షన్ పంపిణీ, అటల్ పెన్షన్ యోజన, సుకన్యా సమృద్ధి యోజన వంటి తక్కువ ప్రతిఫలం లభించే తరహా సేవలకు సంబంధించిన పనులు చేయడంపై ఇవి ఆసక్తి చూపకపోవచ్చు. అదే సమయంలో తమ రాబడిని పెంచు కోవడానికి మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి బ్యాంకింగేతర సేవలను అందించడానికి ఈ బ్యాంకులు పూనుకోవచ్చు. ప్రైవేటీకరణ జరిగిన తర్వాత, ఈ బ్యాంకుల పట్ల కస్టమర్లు మనస్సుల్లో ఉండే పరపతి స్థాయి తగ్గిపోవచ్చు. ఇటీవలే యస్ బ్యాంక్, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో–ఆపరేటివ్ బ్యాంక్ (పీఎమ్‌సీ)లు మునిగిపోవడం చూశాం. ప్రభుత్వ పథకాలకు ఒక రూపమివ్వడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై తీవ్రమైన భారం పడవచ్చు. ప్రైవేటీకరణ కోసం ప్రతిపాదించిన బ్యాంకుల పరిమాణం చిన్నది. సెంట్రల్ బ్యాంక్‌లో 33 వేలమంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 2021 ఆర్థిక సంవ త్సరంలో ఆరేళ్ల తర్వాత రూ. 831 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2020 సంవత్సరంలో ఈ బ్యాంకు రూ. 8,527 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 887.58 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 20 శాతం పెరిగి రూ. 161 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలానికి గానూ బ్యాంకు 134 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 6,703.71 కోట్లకు నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 2 శాతం పెరిగి రూ. 6,833. 94 కోట్లకు చేరింది. బ్యాంకు నిర్వహణాత్మక లాభం 42.16 శాతం వృద్ధితో రూ. 1,458 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలా నికి బ్యాంకు లాభం రూ. 1,026 కోట్లు మాత్రమే. గత సంవత్సరం బ్యాంకు నిరర్థక ఆస్తులు 19.89 శాతంగా ఉండగా, ఈ సంవత్సరం అవి 17.36కి తగ్గాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నికరలాభం గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 148 కోట్లు కాగా ఈ సంవత్సరం ఇదే కాలానికి అది రెట్టింపై రూ. 376 కోట్లకు చేరింది. బ్యాంక్ ఇచ్చిన మొత్తం అడ్వాన్సులలో నికర ఆస్తుల వాటా 2.77 శాతం కాగా, గత సంవత్సరం ఇదే కాలానికి అది 4.30 శాతంగా ఉండింది. బ్యాంక్ మొత్తం నిరర్థక ఆస్తులు గత సంవత్సరంలో రూ. 5,291 కోట్లు కాగా, ఈ సంవత్సరం అవి రూ. 3,741 కోట్లకు తగ్గి పోయాయి. 2017 మార్చి నెలలో, దేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. విలీన ప్రక్రియ మొదలైన తర్వాత 2020 ఏప్రిల్ నాటికి వీటి సంఖ్య 12కి పడిపోయింది. దేశంలో ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 21కి చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 10కి తగ్గిపోతుంది. అదే సమయంలో ప్రైవేట్ బ్యాంకుల సంఖ్య 23కి పెరుగుతుంది. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి కాదు. ఇటీవలికాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. ప్రైవేట్ రంగ బ్యాంకుల పనితీరు తిరోగ మిస్తోంది. అనేక ప్రైవేట్ బ్యాంకులు మునిగిపోయాయి. యస్ బ్యాంక్, పీఎమ్‌సీ దీనికి తాజా ఉదాహరణ. కరోనా మహమ్మారి కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎలా పనిచేశాయనన్నది అందరికీ తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రభు త్వానికి కొన్ని వేల కోట్ల రూపాయల రాబడి రావచ్చు కానీ, దీన్నుంచి ప్రభుత్వం ఎలా ప్రయోజనం పొందుతుందన్నది పరిశీలించాల్సిన విషయమే. లాభం అనేది కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన పనిలేదు. మిగిలివున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై పని ఒత్తిడి, ఉద్యోగాలు కోల్పోవడం అనే సమస్యలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంతిమ పరిణామం ఏంట న్నది వేచి చూడాల్సిందే. – సతీష్ సింగ్ సీనియర్ జర్నలిస్టు -
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 2 రోజులు బ్యాంక్ యూనియన్ల సమ్మె!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ డిసెంబర్ 16, 17 తేదీల్లో సమ్మెకు దిగుతామని బ్యాంక్ యూనియన్లు నోటీసులు ఇచ్చాయి. రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం సమాయత్తం అయిన నేపథ్యంలో బ్యాంకులు ఈ రెండు రోజుల సమ్మె బాట పట్టాయి. పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తం అయినప్పటికీ, 2019లో బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీకి మెజారీటీ వాటా విక్రయం ద్వారా ఐడీబీఐని కేంద్రం ఇప్పటికే ప్రైవేటీకరించింది. గడచిన నాలుగు సంవత్సరాల్లో 14 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియను కూడా కేంద్రం విజయవంతంగా పూర్తిచేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తమ వాటాలను 26 శాతానికి తగ్గించుకోడానికి వెసులు బాటు కల్పించడానికి ఉద్దేశించి బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి వీలుగా బ్యాంకింగ్ చట్ట (సవరణ) బిల్లును కేంద్రం లిస్ట్ చేసింది. ఆయా చర్యలను నిరసిస్తూ, రెండు రోజుల సమ్మె నిర్వహించాలని బ్యాంకింగ్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)కు యూఎఫ్‌బీయూ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. -
బ్యాంకుల ప్రైవేటీకరణకు త్వరలో చట్ట సవరణ!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో మెజారిటీ వాటాల విక్రయానికి అనుగుణంగా బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, 2021ను 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. తాజా చట్ట సవరణ బిల్లులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీస ప్రభుత్వ వాటాను 51 శాతం నుండి 26 శాతానికి తగ్గించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఇంకా కేంద్ర మంత్రివర్గం ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ సరికాదు
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం మంచిదికాదని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో ప్రైవేటు బ్యాంకుల పనితీరేమీ అత్యుత్తమ స్థాయిలో ఏమీ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) సహా పలు బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల రుణ కుంభకోణాలు వెలుగుచూసిన నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలంటూ ఇటీవల అనేకమంది ఆర్థిక నిపుణులు గొంతెత్తడం తెలిసిందే. ఇందులో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కూడా ఉన్నారు. ‘బ్యాంకుల్లో మోసాలు చాలా సున్నితమైన అంశం. దీనికి అడ్డుకట్టవేయడం కోసం తగిన మార్గాలను అన్వేషించాలి. ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారం కాదు. పలు దేశాల్లో చాలా ప్రైవేటు బ్యాంకుల పనితీరు అంత గొప్పగా ఏమీ లేదు’ అని యూనస్ వ్యాఖ్యానించారు. ఇక అమెరికా మొదలుపెట్టిన సుంకాల పోరుపై మాట్లాడుతూ.. ఏదేశమైనా మరొక దేశాన్ని దూరం పెట్టడం ప్రతికూల పరిణామమేనన్నారు. ‘సుంకాల విధింపు మంచిదికాదు. . బ్రెగ్జిట్(యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం) కూడా ఇలాంటిదే. ప్రపంచదేశాలు ఒక కామన్ మార్కెట్‌ను నిర్మించే దిశగా చర్యలు చేపట్టాలి’ అని ఆయన చెప్పారు. బాంగ్లాదేశ్‌లో సూక్ష్మ రుణ విప్లవాన్ని సృష్టించిన గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడైన యూనస్‌కు 2006లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. కాగా, భారత్‌లో గ్రామీణ బ్యాంక్ కార్యకలాపాలను విస్తరించే అవకాశం లేదని, ఇక్కడే అనేక సూక్ష్మ రుణ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. -
గ్రామీణ బ్యాంకులపై ప్రై‘వేటు’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చకచకా పావులు కదుపుతోంది. ఈ ప్రక్రియను ముందుగా గ్రామీణ బ్యాంకులతో మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో 49 శాతం వరకూ వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అంతేకాకుండా 3–4 నెలల్లో ప్రారంభ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించనున్నామని.. దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామీణ బ్యాంకులకు నాబార్డ్ ఉత్తర్వులను కూడా జారీచేయడం గమనార్హం. అయితే, ఈ ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యలతో గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం నీరుగారడం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు, చేతివృత్తులు, దారిద్ర రేఖకు దిగువనున్న ప్రజలకు బ్యాంక్ సేవ లు అందించడమే లక్ష్యంగా గ్రామీణ బ్యాంక్‌లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ (ఏపీజీవీబీ), తెలంగాణ (టీజీబీ), ఆంధ్ర ప్రగతి (ఏపీజీబీ), చైతన్య గోదావరి (సీజీజీబీ), సప్తగిరి (ఎస్జీబీ) గ్రామీణ బ్యాంక్‌లున్నాయి. వీటికి 2,160 బ్రాంచీలున్నాయి.ఇందులో తెలంగాణలో 960 శాఖలు, మిగిలినవి ఏపీలో ఉంటాయి. ఏపీజీవీబీ, టీజీబీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఏపీజీబీకి సిండికేట్ బ్యాంక్, సీజీజీబీకి ఆంధ్రా బ్యాంక్, ఎస్‌జీబీకి ఇండియన్ బ్యాంక్‌లు స్పాన్సర్ బ్యాంక్‌లుగా ఉన్నాయి. గ్రామీణ బ్యాం కుల్లో కేంద్రం 50%, స్పాన్సర్ బ్యాంక్‌లు 35%, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు 15% వాటాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల వాటా గోవిందా.. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికీ బ్యాంకింగ్ సేవలందాలన్న లక్ష్యాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరిట నీరుగారుస్తుందని తెలంగాణ రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఆర్‌బీఈఏ) జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటేశ్వర్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. 49% వరకు వాటాను ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేసే వీలు కల్పిస్తూ చట్ట సవరణ కూడా చేశారు. పైగా వాటా విక్రయం తర్వాత కేంద్రం, స్పాన్సర్ బ్యాంక్‌ల వాటా 51%కి తగ్గకూడదనే నిబంధనను పెట్టారు. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడున్న 15% వాటా చేజారుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండే ఏకైక వాణిజ్య బ్యాంక్‌లు గ్రామీణ బ్యాంక్‌లే. ఈ ప్రైవేటీకరణతో రాష్ట్రాలకు ప్రాతినిథ్యం లేకుండా పోతుందని బ్యాంకింగ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రుణ, పొదుపు నిష్పత్తి ఇక్కడే సమానం.. ఏపీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ల్లో 8,600 మంది ఉద్యోగులున్నారు. వీళ్లే కాకుండా 2,400 దినసరి కూలీలు పనిచేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాంక్‌ల్లో 1.1 కోట్ల మంది ఖాతాదారులుంటారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలతో పోల్చినా గ్రామీణ బ్యాంక్‌ల రుణ, పొదుపు నిష్పత్తి దక్షిణాది రాష్ట్రాల్లో సరిసమానంగా, ఉత్తరాదిలో 40–45% వరకు ఉంటుందని వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డిపాజిట్లు, రుణం సమానంగానే ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో రూ.33 వేల కోట్ల డిపాజిట్లుంటే రుణాలు రూ.33–34 వేల కోట్లుగా ఉన్నట్లు వివరించారు. ఏపీజీవీబీ ఐపీఓ బాటలో ఎస్బీఐ... లాభాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో వాటాలను కొనుగోలు చేసేందుకు సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. కేరళ గ్రామీణ బ్యాంక్‌లో ముత్తూట్ ఫైనాన్స్ కొంత వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) ఐపీఓ ద్వారా సుమారు రూ.800 కోట్ల సమీకరించేందుకు ఎస్బీఐ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటాలను బట్టి బోర్డు మెంబర్లు: ప్రస్తుతం గ్రామీణ బ్యాంక్‌ల్లో 9 మంది చొప్పున బోర్డ్ మెంబర్లు ఉన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరేసి, స్పాన్సర్ బ్యాంక్‌ల నుంచి ముగ్గురు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నాబార్డ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. అయితే నిధుల సమీకరణలో 10 శాతం వాటాను కొనుగోలు చేసిన ప్రైవేటు కంపెనీలకు నుంచి బోర్డ్ మెంబర్లలో ఒకరికి, 10–25 శాతం వరకు కొనుగోలు చేస్తే ఇద్దరు, 25 శాతం పైనైతే ముగ్గురు సభ్యులు బోర్డ్ మెంబర్లలో చేరే వీలు కల్పించారు. లాభాల్లోనే 50 బ్యాంక్‌లు.. దేశంలో ఉన్న మొత్తం 56 గ్రామీణ బ్యాంక్‌లకు గాను 50 బ్యాంక్‌లు లాభాల్లోనే ఉన్నాయి. కశ్మీర్‌లోని ఇలాఖీ దెహతీ (ఈడీ), నాగాలాండ్, మణిపూర్ గ్రామీణ బ్యాంక్‌లు, బెంగాల్‌లోని భంగియ గ్రామీణ వికాస్ (బీజీవీబీ), మధ్యప్రదేశ్‌లోని మధ్యాంచల్ గ్రామీణ బ్యాంక్, ఒడిశాలోని ఉత్కల్ గ్రామీణ బ్యాంక్‌లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. 50 బ్యాంక్‌లు కలిపి రూ.4,096 కోట్ల స్థూల లాభాలు చూపించాయి. రూ.2,573 కోట్ల నికర లాభాలను ఆర్జించాయి. వివిధ పన్నుల రూపంలో రూ.1,414 కోట్లు చెల్లించాయి. దేశంలో గ్రామీణ బ్యాంక్‌ల ముఖ చిత్రమిది మొత్తం బ్యాంక్‌లు : 56 బ్రాంచీలు : 21,398 ఖాతాలు : 23 కోట్లు డిపాజిట్లు : రూ.3.72లక్షల కోట్లు రుణాలు : 2.28 లక్షల కోట్లు రిజర్వ్ నిధులు : రూ.23 వేల కోట్లు నికర ఎన్పీఏ : 4.41 శాతం మొత్తం ఉద్యోగులు : 86,555 -
బ్యాంకులను ప్రైవేటీకరించడం మంచిదా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను భారీగా దోచుకొని పారిపోయారనే లాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే డిమాండ్ ముందుకు వస్తుంది. ఈసారి కూడా మన భారత ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ఇదే మాటన్నారు. భారత వాణిజ్య మండళ్లు, పారిశ్రామిక సమాఖ్య ఇదే డిమాండ్ చేసింది. భారత పారిశ్రామిక, అనుబంధ వాణిజ్య మండళ్ల సంస్థ దీనికే పిలుపునిచ్చింది. ఇక ‘అబ్బే! ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణ సరిగ్గా ఉండదు. ప్రైవేటు బ్యాంకుల ఉన్నతాధికారులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకు ఉన్నతాధికారులకు చాలా తక్కువ జీతాలు ఉంటాయి. ప్రోత్సహకాలు కూడా పెద్దగా ఉండవు. దాంతో వారికి ప్రభుత్వ బ్యాంకుల అభివద్ధి పట్ల అంత శ్రద్ధ ఉండదు, పైగా ప్రభుత్వం, ప్రభుత్వ ఉన్నతాధికారుల మాటలు వినాల్సి వస్తుంది. అందుకుని వారిపై షేర్ హోల్డర్లకు కూడా పట్టు ఉండదు’ లాంటి మాటలు మధ్యతరగతి మేథావుల దగ్గరి నుంచి తరచూ వినిపిస్తాయి. అంటే ప్రభుత్వ బ్యాంకులకన్నా ప్రైవేటు బ్యాంకులు సక్రమంగా నడుస్తున్నాయా? ప్రైవేటు బ్యాంకుల్లో అవినీతి చోటుచేసుకోవడం లేదా? 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశం మొత్తం మీద 12,778 బ్యాంకు కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, వాటిలో ప్రభుత్వ బ్యాంకుల్లో 8,622 కుంభకోణాలు, ప్రైవేటు బ్యాంకుల్లో 4,156 కుంభకోణాలు చోటు చేసుకున్నాయని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రైవేటు బ్యాంకుల్లో కూడా అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి, కాకపోతే తక్కువ సంఖ్యలో. బ్యాంకుల్లో కుంభకోణాలు జరగడానికి కారణం ప్రధానంగా నియంత్రణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు తెలియజేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో నియంత్రణా వ్యవస్థ సరిగ్గా ఉన్నట్లయితే కుంభకోణం మొదలైన 2011 సంవత్సరంలోనే అది బయటపడి ఉండేదని వారంటున్నారు. నియంత్రణా వ్యవస్థ ఎలా ఉండాలనే అంశాన్ని చర్చించకుండా ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఓ చాప కింది మట్టిని మరో చాప కిందకు నెట్టడమే అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. -
ఉద్యోగుల సమ్మెతో బ్యాంకుల మూత
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని, బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతూ యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ (యూఎఫ్బీఐఎస్) ఇచ్చిన రెండు రోజుల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో మొదటి రోజు సోమవారం బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ప్రైవేట్ బ్యాంకుల మినహా ఇతర వాణిజ్య, గ్రామీణ బ్యాంకు శాఖలన్నీ మూతబడ్డాయి. జిల్లాలో మొత్తం 400 బ్యాంకు శాఖల్లో లావాదేవీలు స్తంభించాయి. నగదు లేక ఏటీఎంలు కూడా మూతబడటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో సుమారు 10 వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. అంతేకాకుండా వెయ్యి కోట్ల రూపాయలు క్లియరింగ్ లావాదేవీలు నిలిచిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చేతిలో నగదు లేక ఖాతాదారులు నానా అవస్థలు పడ్డారు. ఒంగోలు నగరంలోని బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొని స్థానిక నెల్లూరు బస్టాండ్ సెంటర్లోని ఆంధ్రాబ్యాంకు ప్రధానశాఖ వద్దకు చేరి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ వి.పార్థసారథి అధ్యక్షత వహించి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు న్యాయమైన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐబీఏ ఇస్తానన్న 10 శాతం వేతన సవరణను యూఎఫ్‌బీయూ తిరస్కరించిందన్నారు. కనీసం17 శాతం వేతన సవరణకు ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగులకు న్యాయమైన వేతన సవరణలను త్వరలో అమలు చేయకపోతే నిరవధిక సమ్మెలో పాల్గొనేందుకు కూడా వెనుకాడేది లేదని పార్థసారథి హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవీంద్రనాథ్ మాట్లాడుతూ 1969లో జాతీయకరణ చేసిన బ్యాంకుల ద్వారా అట్టడుగు వర్గాలు ఆర్థికాభివృద్ధి సాధించారన్నారు. బ్యాంకులు చేసిన సేవలను పాలకవర్గాలు మరిచిపోయి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో అర్థం పర్థం లేని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు, విద్య, వైద్యం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినందున దానికి అనుగుణంగా ఉద్యోగుల జీతాలు కూడా పెరగాలని కోరారు. కోట్ల ఆదాయం బ్యాంకుల ద్వారా ఈ ఐదేళ్లలో వచ్చిందని, దీనిలో కనీసం 7 వేల కోట్లు ఇస్తే బ్యాంకు ఉద్యోగుల సమస్య తీరిపోతుందని సూచించారు. మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి వి.ప్రకాశరావు మాట్లాడుతూ సంస్కరణల పేరుతో అనేక ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి బ్యాంకింగ్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. ఏపీజీబీ నాయకుడు సుబ్బారావు మాట్లాడుతూ మోసపూరితంగా ప్రవర్తిస్తున్న ఐబీఏ, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా భవిష్యత్తులో యూఎఫ్‌బీయూ ఎటువంటి పిలుపునిచ్చినా హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నామని, న్యాయమైన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐబీఓఏ నాయకుడు డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ సీఎల్సీ ఇచ్చిన సూచన మేరకు ఐబీఏ చర్చలకు పిలిచి బ్యాంకు ఉద్యోగస్తులను అవమానానికి గురి చేసిందని, దీనికి నిరసనగా రెండు రోజుల పాటు సమ్మె చేస్తున్నామని చెప్పారు. ఏఐబీఓసీ నాయకుడు సాంబయ్య మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, ఎందుకని అడిగితే జీతాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారన్నారు. బ్యాంకుల్లో కనీస వేతనం రూ. 25 వేలు ఉండాలని డిమాండ్ చేశారు. ఏఐబీఓఏ నాయకుడు పీకే రాజేశ్వరరావు మాట్లాడుతూ 9వ వేతన సవరణ గడువు ముగిసి 15 నెలలైందని, అయినా ఇంత వరకు వేతన సవరణ జరగకపోవడం విచారకరమన్నారు. ఏఐబీఓసీ అధ్యక్షుడు పి.మల్లికార్జునరావు, ఏఐబీఈఏ పట్టణ కార్యదర్శి వి.రామచంద్రరావులు మాట్లాడుతూ తమ న్యాయమైన వేతన సవరణను వెంటనే అమలు చేయాలని, వారానికి 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐబీఈఏ జిల్లా కార్యదర్శి వి.వేణుగోపాల్ మాట్లాడుతూ ఐబీఏ, కేంద్రప్రభుత్వం తమ మొండివైఖరులను మార్చుకుని బ్యాంకు ఉద్యోగులు కోరుతున్న న్యాయమైన వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఈహెచ్ అధ్యక్షుడు శోభన్‌బాబు మాట్లాడుతూ న్యాయమైన కోర్కెలను వెంటనే అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎం.నరేంద్రబాబు, ఎ.వేణుగోపాల్, బీవీ కృష్ణారెడ్డి, డేవిడ్‌కింగ్, పి.బ్రహ్మాయ్య, ఎ.కోటేశ్వరరావు, వంశీకృష్ణ, సీహెచ్ ఉమాపతి, ఎన్. వెంకటేశ్వర్లు, టి.మల్లికార్జునరావు, నారాయణమూర్తి, జనార్దన్, ఆంజనేయులు, కె.రవిప్రకాశ్, శ్రీనివాసరెడ్డి, కె.జానకీరామయ్య, చలపతి, ఉమామహేశ్వరరావు, మృధుల, చాముండేశ్వరీ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.