గ్రామీణ బ్యాంకులపై ప్రై‘వేటు’! | Rural banks privatization | Sakshi
Sakshi News home page

గ్రామీణ బ్యాంకులపై ప్రై‘వేటు’!

Published Wed, Mar 14 2018 12:47 AM | Last Updated on Wed, Mar 14 2018 12:47 AM

Rural banks privatization - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చకచకా పావులు కదుపుతోంది. ఈ ప్రక్రియను ముందుగా గ్రామీణ బ్యాంకులతో మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో 49 శాతం వరకూ వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

అంతేకాకుండా 3–4 నెలల్లో ప్రారంభ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) ద్వారా స్టాక్‌ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించనున్నామని.. దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామీణ బ్యాంకులకు నాబార్డ్‌ ఉత్తర్వులను కూడా జారీచేయడం గమనార్హం. అయితే, ఈ ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యలతో గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం నీరుగారడం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న, సన్నకారు రైతులు, చేతివృత్తులు, దారిద్ర రేఖకు దిగువనున్న ప్రజలకు బ్యాంక్‌ సేవ లు అందించడమే లక్ష్యంగా గ్రామీణ బ్యాంక్‌లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ (ఏపీజీవీబీ), తెలంగాణ (టీజీబీ), ఆంధ్ర ప్రగతి (ఏపీజీబీ), చైతన్య గోదావరి (సీజీజీబీ), సప్తగిరి (ఎస్‌జీబీ) గ్రామీణ బ్యాంక్‌లున్నాయి. వీటికి 2,160 బ్రాంచీలున్నాయి.ఇందులో తెలంగాణలో 960 శాఖలు, మిగిలినవి ఏపీలో ఉంటాయి. ఏపీజీవీబీ, టీజీబీలకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఏపీజీబీకి సిండికేట్‌ బ్యాంక్, సీజీజీబీకి ఆంధ్రా బ్యాంక్, ఎస్‌జీబీకి ఇండియన్‌ బ్యాంక్‌లు స్పాన్సర్‌ బ్యాంక్‌లుగా ఉన్నాయి. గ్రామీణ బ్యాం కుల్లో కేంద్రం 50%, స్పాన్సర్‌ బ్యాంక్‌లు 35%, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు 15% వాటాలు ఉంటాయి.

రాష్ట్ర ప్రభుత్వాల వాటా గోవిందా..
దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికీ బ్యాంకింగ్‌ సేవలందాలన్న లక్ష్యాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరిట నీరుగారుస్తుందని తెలంగాణ రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఆర్‌బీఈఏ) జనరల్‌ సెక్రటరీ ఎస్‌.వెంకటేశ్వర్‌ రెడ్డి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. 49% వరకు వాటాను ప్రైవేట్‌ వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేసే వీలు కల్పిస్తూ చట్ట సవరణ కూడా చేశారు.

పైగా వాటా విక్రయం తర్వాత కేంద్రం, స్పాన్సర్‌ బ్యాంక్‌ల వాటా 51%కి తగ్గకూడదనే నిబంధనను పెట్టారు. అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడున్న 15% వాటా చేజారుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండే ఏకైక వాణిజ్య బ్యాంక్‌లు గ్రామీణ బ్యాంక్‌లే. ఈ ప్రైవేటీకరణతో రాష్ట్రాలకు ప్రాతినిథ్యం లేకుండా పోతుందని బ్యాంకింగ్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

రుణ, పొదుపు నిష్పత్తి ఇక్కడే సమానం..
ఏపీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ల్లో 8,600 మంది ఉద్యోగులున్నారు. వీళ్లే కాకుండా 2,400 దినసరి కూలీలు పనిచేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో  గ్రామీణ బ్యాంక్‌ల్లో 1.1 కోట్ల మంది ఖాతాదారులుంటారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలతో పోల్చినా గ్రామీణ బ్యాంక్‌ల రుణ, పొదుపు నిష్పత్తి దక్షిణాది రాష్ట్రాల్లో సరిసమానంగా, ఉత్తరాదిలో 40–45% వరకు ఉంటుందని వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డిపాజిట్లు, రుణం సమానంగానే ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో రూ.33 వేల కోట్ల డిపాజిట్లుంటే రుణాలు రూ.33–34 వేల కోట్లుగా ఉన్నట్లు వివరించారు.


ఏపీజీవీబీ ఐపీఓ బాటలో ఎస్‌బీఐ...
లాభాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో వాటాలను కొనుగోలు చేసేందుకు సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐ), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. కేరళ గ్రామీణ బ్యాంక్‌లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ కొంత వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) ఐపీఓ ద్వారా సుమారు రూ.800 కోట్ల సమీకరించేందుకు ఎస్‌బీఐ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

వాటాలను బట్టి బోర్డు మెంబర్లు: ప్రస్తుతం గ్రామీణ బ్యాంక్‌ల్లో 9 మంది చొప్పున బోర్డ్‌ మెంబర్లు ఉన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరేసి, స్పాన్సర్‌ బ్యాంక్‌ల నుంచి ముగ్గురు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), నాబార్డ్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. అయితే నిధుల సమీకరణలో 10 శాతం వాటాను కొనుగోలు చేసిన ప్రైవేటు కంపెనీలకు నుంచి బోర్డ్‌ మెంబర్లలో ఒకరికి, 10–25 శాతం వరకు కొనుగోలు చేస్తే ఇద్దరు, 25 శాతం పైనైతే ముగ్గురు సభ్యులు బోర్డ్‌ మెంబర్లలో చేరే వీలు కల్పించారు.

లాభాల్లోనే 50 బ్యాంక్‌లు..
దేశంలో ఉన్న మొత్తం 56 గ్రామీణ బ్యాంక్‌లకు గాను 50 బ్యాంక్‌లు లాభాల్లోనే ఉన్నాయి. కశ్మీర్‌లోని ఇలాఖీ దెహతీ (ఈడీ), నాగాలాండ్, మణిపూర్‌ గ్రామీణ బ్యాంక్‌లు, బెంగాల్‌లోని భంగియ గ్రామీణ వికాస్‌ (బీజీవీబీ), మధ్యప్రదేశ్‌లోని మధ్యాంచల్‌ గ్రామీణ బ్యాంక్, ఒడిశాలోని ఉత్కల్‌ గ్రామీణ బ్యాంక్‌లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. 50 బ్యాంక్‌లు కలిపి రూ.4,096 కోట్ల స్థూల లాభాలు చూపించాయి. రూ.2,573 కోట్ల నికర లాభాలను ఆర్జించాయి. వివిధ పన్నుల రూపంలో రూ.1,414 కోట్లు చెల్లించాయి.


దేశంలో గ్రామీణ బ్యాంక్‌ల ముఖ చిత్రమిది
మొత్తం బ్యాంక్‌లు    :    56
బ్రాంచీలు    :    21,398
ఖాతాలు    :    23 కోట్లు
డిపాజిట్లు    :    రూ.3.72లక్షల కోట్లు
రుణాలు    :    2.28 లక్షల కోట్లు
రిజర్వ్‌ నిధులు    :    రూ.23 వేల కోట్లు
నికర ఎన్‌పీఏ    :    4.41 శాతం
మొత్తం ఉద్యోగులు    :    86,555

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement