న్యూఢిల్లీ: భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం మంచిదికాదని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో ప్రైవేటు బ్యాంకుల పనితీరేమీ అత్యుత్తమ స్థాయిలో ఏమీ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) సహా పలు బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల రుణ కుంభకోణాలు వెలుగుచూసిన నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలంటూ ఇటీవల అనేకమంది ఆర్థిక నిపుణులు గొంతెత్తడం తెలిసిందే.
ఇందులో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కూడా ఉన్నారు. ‘బ్యాంకుల్లో మోసాలు చాలా సున్నితమైన అంశం. దీనికి అడ్డుకట్టవేయడం కోసం తగిన మార్గాలను అన్వేషించాలి. ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారం కాదు. పలు దేశాల్లో చాలా ప్రైవేటు బ్యాంకుల పనితీరు అంత గొప్పగా ఏమీ లేదు’ అని యూనస్ వ్యాఖ్యానించారు. ఇక అమెరికా మొదలుపెట్టిన సుంకాల పోరుపై మాట్లాడుతూ.. ఏదేశమైనా మరొక దేశాన్ని దూరం పెట్టడం ప్రతికూల పరిణామమేనన్నారు.
‘సుంకాల విధింపు మంచిదికాదు. . బ్రెగ్జిట్(యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం) కూడా ఇలాంటిదే. ప్రపంచదేశాలు ఒక కామన్ మార్కెట్‌ను నిర్మించే దిశగా చర్యలు చేపట్టాలి’ అని ఆయన చెప్పారు. బాంగ్లాదేశ్‌లో సూక్ష్మ రుణ విప్లవాన్ని సృష్టించిన గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడైన యూనస్‌కు 2006లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. కాగా, భారత్‌లో గ్రామీణ బ్యాంక్ కార్యకలాపాలను విస్తరించే అవకాశం లేదని, ఇక్కడే అనేక సూక్ష్మ రుణ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment