సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను భారీగా దోచుకొని పారిపోయారనే లాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే డిమాండ్ ముందుకు వస్తుంది. ఈసారి కూడా మన భారత ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ఇదే మాటన్నారు. భారత వాణిజ్య మండళ్లు, పారిశ్రామిక సమాఖ్య ఇదే డిమాండ్ చేసింది. భారత పారిశ్రామిక, అనుబంధ వాణిజ్య మండళ్ల సంస్థ దీనికే పిలుపునిచ్చింది.
ఇక ‘అబ్బే! ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణ సరిగ్గా ఉండదు. ప్రైవేటు బ్యాంకుల ఉన్నతాధికారులతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకు ఉన్నతాధికారులకు చాలా తక్కువ జీతాలు ఉంటాయి. ప్రోత్సహకాలు కూడా పెద్దగా ఉండవు. దాంతో వారికి ప్రభుత్వ బ్యాంకుల అభివద్ధి పట్ల అంత శ్రద్ధ ఉండదు, పైగా ప్రభుత్వం, ప్రభుత్వ ఉన్నతాధికారుల మాటలు వినాల్సి వస్తుంది. అందుకుని వారిపై షేర్ హోల్డర్లకు కూడా పట్టు ఉండదు’ లాంటి మాటలు మధ్యతరగతి మేథావుల దగ్గరి నుంచి తరచూ వినిపిస్తాయి.
అంటే ప్రభుత్వ బ్యాంకులకన్నా ప్రైవేటు బ్యాంకులు సక్రమంగా నడుస్తున్నాయా? ప్రైవేటు బ్యాంకుల్లో అవినీతి చోటుచేసుకోవడం లేదా? 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశం మొత్తం మీద 12,778 బ్యాంకు కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, వాటిలో ప్రభుత్వ బ్యాంకుల్లో 8,622 కుంభకోణాలు, ప్రైవేటు బ్యాంకుల్లో 4,156 కుంభకోణాలు చోటు చేసుకున్నాయని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రైవేటు బ్యాంకుల్లో కూడా అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి, కాకపోతే తక్కువ సంఖ్యలో.
బ్యాంకుల్లో కుంభకోణాలు జరగడానికి కారణం ప్రధానంగా నియంత్రణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు తెలియజేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో నియంత్రణా వ్యవస్థ సరిగ్గా ఉన్నట్లయితే కుంభకోణం మొదలైన 2011 సంవత్సరంలోనే అది బయటపడి ఉండేదని వారంటున్నారు. నియంత్రణా వ్యవస్థ ఎలా ఉండాలనే అంశాన్ని చర్చించకుండా ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఓ చాప కింది మట్టిని మరో చాప కిందకు నెట్టడమే అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment